Taiwan Tour | బంపర్ ఆఫర్.. ఆ దేశంలో విహారయాత్ర చేస్తే పర్యాటకులకు ఉచితంగా డబ్బు!
Taiwan Tour: మీరు విదేశాల్లో డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే తైవాన్ వెళ్లండి, అయితే అక్కడికి వెళ్లి మీరు ఏ పని చేయకపోయినా కేవలం వారి ద్వీపంలో పర్యటిస్తున్నందుకే మీకు డబ్బు చెల్లిస్తారు. అదెలాగో చూడండి..
Taiwan Tour: మీరు ఏదైనా ప్రదేశానికి విహారయాత్ర చేస్తే అక్కడ ఆతిథ్యం గురించి ముందుగా విచారణ చేస్తారు. అక్కడ ఉండటానికి బస ఏ విధంగా ఉంది, వసతులు ఎలా ఉన్నాయి, చుట్టుపక్కల ప్రదేశాలు చుట్టి రావడానికి ప్రయాణ వసతులు, రుచికరమైన ఆహారం వంటి వాటి గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటారు. అన్నీ బాగుంటే అక్కడి ఆతిథ్యం బాగుంది అని చెబుతారు. అయితే ఇవేమి ఉచితం కాదు, సాధారణంగా వీటన్నింటికీ ఎవరి ఖర్చులు వారే భరిస్తారు. అలా కాకుండా మీరు ఆ ప్రదేశంలో పర్యటిస్తున్నందుకు వారే మీకు తిరిగి చెల్లిస్తే ఎలా ఉంటుంది? వారే మీ ఖర్చులకు కొంత డబ్బులు ఇస్తే ఎలా ఉంటుంది? ఇలా ఎక్కడా ఉండదు అని అనుకుంటున్నారా? కానీ ఒక చోట ఉంది. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ! అది ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే అలా తైవాన్ వరకు వెళ్లి వద్దాం పదండి.
తైవాన్ అనేది స్వతంత్ర పరిపాలన కలిగిన ఒక దీవి. పర్యాటక రంగాన్ని బలోపేతం చేసే దిశగా అక్కడి పరిపాలనా యంత్రాంగం వినూత్న ఆఫర్లను ప్రకటిస్తోంది. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు తైవాన్ ప్రభుతం తమ ద్వీపంలో పర్యటించే వారికి నగదు ప్రోత్సహకాలు, పలు రకాల డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో భాగంగా తైవాన్ పర్యటించే ఏ అంతర్జాతీయ ప్రయాణికుడికైనా ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి 165 డాలర్లు చెల్లించనున్నారు. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.13 వేలు. బృందంగా పర్యటించే మరిన్ని ప్రయోజనాలను చేకూర్చనున్నారు. గ్రూప్ టూర్ చేసే వారికి వారి బృందంలో ఉన్న సభ్యులను బట్టి 658 డాలర్ల వరకు చెల్లించనున్నారు. భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 54,500/- వరకు చెల్లించనున్నారు. తమ తాజా స్కీములను తైవాన్ ప్రీమియర్ చెన్ చియెన్-జెన్ ప్రకటించారు.
త్వరపడండి.. ఆఫర్ కొద్ది మందికి మాత్రమే
యాత్రికులకు నగదు ప్రోత్సాహాకాలు అందించే ఆఫర్ కొద్ది మందికి మాత్రమే. సోలో యాత్రికులకు మొదటి 5 లక్షల మందికి మాత్రమే 165 డాలర్ల చొప్పున చెల్లించనున్నారు. అలాగే గ్రూప్‌గా ప్రయాణించే వారి సంఖ్యను 90 వేలకు పరిమితం చేశారు. 2023 సంవత్సరంలో సుమారు 60 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించాలని తైవాన్ యోచిస్తోంది. కాగా, గతేడాది 2022లో తైవాన్ ను సందర్శించిన వారి సంఖ్య 10 లక్షలు కూడా దాటకపోవడం గమనార్హం. మరి ఈ ఉచిత పథకాలతోనైనా పర్యాటకులు పెరుగుతారేమో చూడాలి.
హాంకాంగ్ పరిపాలన కూడా ఫిబ్రవరిలో ఇదే విధమైన ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ ప్రయాణికులకు 5 లక్షల ఉచిత విమాన టిక్కెట్లను ఆఫర్ చేసింది.
మీరూ తైవాన్ పర్యటించాలనుకుంటున్నారా? భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు తైవాన్ సందర్శించడానికి ముందస్తు వీసా పొందడం తప్పనిసరి. వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు.. తైవాన్ సందర్శన ఉద్దేశ్యం, రౌండ్-ట్రిప్ విమాన టిక్కెట్లు, హోటల్ బుకింగ్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, విజిటర్ వీసా విషయంలో ఆహ్వాన లేఖను కూడా చూపించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం