Mango Treat | మామిడి పండ్లతో పసందైన విందు చేసుకుంటూ వేసవిని ఆస్వాదించండి!
ఇది మామిడి పండ్ల సీజన్. ఈ సీజన్లో ఎక్కువగా లభించే మామిడిపండ్లను తినకుండా ఉండలేము. మామిడిని ఎన్నిరకాలుగా తిన్నా.. తనివి తీరదు. ఇంకా ఇంకా తినాలనిపించే మామిడిని కొత్తగా ఇలా తినడానికి ట్రై చేయండి..
ఇప్పుడున్నది మామిడి పండ్ల సీజన్. ఎండాకాలం ఎండలు మనల్ని చికాకుపరిచినా, మామిడి పండ్లు మాత్రం మన నోటికి రుచిని, కడుపుకు ఆనందాన్ని పంచుతాయి. తాజా పండ్లలో రారాజు అయిన మామిడి పండును పీల్చి, పిప్పి చేసి తినకుండా ఎవరు ఊరుకుంటారు? ఇంకా విశేషం ఏమిటంటే ఈ మామిడిని మనం ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. కాయగా ఉన్నపుడు ఆవకాయ చేయవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఉప్పుకారం అద్దుకొని తినవచ్చు. అలాగే పండుగా మారితే అందులోని రసాన్ని నేరుగా తీసుకోవచ్చు, ముక్కలు చేసుకొని తినవచ్చు, వెరైటీ జ్యూసులు, ఐస్ క్రీంలు స్మూతీలు చేసుకొని ఆస్వాదించవచ్చు.
మామిడి పండ్లలో శరీరానికి అవసరమయ్యే మెగ్నీషియం, పొటాషియం లాంటి పోషకాలు లభిస్తాయి. ఈ సీజన్‌లో మామిడిపండ్లను వదిలిపెట్టకుండా తినాలని పోషకాహార నిపుణులు సలహాలు ఇస్తారు. ప్రతిరోజూ మీ భోజనంతో పాటు ఒక మామిడిపండును తినండి, స్నాక్స్ లాగా తీసుకోండి. లేదా వెరైటీగా ఇంకా రుచిగా కావాలంటే మామిడి పండ్లతో చేసే రెండు రెసిపీలు అందిస్తున్నాం. వీలైతే మీరూ చేసుకోండి.
కొకొనట్ మ్యాంగో ఓట్ మీల్
కావలసినవి:
• ½ కప్ రోల్డ్ వోట్స్
• ½ కప్పు తియ్యని బాదం పాలు
• ½ కప్పు మామిడిపండు
• 1 చెంచా తురిమిన కొబ్బరి
• 1 1/2 స్పూన్ తేనె
తయారీ విధానం:
• పాలను వేడి చేయండి. అందులో ఓట్స్ వేయండి
• ఇప్పుడు మామిడి ముక్కలు, తురిమిన కొబ్బరిని వేయండి.
• రెడీ అయింది, దీనికి తేనును కలుపుకొని తినేయడమే.
మ్యాంగో డెసర్ట్ గ్లాస్
కావలసినవి:
• 1 కప్పు పాలు
• ½ కప్ క్రీమ్
• 1 టేబుల్ స్పూన్ తేనె
• ½ tsp దాల్చిన చెక్క పొడి
• ½ కప్పు మామిడి ముక్కలు
• అలంకరిణ కోసం పుదీనా
తయారీ విధానం:
• పాన్ వేడి చేసి, అందులో పాలు, క్రీమ్ వేసి సగానికి తగ్గేవరకు వేడిచేయండి.
• తర్వాత తేనె, దాల్చిన చెక్క పొడిని కలపండి
• ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చి, ఆపై మామిడి ముక్కలను వేయండి.
• ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి తీసుకొని. దీన్ని రెండు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచండి.
• చివరగా పుదీనా రెమ్మతో అలంకరించి సర్వ్ చేసుకోండి.
ఈ రెసిపీలను ది రిసార్ట్ ముంబైలో ఎగ్జిక్యూటివ్ చెఫ్ అయిన అమిత్ అందిచారు.
సంబంధిత కథనం