Wednesday Motivation: విజయం కన్నా దాని కోసం చేసే ప్రయత్నమే చాలా గొప్పది
Wednesday Motivation: విజయం సాధించాలంటే మొదటి చేయాల్సింది ప్రయత్నం. ప్రయత్నం లేకుండా ఏ పని మొదలవ్వదు.
Wednesday Motivation: ఓ రోజు ఉదయం ఒక వ్యక్తి సముద్రపు ఒడ్డు నుండి ఇసుక రేణువులలో అలా నడుచుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఇంతలో అక్కడ ఒక బాలుడు ఒడ్డు నుంచి ఏవో తీసి సముద్రంలోకి విసరడం గమనించాడు. ఆ బాలుడి దగ్గరికి వెళ్లి చూస్తే... ఆ చిన్నారి అలల తాకిడికి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన స్టార్ ఫిష్‌లను ఏరి ఒక్కొక్కటి సముద్రంలో వేస్తున్నాడు. ఆ బాలుడి దగ్గరకు వచ్చిన వ్యక్తి ఏం చేస్తున్నావని ఆ పిల్లాడిని అడిగాడు. సూర్యుడు ఉదయించే సమయంలో స్టార్ ఫిష్‌లు ఒడ్డునే ఉండిపోతే అవి మరణించే అవకాశం ఉందని, అందుకే వాటిని సముద్రంలో వేస్తున్నానని చెప్పాడు.
ఆ వ్యక్తి సముద్రపు ఒడ్డును ఒకసారి గమనించాడు. ఆ ఒడ్డున ఎన్నో స్టార్ ఫిష్‌లు పడి ఉన్నాయి. వెంటనే ఆ వ్యక్తి ‘నువ్వు చేసిన పని అర్థరహితంగా ఉంది. ఇక్కడ లెక్కలేనన్ని స్టార్ ఫిష్‌లు ఉన్నాయి. అది కూడా సముద్రపు బీచ్ మైళ్లలో విస్తరించి ఉంటుంది. ఎన్ని స్టార్ ఫిష్‌లను నువ్వు లోపలికి వేయగలవు?’ అంటూ హేళనగా మాట్లాడాడు. అప్పుడు ఆ బాలుడు వంగి మరో స్టార్ ఫిష్ ను తీసి సముద్రంలోకి విసిరాడు. ‘నేను ఎన్నిసార్లు వేయగలిగితే అన్ని వేస్తాను. మీరు ఇప్పుడు నాతో మాట్లాడే బదులు ఆ సమయంలో కనీసం పది స్టార్ ఫిష్‌ల ప్రాణాలు కాపాడేవారు. కళ్ళముందే అన్ని స్టార్ ఫిష్‌లను చంపే కన్నా కొన్నింటిని బతికించడానికి ప్రయత్నించడంలో తప్పేమీ లేదు కదా. నేను అన్ని స్టార్ ఫిష్‌ల ప్రాణాలను కాపాడకపోవచ్చు. కానీ కాపాడేందుకు ప్రయత్నం అయితే చేస్తాను.’ అంటూ తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టాడు.
ఈ కథలో నీతి ఒకటే... విజయావకాశాలు ఎన్ని ఉన్నాయో చూసే కన్నా, మీరు ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. చీకటిని తిట్టడం కంటే ఒక కొవ్వొత్తి వెలిగించడం మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయం లెక్కలోకి వస్తుంది. సానుకూలమైన మార్పు ఏదైనా సరే ప్రయత్నించడంలో తప్పులేదు. అంతెందుకు తొలిసారి మనం నేలపై పాదం మోపినప్పుడు వేసేవన్నీ తప్పటడుగులే. ఆ తప్పుడు అడుగులే తర్వాత చక్కటి నడకగా మారాయి. తొలిసారి మనం రాసేవి కూడా పిచ్చి రాతలే. ఆ పిచ్చి రాతలే ఇప్పుడు అక్షరాలుగా, పదాలుగా, అందమైన వాక్యాలుగా మారాయి. తొలిసారి అన్ని విఫలం అవుతూనే ఉంటాయి. అలా అని ప్రయత్నించడం మానేయకూడదు. ప్రయత్నించడం మానేస్తే అదే మీ జీవితంలో పెద్ద తప్పుగా మిగిలిపోతుంది.