పాలకూర, శనగపిండి కలిపి అట్లు పోసుకుని చూశారా? పాలకూరతో కూర చేసుకుని తినడం ఇష్టం లేని వాళ్లకి కూడా ఇది నచ్చేస్తుంది. పాలకూరలో ఉండే పోషకాలు అందాలని తినడానికి ప్రయత్నించినా కొందరికి రుచి నచ్చక దాని జోలికి పోరు. అందుకే సింపుల్‌గా ఈ పాలకూర అట్లు ఎలా చేసుకోవాలో చూసేయండి.
1 కప్పు శనగపిండి
1 కట్ట పాలకూర
అంగుళం అల్లం ముక్క
1 ఉల్లిపాయ, సన్నటి ముక్కలు
కొద్దిగా కొత్తిమీర తరుగు
1 టమాటా, సన్నటి ముక్కలు
పావు కప్పు పన్నీర్ తురుము (ఆప్షనల్)
తగినంత ఉప్పు
టీస్పూన్ పసుపు
పావు టీస్పూన్ మిరియాల పొడి
పావు టీస్పూన్ కారం
1. ముందుగా పాలకూర శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో నీల్లు పోసుకుని మరిగించి స్టవ్ కట్టేయాలి. అందులో పాలకూర ఆకులు వేసుకుని మూత పెట్టేయాలి.
2. రెండు నిమిషాలయ్యాక పాలకూర నుంచి నీళ్లు వంపేయాలి. చల్లారేదాకా ఆగి అల్లం ముక్క వేసుకుని పాలకూరను మిక్సీ పట్టుకోవాలి. మీకిష్టముంటే అలాగే ఉంచినా పర్వాలేదు.
3. ఇప్పుడు పెద్ద బౌల్ లో శనగపిండి పోసుకోవాలి. అందులోనే పసుపు, మిరియాల పొడి, కారం వేసుకోవాలి. ఒకసారి కలుపుకుని మిక్సీ పట్టుకున్న పాలకూరను కూడా వేసుకోవాలి.
4. నీళ్లు పోసుకుంటే శనగపిండి మిశ్రమాన్ని జారుగా కలుపుకోవాలి. దోసెల పిండి కన్నా కాస్త చిక్కగా ఉండాలి.
5. ఒక గిన్నెలో సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. మీకిష్టముంటే కొద్దిగా పన్నీర్ తురుము కూడా వేసుకుని కలుపుకోవాలి.
6. ఇప్పుడు పెనం పెట్టుకుని వేడెక్కాక నూనె పెనం అంతటా రాసుకోవాలి. ఒక గరిటెతో పిండి పోసుకుని కాస్త వెడల్పుగా అనుకోవాలి.
7. మీద ఉల్లిపాయ ముక్కల మిశ్రమం చల్లుకోవాలి. అంచుల వెంబడి నూనె వేసుకుని బాగా కాల్చుకోవాలి.
8. మరో వైపు కూడా అలాగే కాల్చుకుని తీసేసుకుంటే సరి. పాలకూర శనగపిండి అట్లు రెడీ అయినట్లే. వీటిని అలాగే తినేయొచ్చు. లేదా ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.
టాపిక్