Phone in Toilet: బాత్రూంలో కూర్చుని ఫోన్ వాడటం ఆపేయండి బాస్, ఈ అలవాటుతో ఆరోగ్యానికి ముప్పు
Phone in Toilet: మీ ఫోన్ ను బాత్రూమ్ కు తీసుకెళ్లే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మీరు టాయిలెట్ సీటుపై కూర్చుని రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు, వీడియోలు చేస్తున్నప్పుడు మీ ఆరోగ్యానికి చేటుచేసే ప్రక్రియలు జరుగుతాయి. అవేంటో చూడండి.
టాయిలెట్ సీట్ మీద కూర్చుని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లేదా ఏదైనా సోషల్ మీడియా వాడటం, వీడియోలు చూడటం చాలా మందికి ఉన్న అలవాటు. దీంతో ఎక్కువ సేపు బాత్రూంలోనే గడిపేస్తారు. దాంట్లో అంత పెద్ద తప్పేముందీ అనిపించొచ్చేమో.. కానీ అలా టాయిలెట్ సీట్ మీద ఎక్కువ సేపు కూర్చుంటే ఏం జరుగుతుందో తెలిస్తే మీ ఆలోచన మారుతుంది. మానసికంగా, శారీరకంగా ఎలాంటి ప్రమాదాలున్నాయో తెల్సుకోండి.
ఎంత సేపు ఉండొచ్చు?
నిజానికి బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్లడమే తప్పు. కొంతమంది పుస్తకాలు, న్యూస్ పేపర్లు కూడా టాయిలెట్ సీట్ మీద కూర్చుని చదువుతారు. ఇది అస్సలు మంచిది కాదు. ఫోన్ పట్టుకుని టాయిలెట్ సీట్ మీద కూర్చోవడం వల్ల పైల్స్ లేదా హోమోరాయిడ్స్ వచ్చే ప్రమాదం ఉంది. మల విసర్జణ వెళ్లే ప్రాంతం చుట్టూ వాపు రావడం, నరాలు ఉబ్బడం జరుగుతుంది. దీంతో నొప్పి, అసౌకర్యం, మలంలో రక్త రావడం మొదలవుతుంది. దీంతో పాటే సీట్ మీద కూర్చున్నప్పుడు మల విసర్జణ ప్రాంతంలో కలిగే ఒత్తిడి వల్ల వాపు, ఇరిటేషన్ లేదా మలంలో రక్తం రావడం లాంటి సమస్యలు వస్తాయి. క్రమంగా మలబద్దకం సమస్యా వస్తుంది
కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ కూడా రావొచ్చంటున్నారు నిపుణులు. బాత్రూంలో గంటకొద్దీ ఉండటం మానుకోవాలి. అరగంట, 45 నిమిషాల సమయం గడపడం చాలా మందికి అలవాటుగా మారింది. ఇది మీకు సమస్యలు తెచ్చిపెడుతుంది. టాయిలెట్ లో 7 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపకూడదు. గరిష్టంగా 10 నిమిషాలు మించొద్దు.
కూర్చునే స్థితి మారిస్తే?
వెస్టర్న్ సీట్ మీద ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మల విసర్జన కష్టంగా మారుతుంది. తొడలు, మోకాల్ల స్థితే దానికి కారణం. స్వ్కాట్ పొజీషన్ లో కూర్చోవడం లేదా మీ కాళ్ల కింది ఎత్తుగా ఉండే స్టూల్ పెట్టుకోవడం వల్ల మల విసర్జన సాఫీగా అవుతుంది.
టాయిలెట్ సీట్ మెత్తగా ఉండదు. ఉపరితలం కఠినంగా ఉంటుంది. దాని మీద కూర్చుంటే ఒత్తిడి ఎక్కుగా ఉంటుంది. సీట్ మీద కూర్చున్నప్పుడు పురీషనాళం (పెద్ద పేగు చివరి భాగం) పిరుదుల మిగతా భాగం కన్నా దిగువకు ఉంటుంది. ఇది ఒక రకమైన అసహజ భంగిమే. ఆ స్థితి, గురుత్వాకర్షణ ప్రభావం వల్ల ఆ ప్రాంతంలో సిరల్లో రక్తం ఎక్కువగా చేరుకుంటుంది. దీనివల్ల హోమోరాయిడ్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మల బద్దకం వల్ల మల విసర్జన కోసం ముక్కడం వల్ల ఒత్తిడి పెరిగి సమస్య ఇంకా ఎక్కువైపోతుంది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల సమస్య విపరీతంగా మారుతుంది.
జీవనశైలి:
ఎలాంటి కదలిక లేకుండా అలాగే కూర్చోవడం వల్ల రక్త సరఫరా సరిగ్గా జరగదు. మల విసర్జన సాఫీగా ఉండదు. ఈ సమస్యలు రాకుండా నిరంతరం వ్యాయామాలు చేయాలి. దాంతో సరఫరా పెరిగి పెద్దపేగు పనితీరు మెరుగవుతుంది. ఇదివరకే ఉన్న సమస్యలూ తగ్గుతాయి. టాయిలెట్ లో పది నిమిషాలకు మంచి గడపకూడదు. మలబద్దకం ఉంటే కూడా ఎక్కువసేపు అలాగే కూర్చోకుండా మళ్లీ కాసేపయ్యాక ప్రయత్నించండి. ఎక్కువగా ముక్కడం, ఒత్తిడి పెట్టడం కూడా మంచిది కాదు. సరిగ్గా నీళ్లు తాగడం,పీచు ఎక్కువున్న పండ్లు, కూరగాయలు, గింజలు తినడం వల్ల పేగు ఆరోగ్యం బాగుంటుంది.
నిరాకరణ: ఈ వ్యాసం సమాచార ఇవ్వడానికి మాత్రమే. వైద్య పరమైన సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యం గురించి ఏవైనా ప్రశ్నలుంటే మీ వైద్యుడి సలహా తీసుకోండి.