Sweet Dosa: పిల్లల బ్రేక్ ఫాస్ట్ తీయటి బెల్లం దోశ చేయడం చాలా సులువు
Sweet Dosa: స్వీట్ బెల్లం దోశ పేరు చెబితేనే నోరూరిపోతుంది. పిల్లలకు ఎలాంటి చట్నీ అవసరం లేకుండానే దీన్ని తినిపించవచ్చు. వారు దీన్ని ఇష్టంగా తింటారు.
Sweet Dosa: రవ్వ దోశ, మసాలా దోశ, ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ... ఇలా దోశల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అలాగే బెల్లంతో చేసే స్వీట్ దోశ కూడా ఒకటి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి ఇది నచ్చుతుంది. ఎందుకంటే ఇది చాలా తీపిగా ఉంటుంది. దీనికి చట్నీ అవసరం లేదు. కాబట్టి స్కూల్ కి వెళ్లే పిల్లలకు ఈ దోశను చేసి పెడితే వారు ఇష్టంగా తింటారు. అలాగే వారికి బ్రేక్ ఫాస్ట్‌లో పోషకాహారం పెట్టినట్టు కూడా ఉంటుంది. ఈ స్వీట్ బెల్లం దోశ చేయడం చాలా సులువు. ఎలా చేయాలో తెలుసుకోండి.
స్వీట్ బెల్లం దోశ రెసిపీకి కావలసిన పదార్థాలు
దోశ పిండి - ఒక కప్పు
తురిమిన బెల్లం - అర కప్పు
యాలకుల పొడి - అర స్పూను
నెయ్యి - రెండు స్పూన్లు
పాలు - పావు కప్పు
స్వీట్ బెల్లం దోశ రెసిపీ
1. దోశ పిండిలో ముందుగానే తయారు చేసుకుని పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక కప్పులో కావాల్సినంత దోశ పిండి వేసి పాలు వేసి కలుపుకోవాలి.
3. అలాగే తురిమిన బెల్లాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
4. అందులోనే చిటికెడు ఉప్పు, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పైన నెయ్యిని రాయాలి.
6. ఈ దోశ పిండితో దోశలను పోసుకోవాలి.
7. రెండు వైపులా ఎర్రగా కాల్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని పిల్లలకు తినిపించి చూడండి. వారు చాలా ఇష్టంగా తింటారు.
ఈ బెల్లం దోశలతో ఎలాంటి చట్నీలు అవసరం ఉండదు. ఎందుకంటే ఇది అప్పటికే స్వీటుగా ఉంటుంది. కాబట్టి దీంతో చట్నీలు తినాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ సమయంలోనే ఇది రెడీ అయిపోతుంది. ఎప్పుడు ఒకేలాంటి అల్పాహారాలు పెట్టే బదులు అప్పుడప్పుడు పిల్లలకి ఇలా బెల్లం దోశలు పెట్టి చూడండి. వారికి ఇది నచ్చడం ఖాయం.
బెల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అన్ని రకాలుగా మేలే జరుగుతుంది. బెల్లం వల్ల శరీరంలోని రక్తం శుద్ధి అవుతుంది. కాబట్టి జీర్ణ క్రియ సవ్యంగా జరుగుతుంది. ప్రతిరోజూ చిన్న బెల్లం ముక్కని తినడం చాలా అవసరం. ఇది ఇనుము లోపాలని తీరుస్తుంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. భోజనం తిన్న ఒక అరగంట తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే ఎంతో మంచిది.