Aloe Vera Hair Packs : జుట్టు పెరుగుదలకు కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి
Aloe Vera Hair Packs : జుట్టు పెరుగుదలకు కలబంద ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనితో తయారు చేసే హెయిర్ ప్యాక్స్ మీ జుట్టుకు అందాన్ని తీసుకువస్తాయి.
అందాన్ని పెంచడంలో జుట్టు మంచి పాత్ర పోషిస్తుంది. ఈ కాలంలో జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. చాలా మంది జుట్టు రాలడంతో ఇబ్బంది పడుతుంటారు. వెంట్రుకలు పలుచగా ఉంటే జుట్టుకు తగినన్ని పోషకాలు అందడం లేదు అని అర్థం చేసుకోవాలి. అందుకే కలబందతో చేసే హెయిర్ ప్యాక్స్ వాడండి. వాటికి కొన్ని జోడిస్తే సరిపోతుంది. కలబంద హెయిర్ ప్యాక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం..
పెరుగు, కలబందతో హెయిర్ ప్యాక్ తయారు చేయెుచ్చు. కావాల్సిన పదార్థాలు.. అలోవెరా జెల్ - 2 టేబుల్ స్పూన్లు, పెరుగు - 1 టేబుల్ స్పూన్, తేనె - 2 టేబుల్ స్పూన్లు మాత్రమే. ముందుగా అలోవెరా జెల్, పెరుగు, తేనెను ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. తర్వాత దీన్ని స్కాల్ప్ నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేసి 15-20 నిమిషాల పాటు నాననివ్వాలి. కాసేపు మృదువుగా మసాజ్ చేసి 30 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత తేలికపాటి షాంపూ ఉపయోగించి జుట్టును కడగాలి. దీన్ని వారానికి ఒకసారి ఉపయోగిస్తే మంచి మార్పు కనిపిస్తుంది.
యాపిల్ సైడర్ వెనిగర్, అలోవెరా హెయిర్ ప్యాక్ కూడా జుట్టుకు బాగా ఉపయోగపడుతుంది. అలోవెరా జెల్ - 1 కప్పు, యాపిల్ సైడర్ వెనిగర్ - 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. మెుదట ఒక గిన్నెలో అలోవెరా జెల్, యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని తలకు పట్టించి 30 నిమిషాల పాటు నాననివ్వాలి. తేలికపాటి షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ ను నెలకు 2 సార్లు ఉపయోగిస్తే చుండ్రును పూర్తిగా దూరం చేసుకోవచ్చు. జుట్టు కూడా పెరుగుతుంది.
ఆముదం, కలబంద హెయిర్ ప్యాక్ కూడా జుట్టుకు బాగా పనిచేస్తుంది. అలోవెరా జెల్ - 1 కప్పు, ఆముదం - 2 టేబుల్ స్పూన్లు, మెంతి పొడి - 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ముందుగా అలోవెరా జెల్, ఆముదం ఆయిల్, మెంతి పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. తర్వాత రాత్రి పడుకునే ముందు జుట్టుకు పట్టించి, షవర్ క్యాప్ వేసుకుని రాత్రంతా నాననివ్వాలి. తర్వాతి రోజు ఉదయం తేలికపాటి షాంపూతో మీ జుట్టును కడగాలి. ఇలా నెలకు 2-3 సార్లు ఉపయోగిస్తే జుట్టు బాగా పెరుగుతుంది.
మందార, కలబంద హెయిర్ ప్యాక్ కూడా జుట్టుకు ఉపయోగపడుతుంది. అలోవెరా జెల్ - 1 కప్పు, మందార పువ్వు పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. మెుదట ఒక గిన్నెలో అలోవెరా జెల్, మందార పువ్వు పేస్ట్ వేసి కలపాలి. తర్వాత దీన్ని తలకు బాగా పట్టించి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు చల్లటి నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి.
గుడ్డు, కలబంద హెయిర్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు. అలోవెరా జెల్ - 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి సారం - 1 టేబుల్ స్పూన్, గుడ్డు - 1 తీసుకోవాలి. మెుదట ఒక గిన్నెలో గుడ్డును పగలగొట్టాలి. తర్వాత అలోవెరా జెల్, వెల్లుల్లి రసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి గోరువెచ్చని నీటిలో ముంచిన గుడ్డతో జుట్టుకు చుట్టాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూ ఉపయోగించి జుట్టును కడగాలి. ఇలా చేస్తే జుట్టు పెరుగుతుంది. అందంగా తయారవుతుంది.