ఈ వస్తువులను మొదట మగవారి కోసమే తయారుచేశారట, ఇప్పుడు ఇవి లేకుండా మహిళలకు రోజు గడవదు
ఫ్యాషన్ చరిత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాము. ఈ రోజు మహిళలు ఉపయోగించే వస్తువులు వాస్తవానికి పురుషుల కోసం కనిపెట్టబడ్డాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఫ్యాషన్ ప్రపంచం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ ఫ్యాషన్ అత్యవసరంగా కూడా మారుతుంది. ఫ్యాషన్ ప్రపంచంలో కొన్ని వస్తువులు అందం కోసం ఉత్పత్తి అయినా తరువాత అవసరంగా మారాయి. ఇప్పుడు మహిళలు వాడుతున్న కొన్ని వస్తువులు ఒకప్పుడు పురుషుల కోసం తయారు చేశారు. ఆ వస్తువులేంటో తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. హై హీల్ చెప్పులు, క్రాప్ టాప్స్, జీ స్ట్రింగ్స్, సానిటరీ ప్యాడ్స్ వంటి వన్నీ కూడా గతంలో పురుషులు వాడేవారని తెలిస్తే షాకింగ్ గానే ఉంటుంది. ఫ్యాషన్ ఎంతలా మారిపోయిందో అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణలు చాలు.
హై హీల్స్
మహిళలు ఇప్పుడు అధికంగా వాడుతున్నది హైహీల్స్. ఇవి చాలా స్టైలిష్ గా ఉంటాయి. ముఖ్యంగా పార్టీల్లో మహిళలు కచ్చితంగా వాడతారు. అయితే అవి మొదట పురుషుల కోసం డిజైన్ చేశారు. ఇది మీకు వింతగా అనిపించవచ్చు, కానీ 17 వ శతాబ్దంలో, హై హీల్స్ ధరించడం ఐరోపాలోని కులీన వర్గ పురుషులలో ఒక హోదాగా వాడేవారు. 18 వ శతాబ్దం నాటికి, హై హీల్స్ మహిళల ఫ్యాషన్‌గా మారాయి. పురుషులు వాటిని వాడడం మానేశారు.
స్టాకింగ్స్
స్టాకింగ్స్ అనేది అమ్మాయిలు సాధారణంగా స్కర్ట్స్ కింద ధరించే ఒక రకమైన పొడవాటి సాక్స్. అయితే, వీటిని మొదట మహిళల కోసం కాకుండా పురుషుల కోసం రూపొందించారు. ఇవి 9 వ శతాబ్దం నుండి పురుషుల ఫ్యాషన్లో భాగంగా ఉన్నాయి. ఎగువ తరగతి పురుషులు తెలుపు స్టాకింగ్ లను ధరించేవారు. సాధారణ పురుషులు నలుపు స్టాకింగ్ లను వాడేవారు. 18 వ శతాబ్దం నాటికి, స్త్రీలు వాటిని వారి దుస్తుల లోపల ధరించడం మొదలుపెట్టారు. దీంతో పురుషులు వాటిని వాడడం మానేశారు.
పీరియడ్స్ ప్యాడ్స్
పీరియడ్స్ సమయంలో మహిళలు ఉపయోగించే ప్యాడ్ అతి ముఖ్యమైనది. వీటిని మొదట పురుషుల కోసం డిజైన్ చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో, ఒక పెద్ద సంస్థ కాగితం గుజ్జు సహాయంతో డిస్పోజబుల్ ప్యాడ్స్ తయారు చేసింది. ఇది సాధారణ పత్తి కంటే అనేక ఎక్కువ రెట్లు నీటిని పీల్చుకునేది. గాయపడిన సైనికులకు కట్టుగా కట్టేందుకు దీన్ని ఉపయోగించేవారు. సైనికులకు చికిత్స చేసే నర్సులు పీరియడ్స్ సమయంలో వీటిని ఉపయోగించడం మొదలుపెట్టారు. అలా డిస్పోజబుల్ ప్యాడ్స్ పీరియడ్స్ సమయంలో వాడడం మొదలైపోయింది.
క్రాప్ టాప్
క్రాప్ టాప్ అనేది ఇప్పుడు అమ్మాయిల ఫ్యాషన్. ఈ కాలంలో క్రాప్ టాప్ ధరించి పురుషులు కనిపిస్తే అందరూ నవ్వుతారు. వీటి ఫ్యాషన్ చరిత్రను పరిశీలిస్తే క్రాప్ టాప్స్ ను మొదట పురుషుల కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. చాలా సంవత్సరాల క్రితం, క్రాప్ టాప్స్ పురుషులు మాత్రమే వేసుకున్నారు. ముఖ్యంగా బాడీబిల్డింగ్ లో పాల్గొనే పురుషులు తమ శరీరాన్ని ప్రదర్శించడానికి క్రాప్ టాప్ లను ధరిస్తారు.
జి స్ట్రింగ్
జి స్ట్రింగ్ అనేది ఒక రకమైన లోదుస్తులు, ఇది సన్నని థ్రెడ్, ఫ్యాబ్రిక్ కలపడం ద్వారా తయారు చేప్తారు. మహిళలు బీచులలో ఇలాంటి వేసుకుని ఈత కొట్టేందుకు ఇష్టపడతారు. వీటిని డిజైన్ చేసినప్పుడు పురుషులను దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు. పురుషులు ఎక్కువగా క్రీడలు ఆడేటప్పుడు లేదా స్విమ్మింగ్ చేసేటప్పుడు వీటిని ధరించేవారు. ఏదేమైనా, కాలక్రమేణా, అవి మహిళల దుస్తులలో భాగం అయ్యాయి. అప్పట్నించి పురుషులు వాటిని ధరించడం మానేశారు.