Paneer kofta curry: కమ్మని పన్నీర్ కోఫ్తా కర్రీ.. ఈజీగా చేసుకోండి..
Paneer kofta curry: రుచికరమైన పన్నీర్ కోఫ్తా కర్రీని సులువుగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.
పనీర్ కోఫ్తా రెస్టరెంట్లోనే కాదూ, ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా పనీర్ కోఫ్తాను ఇష్టంగా లాగించేస్తారు. తక్కువ కారంతో, కాస్త తీపి ఉండే ఈ కర్రీ తయారీకి కోఫ్తాలను, గ్రేవీని వేరువేరుగా తయారు చేసుకోవాలి. పిల్లలకు కేవలం కోఫ్తాలను స్నాక్స్ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. వాటి తయారీ ఎలాగో చూసేద్దాం.
కోఫ్తా కోసం కావాల్సిన పదార్థాలు:
250 గ్రాముల పన్నీర్
1 పెద్ద బంగాళదుంప (ఉడికించింది)
ఒక చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద
కొద్దిగా కొత్తిమీర
1 చెంచా కార్న్ ఫ్లోర్
1 చెంచా సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు
2 చెంచాల జీడిపప్ప తరుగు
తగినంత ఉప్పు
డీప్ ఫ్రైకి సరిపడా నూనె
గ్రేవీ కోసం కావాల్సిన పదార్థాలు:
2 పెద్ద సైజు టమాటాలు
2 చెంచాల జీడిపప్పు
1 చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద
1 పెద్ద ఉల్లిపాయ తరుగు
పావు టీస్పూన్ జీలకర్ర
2 లవంగాలు
చిన్న దాల్చిన చెక్క ముక్క
పావు చెంచా పసుపు
సగం చెంచా కారం
పావు చెంచా గరం మసాలా
ఒక చెంచా ధనియాల పొడి
సగం చెంచా పంచదార
సగం చెంచా కసూరీ మేతీ
తగినంత ఉప్పు
తయారీ విధానం:
- ఒక గిన్నెలో పన్నీర్ తురుముకోవాలి. దాంట్లోనే బంగాళదుంప ముద్ద, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం,జీడిపప్పు ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకుని చేతికి నూనె రాసుకుని గుండ్రటి లడ్డూల్లా చేసుకోవాలి.
- ఇప్పడు కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసుకుని వేడెక్కాక సిద్ధం చేసి పెట్టుకున్న కోఫ్తాలను వేయించుకోవాలి. అవి రంగు మారి కాస్త క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
- గ్రేవీ కోసం టమాటా ముక్కలు, జీడిపప్పు కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో నూనె వేసుకుని అది వేడెక్కాక జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని వేగనివ్వాలి. అందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని పది సెకన్లు వేయించుకోవాలి.
- ఇప్పుడు పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని రంగు మారేంత వరకు వేగనివ్వాలి. అందులో మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా గ్రేవీ కూడా వేసుకోవాలి.
- నూనె తేలేంత వరకు, దాదాపు ఒక 5 నిమిషాల పాటూ కలుపుతూ సన్నని మంట మీద ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పంచదార ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి.
- ఒక రెండు నిమిషాలు ఉడికాక కసూరీ మేతీ వేసుకుని కప్పు నీళ్లు పోసుకోవాలి. గ్రేవీ చిక్కపడటానికి నాలుగైదు నిమిషాలు ఉడికించుకుని ముందుగా సిద్ధం చేసుకున్న పనీర్ కోఫ్తా బాల్స్ వేసుకోవాలి. ఒకసారి కలిపి స్టవ్ కట్టేయాలి.
టాపిక్