Breast cancer: వ్యాయామంతో రేడియో థెరపీ సైడ్ ఎఫెక్ట్స్ మాయం.. స్టడీ తేల్చిందిదే
Breast cancer: బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కోలుకోవడంలో వ్యాయామం బాగా పనిచేస్తుందని ఒక స్టడీ తేల్చింది.
బెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో రేడియోథెరపీ అతి ముఖ్యమైన భాగమైంది. అయితే దీని కారణంగా అలసట తీవ్రమవుతుంది. పేషెంట్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వారి భావోద్వేగాలపై, శారీరక, సామాజిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే వ్యాయామం రేడియోథెరపీని భరించగలిగేలా చేస్తుందని ఎడిత్ కోవాన్ యూనివర్శిటీ (ఈసీయూ) నిర్వహించిన తాజా పరిశోధన తేల్చింది.
ఈసీయూలోని ఎక్సర్‌సైజ్ మెడిసిన్ రీసెర్చ్ యూనిట్ తన అధ్యయనంలో 89 మంది మహిళలను భాగస్వాములుగా చేసింది. వీరిలో 43 మందికి 12 వారాల పాటు ఇంటి వద్దే వీక్లీ ఎక్సర్‌సైజ్ సెషన్స్ ఇచ్చింది. అలాగే 2 రోజుల రెసిస్టెన్స్ ట్రైనింగ్ కూడా ఇచ్చింది. 30 నుంచి 40 నిమిషాల పాటు చేయాల్సిన ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ చేయించింది.
మిగిలిన వారు ఎలాంటి ఎక్సర్‌సైజ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనలేదు. వీరితో పోల్చితే వ్యాయామం చేసిన పేషెంట్లు రేడియో థెరపీ అనంతరం క్యాన్సర్ సంబంధిత అలసట నుంచి వేగంగా కోలుకున్నారని పరిశోధన తేల్చింది. వ్యాయామం చేసిన వారు మెరుగైన జీవితాన్ని గడిపారని తేల్చింది. వ్యాయామం కారణంగా ఎలాంటి చెడు ప్రభావాలు కనిపించలేదని స్టడీ వెల్లడించింది.
ఇంటి వద్ద రెసిస్టెన్స్, ఏరోబిక్ వ్యాయామాలు చాలా సురక్షితమైనవని, క్యాన్సర్ సంబంధిత అలసట నుంచి త్వరగా కోలుకోవడంలో మెరుగ్గా సాయపడ్డాయని స్టడీ సూపర్‌వైజర్ ప్రొఫెసర్ రాబ్ న్యూటన్ తెలిపారు. వీరు నాణ్యమైన జీవితాన్ని అనుభవించగలిగారని చెప్పారు.
‘ఇంటి వద్ద చేసుకునేలా ఉండే ఈ వ్యాయామాలు ఖరీదైనవి కావు. ఎక్కడికీ ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. అలాగే సూపర్ విజన్ అవసరం లేదు. పేషెంట్‌కు నచ్చిన స్థలంలో, నచ్చిన సమయంలో చేసుకోవచ్చు..’ అని ప్రొఫెసర్ చెప్పారు. ఈ ప్రయోజనాలన్నీ పేషెంట్లకు కంఫర్ట్‌ను ఇస్తాయని చెప్పారు.
తగ్గించినా సత్ఫలితాలు
ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జాతీయ మార్గదర్శకాల ప్రకారం క్యాన్సర్ పేషెంట్లు మధ్యస్తం నుంచి కఠినతరంగా 30 నిమిషాలపాటు ఏరోబిక్ ఎక్సర్‌సైజులు చేయాలి. ఇలా వారంలో ఐదు రోజులు చేయాలి. లేదా వారంలో మూడు రోజులు 20 నిమిషాల పాటు కఠినమైన ఏరోబిక్ ఎక్సర్‌సైజులు చేయాలి.
8 నుంచి 10 స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజులు 8 నుంచి 12 సార్లు రిపీట్ చేయాలి. ఇలా వారంలో రెండు నుంచి మూడు రోజులు చేయాలి. ‘జాతీయ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఈ స్టడీలో వ్యాయామ స్థాయిని పెంచాల్సి వచ్చింది..’ అని డాక్టర్ జార్జియోస్ మావ్‌రొపాలియాస్ తెలిపారు.
‘అయితే మేం పార్టిసిపెంట్ల ఫిట్‌నెస్ స్థాయిని బట్టి ఎక్సర్‌సైజు ప్రోగ్రామ్ ఇచ్చాం. జాతీయ మార్గదర్శకాల కంటే తక్కువ స్థాయి ఎక్సర్‌సైజులు చేసినప్పటికీ మంచి ఫలితాలు వచ్చాయి. రేడియో థెరపీ సమయంలో, ఆ తరువాత క్యాన్సర్ సంబంధిత అలసట తగ్గిందని చెప్పారు.
టాపిక్