First Periods: పదేళ్ల వయసులోపే పీరియడ్స్ మొదలైన ఆడపిల్లల్లో ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ, జాగ్రత్త
First Periods: ఒకప్పటి పరిస్థితి వేరు. పదేళ్ల వయసు ఆడపిల్లల్లో నెలసరి వచ్చేది కాదు. కనీసం 12 ఏళ్లు దాటితేనే మొదటి పీరియడ్స్ కనిపించేవి. కానీ ఇప్పుడు 8, 9 ఏళ్ల లో ఉన్న ఆడపిల్లలకే పీరియడ్స్ మొదలైపోతున్నాయి.
First Periods: అయిదో తరగతి చదువుతున్న ఆడపిల్లల్లో పీరియడ్స్ మొదలైపోవడం ఇప్పుడు ఎంతో మంది తల్లులకు కలవర పెడుతున్న విషయం. ఎనిమిది తొమ్మిదేళ్లు వయసులోనే కొంతమంది ఆడపిల్లలు రజస్వల కావడం ఇప్పుడు చాలా చోట్ల కనిపిస్తోంది. ఒకప్పుడు 12 ఏళ్లు దాటితేనే ఆడపిల్లలకు నెలసరి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎనిమిదేళ్లు దాటితే చాలు ఎప్పుడు పీరియడ్స్ మొదలవుతాయేమో అని తల్లి చూసుకోవలసిన పరిస్థితి.
పదేళ్లలోపు వయసున్న పిల్లలకు ఎలాంటి అవగాహన ఉండదు. నెలసరి అంటే ఏమిటో అర్థం కాదు. శానిటరీ పాడ్ ఎలా వాడాలో తెలియదు. దీనివల్ల తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. పిల్లలకు పీరియడ్స్ గురించి ఎలా చెప్పాలో కూడా తెలియక ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయసులోనే నెలసరి కావడానికి కొన్ని కారణాలు చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
చిన్న వయసులోనే పీరియడ్స్ ఎందుకు?
పదేళ్ల లోపే ఆడపిల్లలు రజస్వల కావడానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. దీనికి ఇదే కారణం అని ఏ ఒక్క అంశాన్ని చెప్పలేము. అతిగా బరువు ఉన్న ఆడపిల్లలు, అతిగా మాంసాహారం తినే ఆడపిల్లలు, తీవ్ర ఒత్తిడికి గురయ్యే ఆడపిల్లలు, కుటుంబంలో నిత్యం ఘర్షణలో జరిగే వాతావరంలో పెరిగిన ఆడపిల్లలు... త్వరగా రజస్వల అవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే జన్యుపరమైన కారణాల వల్ల కూడా కొంతమంది ఆడపిల్లలు చిన్న వయసులోనే పీరియడ్స్ బారిన పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
తినే తిండి వల్లే ఇలా...
ఒకప్పుడు ఆర్గానిక్ కూరగాయలు మాత్రమే దొరికేవి. ఎలాంటి పురుగుమందులు, రసాయనాలు చల్లేవారు కాదు. కానీ ఇప్పుడు పురుగుమందులు, రసాయనాలు బాగా చల్లిన కూరగాయలనే తింటున్నాం. దీనివల్ల కూడా ఆడపిల్లల త్వరగా ఎదిగేందుకు, వారి శరీరంలో మార్పులు వచ్చేందుకు కారణం అవుతోంది. ముఖ్యంగా సోయాబీన్స్ ఎక్కువగా తీసుకునే ఆడపిల్లలు త్వరగా రజస్వల అవుతారనే కారణం కూడా ఉంది. వ్యాయామం చేయకుండా ఇంట్లోనే ఉండే ఆడపిల్లలు ఎక్కువ బరువున్న ఆడపిల్లలు పదేళ్లలోపే రజస్వల అయ్యే అవకాశం చాలా ఎక్కువ.
మారిపోతున్న మెదడు
ఆడపిల్లల శరీరంలోని హార్మోన్ల విడుదల కూడా రజస్వల కావడానికి ముఖ్య పాత్ర వహిస్తాయి. హార్మోన్ల విడుదల అనేది మెదడులోని హైపోథాలమస్ గ్రంధుల నుంచి వచ్చే సంకేతాలపై ఆధారపడి ఉంటుంది. హార్మోన్ల స్థాయిలు ఎక్కువగా ఉంటే శరీరంలో మార్పులు కూడా త్వరగా వస్తాయి. దీని వల్ల ఆ ఆడపిల్లల్లో త్వరగా పీరియడ్స్ మొదలైపోతాయి. మెదడు ఏ వయసులో అయితే ఆ సంకేతాలను పంపిస్తుందో అప్పుడే శరీరంలో నెలసరికి కావలసిన వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఫోన్ అతిగా చూసే ఆడపిల్లలు త్వరగా రజస్వల అయ్యే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే మొబైల్ వినియోగం అనేది వారి మెదడు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల మెదడు సరైన తీరులో పనిచేయకపోవచ్చు. ఏ వయసులో హార్మోన్లను విడుదల చేయాలన్నది అది నిర్ణయించుకోలేకపోతోంది.
పీరియడ్స్ త్వరగా వస్తే వచ్చే సమస్యలు
ఆడపిల్లలు పదేళ్లలోపే పీరియడ్స్ బారిన పడితే వారిలో కొన్ని ఎదుగుదల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వారు ఎత్తు పెరగడం అనేది త్వరగా ఆగిపోతుంది. అలాగే పీరియడ్స్ త్వరగా మొదలైన ఆడపిల్లల్లో పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ వచ్చే అవకాశం కూడా ఎక్కువే. దీన్నే పీసీఓడీ అంటారు. పెద్దయ్యాక వీరికి పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుంది. అలాగే ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు వీరికి వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో గుండె జబ్బులు, మూత్రనాళ క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్ వచ్చే పెరుగుతుంది.
ఎలా గుర్తించాలి?
రజస్వల కావడానికి ఏడాది లేదా ఏడాదిన్నర ముందు నుంచి ఆడపిల్లల్లో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. రొమ్ములు పెరగడం, చంకల్లో వెంట్రుకలు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వారు ఏడాది లేదా ఏడాదిన్నర తర్వాత రజస్వల అవతారని అర్థం. మీ పిల్లల్లో ఏడేళ్లు లేదా ఎనిమిదేళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వారు పదేళ్ల లోపే రజస్వల అయ్యే అవకాశం ఉందని అర్థం చేసుకోండి. ఆ సమయంలో మీరు వెంటనే గైనకాలజిస్టుని కలిసి అయ్యేందుకు తగిన మందులు వాడితే మంచిది.