Trending Sarees: చీరల మార్కెట్‌ను ఏలుతున్న లేటెస్ట్ శారీ ట్రెండ్స్ ఇవే, వీటి ధరలు అందరికీ అందుబాటులోనే
Trending Sarees: చీరలను ఇష్టపడని మహిళలు ఎవరుంటారు? రోజూ కట్టకపోయినా పండుగ పబ్బానికైనా అందమైన చీర కట్టుకోవాలి అనుకుంటారు. ప్రస్తుతం శారీ మార్కెట్ ను ఏలుతున్న లేటెస్ట్ శారీ ట్రెండ్స్‌ను ఇక్కడ ఇచ్చాము.
Trending Sarees: వివాహం, పండుగ.. ప్రత్యేక సందర్భం ఏదైనా అందమైన చీరలో హాజరైతేనే ప్రత్యేకంగా అనిపిస్తుంది. విలాసవంతమైన పట్టు చీరల నుండి తేలికపాటి షిఫాన్ చీరల వరకు ఏ చీర కట్టిన అందమే. 2024లో చీరల మార్కెట్‌ను కొన్ని రకాల చీరలు ఏలేస్తున్నాయి. వీటిలో ఏ చీర తీసుకున్నా అందంగానే ఉంటుంది. వీటి ధరలు కూడా అందరికీ అందుబాటు ధరలోనే ఉంటాయి. కొన్నేళ్లుగా చీరల మార్కెట్‌ను అల్లాడిస్తున్నట్రెండీ చీరల జాబితా ఇక్కడ ఇచ్చాము. మీకు నచ్చిన రకం చీరను కనుక్కొని వేసుకోండి. మీకు కచ్చితంగా అందంగా నప్పుతాయి.
బంధానీ చీరలు
బంధానీ చీరలు ఈనాటివి కావు. కానీ ఇప్పటికీ అవి లేటెస్ట్ ట్రెండ్ గానే కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు తమను తాము అప్డేట్ చేసుకుంటూ కొత్తగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవి మహిళల ఎవర గ్రీన్ ఎంపిక. దీపికా పదుకొనే, విద్యాబాలన్ వంటి ఎంతోమంది ప్రముఖులు ధరించేందుకు ఇష్టపడతారు వీటిని. ధరలు 2000 రూపాయల నుంచి లక్షల రూపాయల దాకా ఉంటాయి.
బెనారసి సిల్క్ చీరలు
ఇవి చూడగానే మన కళ్ళను ఆకట్టుకుంటాయి. గ్రాండ్ వెడ్డింగ్ లో బెనారస్ సిల్క్ చీర కడితే ఎవరి కళ్లయినా మీ వైపే తిరుగుతాయి. బెనారసి సిల్క్ చీరల్లో రంగులు చాలా సరికొత్తగా ఉంటాయి. ఆక్వా బ్లూ, పేస్టల్ పసుపు వంటి రంగులు బెనారస్ చీరల్లోనే దొరుకుతాయి. బంగారు లేదా వెండి జరీ మోటిఫి వర్క్ తో బెనారస్ సిల్క్ చీరలు చాలా ఆడంబరంగా ఉంటాయి. వీటి ధరలు ఐదువేల రూపాయల నుంచి మొదలవుతాయి.
లెహరియా చీరలు
రాజస్థాన్‌కు చెందిన అందమైన చీరలు లెహరియా. ఈ సంవత్సరమే ఇవి ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టాయి. ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్ కలిగి ఉంటాయి. మిర్రర్ వర్క్ తో గుటా పట్టి వంటి అలంకారాలతో ఇవి వస్తాయి. ఈ చీరలు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. కొన్ని చోట్ల 1000 రూపాయల నుంచి 1500 రూపాయల నుంచే వీటి ధరలు ఉంటాయి.
డోలా సిల్క్ చీరలు
ఈ సిల్కీ చీరలు ఈ సంవత్సరం టాప్ ట్రెండింగ్ చీరలుగా మారాయి. వీటి ధరలు చాలా తక్కువ. సిల్క్, సింథటిక్ ఫైబర్ల మిశ్రమంతో ఈ చీరలను నేస్తారు. వీటిని ఆడంబరమైన వేడుకల కోసమే కాదు, సాధారణ ఆఫీస్ ఫంక్షన్ల కోసం కూడా వేసుకోవచ్చు. సాంప్రదాయబద్దంగానే ఉంటాయి. అధునాతనంగానూ కనిపిస్తాయి. వీటి ధరలు 2000 రూపాయలు నుంచి ప్రారంభమవుతాయి.
ఆర్గాంజా చీరలు
ఈ మధ్యకాలంలో విపరీతమైన ప్రజాదరణ పొందిన వాటిలో ఆర్గాంజా చీరలు ఒకటి. ఈ 2024లో కూడా వీటి హవా కొనసాగుతోంది. ఇవి పలుచగా ఉంటాయి. కాస్త పారదర్శకంగా కనిపిస్తాయి. ఎంబ్రాయిడరీలు, సీక్వెన్లు, బీడ్ వర్క్ లతో ఈ ఆర్గాంజా చీరలు వస్తాయి. కాక్ టైల్ పార్టీలకు, హై ప్రొఫైల్ కార్పొరేట్ ఈవెంట్లకి ఆర్గాంజా చీరలు మంచి ఎంపిక. వీటి ధరలు కూడా తక్కువే. 1500 రూపాయలు నుంచే మంచి ఆర్గాంజా చీర దొరుకుతుంది.
ఇటాలియన్ క్రేప్ చీరలు
ఫ్యాషన్ చీరలు ధరించడానికి ఇష్టపడే మహిళలకు ఇటాలియన్ క్రేప్ చీరలు చాలా నచ్చుతాయి. ఇవి చూడటానికి సొగసుగా విలాసవంతంగా కనిపిస్తాయి. ఆధునిక యువతకు ఇవి బాగా నచ్చుతాయి. ఈ చీరలు చాలా తేలికగా ఉంటాయి. రోజంతా ఈ చీరలతో ఇబ్బంది లేకుండా ఉండవచ్చు.
కాంటెంపరరీ ఫ్యూజన్ చీరలు
2024లో కాంటెంపరరీ ఫ్యూజన్ చీరలు ఫ్యాషన్ ప్రపంచంలో బలమైన ముద్రను వేశాయి. ఈ చీరలు ఆధునిక డిజైన్లను కలిగి ఉంటాయి. సిల్హౌట్లతో సాంప్రదాయ భారతీయ సౌందర్యాన్ని మిళితం చేసినట్టు అనిపిస్తాయి. చూడగానే ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఈ చీరలు సింపుల్ గా ఉంటాయి. అందుకే బ్లౌజ్ డిజైన్లు మాత్రం వినూత్నంగా ప్రయత్నిస్తుంది నేటి యువత.