Friday Motivation: ఉత్తమ విలువలతో కలిగిన వ్యక్తికి ఉండే అలవాట్లు ఇవే, వీటినీ మీరు నేర్చుకోండి
Friday Motivation: ప్రతి వ్యక్తి ఉత్తమ విలువలతో జీవించాలనీ, ఎదుటి వ్యక్తులకి సాయపడాలని చెబుతూ ఉంటారు. ఇంతకీ ఉత్తమ విలువలు అంటే ఏమిటి?
కొందరిని ఉత్తమ వ్యక్తులు అని చెబుతూ ఉంటారు. అసలు ఒక వ్యక్తిని ఉత్తమమైన వాడిగా ఎలా ఎంపిక చేస్తారు? ఉత్తమ విలువలు అని కూడా అంటుంటారు... ఎలాంటి లక్షణాలను ఉత్తమ విలువలు అని పిలుస్తారు. ఇప్పుడు ఈ టాపిక్ గురించే మాట్లాడుకుంటున్నాం.
ప్రతి వ్యక్తికి ఉత్తమ విలువలు ఉండాలన్నది పెద్ద వారి మాట. ఉత్తమ విలువలు ఉన్న వ్యక్తి సమాజంలో గౌరవాన్ని పొందుతారు. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. జీవితంలో ఉత్తమంగా ఎలా జీవించాలో చెప్పేందుకు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. కొన్ని రకాల అలవాట్లు ఉన్న వారిని ఉత్తమ వ్యక్తులు అంటారు. ఆ అలవాట్లనే ఉత్తమ విలువలు అంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తమ విలువలు గల వ్యక్తులు నిరంతరం తమను తాము మంచివారుగా ఉంచుకునేందుకే ప్రయత్నిస్తారు. అవకాశం వచ్చినా కూడా తప్పుడు పని చేయరు. మేధోపరంగా, మానసికంగా, వృత్తిపరంగా కూడా ఉన్నంతలో నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. దీనివల్ల వారు ఇతరులకు భిన్నంగా కనిపిస్తారు.
వీరు నీతి, నిజాయితీని కలిగి ఉంటారు. తమ చేసే పనుల పట్ల చిత్తశుద్ధిని చూపిస్తారు. స్థిరంగా పనిచేసుకుంటూ వెళ్తారు. స్వల్పకాలిక లాభాల కోసం రాజీపడరు. అది వ్యక్తిగతమైన, వృత్తి గతంగా కూడా వారికి చిత్తశుద్ధి అధికంగా ఉంటుంది.
ఉత్తమమైన మనుషులు తమ భావోద్వేగాలనే కాదు, ఎదుటివారి భావోద్వేగాలను కూడా అర్థం చేసుకుంటారు. ఇతరుల పట్ల సానుభూతిని కలిగి ఉంటారు. ఎదుటివారికి కష్టం వచ్చినప్పుడు దయతో ప్రవర్తిస్తారు. ప్రతి పనిలోనూ వారు సమర్థవంతంగా ముందుకు సాగుతారు. కష్టాలను చూసి భయపడరు. ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు మాకెందుకులే అనుకోరు. ముందుండి వారిని ఆ కష్టం నుంచి బయట పడేస్తారు.
ఉత్తమ విలువలుగల వ్యక్తి చక్కగా మాట్లాడుతారు. స్పష్టంగా తాము అనుకున్నది కమ్యూనికేట్ చేస్తారు. అలాగే వారు మంచి శ్రోతలు కూడా. ఎదుటివారు చెప్పేది జాగ్రత్తగా వినేందుకు సమయాన్ని కేటాయిస్తారు. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తూనే... తమ అభిప్రాయాలను స్పష్టంగా వివరిస్తారు.
వీరికి జీవితంలో తమకు ఏమి కావాలో ఎలా పొందాలో అన్న దానిపై స్పష్టత ఉంటుంది. అలాగే ఏ సమయంలో చెప్పాలో, ఎక్కడి వరకు హద్దులు విధించాలో కూడా వారికి తెలుసు. సమయాన్ని, శక్తిని సద్వినియోగం చేసుకోవడంలో వీరు ముందుంటారు. ఎవరైనా చెడు దారిలో నడవమని ప్రోత్సహించినా కూడా అటువైపుగా చూడరు.
ఉత్తమ విలువలు గల వ్యక్తులు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. వాటి కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. వ్యవస్థీకృతంగా, ఉద్దేశపూర్వకంగా తమ పనులను పూర్తి చేస్తారు. జీవితంలో విజయవంతం కావడానికి వంద శాతం కృషి చేస్తారు.
వీరు తాము చేసిన పనులకు, తప్పులకు తామే బాధ్యత వహిస్తారు. తప్పు చేసినా కూడా వెంటనే అంగీకరిస్తారు. అంతే తప్ప తమ తప్పులకు వేరే వారిని బాధ్యులను చేసేందుకు ఇష్టపడరు. తప్పుల నుండి నేర్చుకొని ఎదగడానికి వీరు ఎంతో ప్రయత్నిస్తారు.
ఉత్తమ విలువ గల వ్యక్తి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తాడు. కానీ అతనిలో గర్వం కనిపించదు. ఇట్టే వారి ఫీడ్ బ్యాక్ ను పాజిటివ్ గా తీసుకుంటారు. తమ చేసిన తప్పులను ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉంటారు. తమను తాము ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూనే ఉంటారు.
పైన చెప్పిన లక్షణాలన్నీ ఉత్తమమైన వ్యక్తులకు కచ్చితంగా ఉంటాయి. అవన్నీ కూడా ఉత్తమ విలువలు ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు కూడా గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు.