Breakfast Recipes : ఈ ఆరోగ్యకరమైన స్మూతీతో.. రోగనిరోధక శక్తి బలపడుతుంది..-today breakfast recipe is healthy smoothie with spinach and oats and ground flax seeds
Telugu News  /  Lifestyle  /  Today Breakfast Recipe Is Healthy Smoothie With Spinach And Oats And Ground Flax Seeds
హెల్తీ స్మూతీ
హెల్తీ స్మూతీ

Breakfast Recipes : ఈ ఆరోగ్యకరమైన స్మూతీతో.. రోగనిరోధక శక్తి బలపడుతుంది..

15 July 2022, 7:03 ISTGeddam Vijaya Madhuri
15 July 2022, 7:03 IST

Breakfast Recipes : మీ రోజువారీ ఆహారంలో పోషకాలను చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుతుంది. ఇలా రోగనిరోధక శక్తి పెంచుకోవాలనుకునేవారు.. తమ డైట్​లో పోషకాలున్న స్మూతీలను బ్రేక్​ఫాస్ట్​లో చేర్చుకోవచ్చు. ఇవి మీకు కడుపు నిండేలా చేయడమే కాకుండా.. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Breakfast Recipes : అసలే వర్షాకాలం. సీజనల్ వ్యాధులతో పాటు.. కోవిడ్, జీకా, మంకీపాక్స్ వంటి కొత్త వైరస్​లు ప్రబలే సమయం. ఈ సమయంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే బలమైన రోగనిరోధక వ్యవస్థ వైరల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా, వ్యాధికారకాల నుంచి మనల్ని కాపాడుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో పోషకాహారాలు చేర్చుకోవాలి.

అయితే ఉదయాన్నే ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం ఇక్కడ స్మూతీ ఉంది. మీరు జిమ్ నుంచి వచ్చిన తర్వాత అయినా.. లేదా ఆఫీస్​కు వెళ్తున్నా.. ఇంట్లోనే ఉన్నా దీనిని హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్​గా ఉంచడమే కాకుండా మీ శక్తి స్థాయిలను పెంచుతుంది. అయితే ఈ హెల్తీ స్మూతీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హెల్తీ స్మూతీ తయారీకి కావాల్సిన పదార్థాలు

* బచ్చలి కూర - 1 కట్ట (ఆకులను కట్ చేసి పెట్టుకోవాలి)

* ఓట్స్ - 2 స్పూన్స్

* అవిసె గింజలు పొడి - 2 స్పూన్స్

* అల్లం - 1 స్పూన్

* నిమ్మరసం - 2 స్పూన్స్

* అరటి పండు - 1

హెల్తీ స్మూతీ తయారీ విధానం

వోట్స్, బచ్చలికూర, అవిసె గింజలు స్మూతీ తయారు చేయడం చాలా సులభం. ముందు ఓట్స్​ను మిక్సీలో వేసి పౌడర్ చేయాలి. దానిలో అవిసె గింజల పొడి, అల్లం, బచ్చలి కూర, అరటిపండు వేసి.. మిక్సీ చేయాలి. స్మూతీలా వచ్చే వరకు గ్రైండ్ చేయాలి. అంతే మీ స్మూతీ రెడీ. ఓ గ్లాస్​లో తీసుకుని.. మీ బ్రేక్ ఫాస్ట్​ చేసేయవచ్చు.

యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో నిండిన ఈ పోషకమైన, ఆరోగ్యకరమైన స్మూతీ మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. పాలకూరలోని విటమిన్ ఇ, మెగ్నీషియం శరీరానికి హానికరమైన టాక్సిన్స్​ను బయటకు పంపేస్తాయి.

సంబంధిత కథనం