Sunday Motivation: ప్రపంచంలో విజయవంతమైన వ్యక్తుల అలవాట్లు ఇవి, మీకూ ఇవి ఉంటే విజయం సాధించడం ఈజీ
Sunday Motivation: ప్రపంచంలో విజయాన్ని సాధించిన వ్యక్తులు ఎందరో ఉన్నారు. వారి నుంచి కొన్ని లక్షణాలను మనం కూడా స్వీకరిస్తే... విజయం సాధించడానికి అవన్నీ ఉపయోగపడతాయి.
Sunday Motivation: విజయం అంటే ఏమిటి? అని ఎప్పుడైనా ఆలోచించారా? విజయానికి ఒక రూపం, ఒక దూరం, ఒక ఊరు, పేరు ఏమీ లేదు. ప్రతి వ్యక్తి అభిప్రాయాల్లో విజయానికి ఒక్కో నిర్వచనం ఉంటుంది. విద్యార్థి విషయానికే వస్తే మంచి మార్కులు తెచ్చుకోవడమే అతనికి విజయం. ఒక తల్లి వరకు వచ్చేసరికి పిల్లలను సరిగ్గా పెంచడమే ఆమె విజయం. అదే వ్యాపారవేత్తకైతే తన కంపెనీని అభివృద్ధి చేసుకోవడమే విజయం.
మనిషి మనిషికి విజయాలు వేరు వేరుగా ఉంటాయి. ఏదైనాచివరికి అనుకున్నది సాధించడమే విజయం సాధించడం. ప్రపంచంలో ఎంతోమంది అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఉన్నారు. వారిలో ఉన్న కొన్ని లక్షణాలను మనం తెలుసుకోవడం ద్వారా మనం కూడా లైఫ్ లో విజయాన్ని సాధించవచ్చు.
చాలామంది విజయానికి వయస్సు అడ్డంకిగా అనుకుంటారు. పాతికేళ్ల వయసులోనే విజయాన్ని సాధించగలమని అనుకుంటారు. విజయానికి, వయసుకు సంబంధం లేదు. 50 ఏళ్ల వయసులో కూడా విజయవంతమైన వారు ఎంతోమంది ఉన్నారు. అలా అనుకుని విజయం సాధించిన వ్యక్తులు ఎంతోమంది.
మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. మిమ్మల్ని మీ లక్ష్యం వైపు వెళ్ళకుండా అడ్డుకునేది ఇదే. మీ స్నేహితులు ఉన్నతంగా స్థిరపడినప్పుడు... మీరు అలా స్థిరపడకపోతే వారితో పోల్చుకొని భావోద్వేగాలకు గురవడం, డిప్రెషన్‌గా ఫీల్ అవ్వడం, అసూయ పడడం మానేయాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి.
నెగిటివ్ థింకింగ్
మీరు విజయం వరకు చేరే మార్గానికి అడ్డుపడే మరొక అవరోధం నెగిటివ్ థింకింగ్. సానుకూల ఆలోచనలు మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తే... నెగిటివ్ ఆలోచనలు మిమ్మల్ని దూరంగా నెట్టేస్తాయి. ప్రపంచంలో విజయం సాధించిన వ్యక్తుల్లో నెగిటివ్ థింకింగ్ చాలా తక్కువగా ఉంటుంది. వారి నుంచి మనం అది ఖచ్చితంగా నేర్చుకోవాలి.
వాయిదా వేయద్దు
ఓ పని ఈరోజు చేయాలి అంటే... ఆ టైంకి కచ్చితంగా చేసేయాలి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని వాయిదా వేసే అలవాటు ఉంటే మీరు విజయం సాధించడం చాలా కష్టమైపోతుంది. మీ జీవితాన్ని చెడగొట్టే అలవాట్లలో వాయిదా వేయడం కూడా ఒకటి. కాబట్టి మీ జీవితం మారాలంటే వాయిదా వేయడం మానేయండి. ఎప్పటి పనులు అప్పుడే చేయండి.
ఏ పని చేసినా విఫలం అవుతామనే భయంతో ముందుకు వెళ్లడం ప్రమాదం. విఫలం చెందినా, విజయం సాధించినా ముందుగా ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం. మిమ్మల్ని ప్రయత్నం చేయకుండా అడ్డుకునే మొదటి అంశం భయం. ఎక్కడ ఓడిపోతామనే భయమే మిమ్మల్ని అడుగు వెనక్కి వేసేలా చేస్తుంది. కాబట్టి మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి ప్రయత్నించి చూడండి. కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది.
ఏదైనా సాధించాలంటే ముందుగా మిమ్మల్ని మీరు నమ్మాలి. మీలో ఆత్మ విశ్వాసం నిండాలి. నేను చేయలేను, నా వల్ల కాదు వంటి డైలాగులు మాట్లాడకూడదు. ప్రపంచంలో గెలిచిన వారందరూ ఒకప్పుడు సామాన్య వ్యక్తులే. వారి కష్టంతోనే అత్యంత విజయవంతమైన వ్యక్తులుగా మారారు. మీరు కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ వైపుగా అడుగులు వేయాలి. మధ్యలో ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా కూడా ముందుకే సాగాలి.
టాపిక్