Thursday Motivation: గ్రద్దలాగా ఎత్తైన స్థాయికి చేరాలంటే మీరు ఆ పక్షి నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయి-there are many life lessons you need to learn from that bird if you want to reach the heights like an eagle ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Motivation: గ్రద్దలాగా ఎత్తైన స్థాయికి చేరాలంటే మీరు ఆ పక్షి నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయి

Thursday Motivation: గ్రద్దలాగా ఎత్తైన స్థాయికి చేరాలంటే మీరు ఆ పక్షి నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయి

Haritha Chappa HT Telugu
Sep 26, 2024 08:21 AM IST

Thursday Motivation: గ్రద్ద ఎగరడాన్ని ఎప్పుడైనా చూశారా? అన్ని పక్షుల కంటే ఎత్తుగా ఎగిరేందుకు ఇష్టపడుతుంది. ఆకాశమే హద్దుగా ఉంటుంది. ఆ గద్ద నుంచి మీరు నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయి.

గద్ద నుంచి మనం ఏ నేర్చుకోవచ్చు?
గద్ద నుంచి మనం ఏ నేర్చుకోవచ్చు? (Pixabay)

Thursday Motivation: చీమ, దోమ, ఏనుగు, పిచ్చుకలు, పిల్లలు, పెద్దలు... ఇలా మీ చుట్టూ ఉండే ఏ జీవి నుంచైనా మంచి నేర్చుకునేందుకు ఏమాత్రం సంకోచించకండి. మీకు ఎదురుపడిన ఏ జీవినీ చులకనగా చూడకుండా దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకునేందుకు ప్రయత్నించండి. ఇక్కడ గద్ద నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని జీవిత పాఠాలను ఇచ్చాము. మీరు ఎప్పుడైనా గద్దను చూడండి. ఆకాశమే హద్దుగా ఎగిరిపోతుంది. అన్ని పక్షుల కంటే ఎత్తుగా ఎగిరేందుకు ఇష్టపడుతుంది. దాని దృష్టి చాలా తీక్షణంగా ఉంటుంది. భయమంటే ఎరగనట్టు ఎగురుతుంది. పట్టుదలతో ముందుకు సాగుతుంది. స్వేచ్చగా ఉండేందుకు ఇష్టపడుతుంది. ఇలాంటి పక్షుల నుంచి మనము నేర్చుకునే జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయి.

స్పష్టమైన మార్గం

ఇతర పక్షుల్లాగా గద్దలు గుంపులు గుంపులుగా ఉండేందుకు ఇష్టపడవు. ఎత్తైన ప్రదేశంలో ఏకాంతంగా ఉంటాయి. స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతాయి. దాని మార్గం ఎంతో స్పష్టంగా ఉంటుంది. వ్యక్తిగత అభివృద్ధిని కోరుకునే వారు ఎవరైనా ఇలా గద్దలాగా తమని తాము నమ్ముకుని ముందుకు వెళ్లాలి. అంతే తప్ప గుంపులు గుంపులుగా, గుంపులో ఒకరిగా వెళ్లేందుకు ప్రయత్నించకూడదు. ఒంటరితనం ఒక్కోసారి కష్టంగా అనిపించవచ్చు. కానీ విజయం సాధించాక అది మిమ్మల్ని ఎంతోమందికి దగ్గర చేస్తుంది.

గద్దలు కొన్ని కిలోమీటర్ల దూరం నుండే తీక్షణమైన దృష్టితో తమ ఆహారాన్ని గుర్తిస్తాయి. ఆహారాన్ని సాధించాలనే దృక్పథంతో చూపును ఎటూ తిప్పవు. ఆహారం పైనే దృష్టిని నిలుపుతాయి. ఆ విషయంలో దానికి ఎంతో స్పష్టత ఉంటుంది. దూరదృష్టి కూడా ఎక్కువే. ఇలాంటి మనస్తత్వాన్ని మనం కూడా అలవర్చుకోవాలి. నాలుగైదు లక్ష్యాలు పెట్టుకునే కన్నా ఒకే లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని సాధించేందుకే ముందుకు వెళ్లాలి. మధ్యలో ఎన్ని అవాంతరాలు వచ్చినా పట్టించుకోకుండా అనుకున్నది సాధించాలి.

భయం లేకుండా

గెద్దలను చూసినప్పుడు వాటిలో భయం ఏమాత్రం కనబడదు. తుఫానులు వస్తున్నా, గాలి వీస్తున్నా అవి ఆ కొండ గట్టుపై అలా కూర్చుని చూస్తూనే ఉంటాయి. తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎగురుతూనే ఉంటాయి. గద్ద మనస్తత్వం నుంచి మనం తీసుకోవాల్సిన ప్రధాన లక్షణం ఇది. జీవితంలో ఎదురయ్యే తుఫానులకు, అవాంతరాలకు భయపడిపోయి వెనక్కి తిరిగి వెళ్ళకూడదు. స్థిరంగా, దృఢంగా నిలుచుని అనుకున్నది సాధించాలి.

గద్దలకు పట్టుదల ఎక్కువ. తాను చూసిన ఆహారాన్ని సాధించే వరకు అది అక్కడే తిరుగుతూ ఉంటుంది. కనికరం కూడా చూపించదు. మీరు కూడా అంతే మీరు అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే అంకిత భావంతో పనిచేయడమే కాదు, పట్టుదలతో ముందుకెళ్లాలి.

వెంటాడి, వేటాడి

గద్దలు కష్టమైనా కూడా తాము అనుకున్నది చేయడానికి ఇష్టపడతాయి. అవి చనిపోయిన పక్షులను, పురుగులను తినడానికి ప్రయత్నించదు. ఎగురుతూ, గెంతుతూ ఉన్న పక్షులనే పట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి. వాటిని పట్టుకోవడం కష్టమే. అయినా వెనకడుగు వేయవు. మీరు కూడా అంతే సులభంగా చేతికి అందే అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించకండి. మీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో అది కఠినమైనదైనా కూడా దాన్ని సాధించేందుకు ప్రయత్నించండి.

చరిత్రలో గద్దలు శక్తి ప్రతీకలు. అలాగే దీర్ఘాయువును కూడా పొందిన పక్షులు. పూర్వం ఎన్నో సామ్రాజ్యాలు గెద్దలను తమ చిహ్నంగా ఎంపిక చేసుకునేవి. దానికి కారణం గెద్దలో ఉండే ఈ పోరాట సామర్ధ్యాలే. పురాతన ఈజిప్టులో గద్దకు ఎంతో విలువ ఉండేది. దాన్ని దైవిక అంశంగా భావించారు. గద్దకున్న శక్తి సామర్ధ్యాలే ఇంతటి గుర్తింపును తెచ్చాయి.