Hepatitis Risk: వర్షాకాలంలో హెపటైటిస్ రిస్క్ ఎక్కువ.. కారణాలు లక్షణాలు వివరించిన వైద్య నిపుణులు-what are the causes of increased hepatitis risk in monsoon how can you keep your liver healthy during this season ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hepatitis Risk: వర్షాకాలంలో హెపటైటిస్ రిస్క్ ఎక్కువ.. కారణాలు లక్షణాలు వివరించిన వైద్య నిపుణులు

Hepatitis Risk: వర్షాకాలంలో హెపటైటిస్ రిస్క్ ఎక్కువ.. కారణాలు లక్షణాలు వివరించిన వైద్య నిపుణులు

HT Telugu Desk HT Telugu
Aug 17, 2023 10:05 AM IST

వర్షాకాలంలో హెపటైటిస్ ఎ, ఇ కేసులు పెరుగుతున్నాయి. చికిత్స, నివారణ చిట్కాలతో పాటు దాని కారణాలు ఇక్కడ తెలుసుకోండి.

వర్షాకాలంలో హెపటైటిస్ రిస్క్ చాలా ఎక్కువ
వర్షాకాలంలో హెపటైటిస్ రిస్క్ చాలా ఎక్కువ (Photo by Twitter/AbeDan14)

కలుషిత నీరు, ఆహారం వంటి కారణాల వల్ల వర్షాకాలంలో కాలేయ వ్యాధులతో సహా జీర్ణశయాంతర సమస్యలు పెరుగుతాయి. హెపటైటిస్ ఎ,  ఇ  ఉన్న కేసులు చాలా నమోదవుతుంటాయి. కాలేయ సమస్యలను దూరం చేసి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అపరిశుభ్రమైన పచ్చి ఆహారం, కూరగాయలను తినకుండా ఉండాలి. అలాగే వీధి ఆహారాన్ని తీసుకోరాదు. అది కలుషిత నీటితో తయారు చేసే ప్రమాదం ఉన్నందున మీ ఆరోగ్యానికి మంచిది కాదు. 

హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముంబైలోని అపోలో స్పెక్ట్రాలోని కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ హర్షద్ జోషి ఇలా వివరించారు. “వర్షాకాలం హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్‌తో సహా అనేక జీర్ణశయాంతర సమస్యలకు పర్యాయపదం. పిల్లల నుంచి పెద్దలు, వృద్ధుల వరకు ఎవరైనా కాలేయ సమస్యలతో బాధపడవచ్చు. వర్షాకాలంలో కాలుష్యం వల్ల కడుపు ఇన్ఫెక్షన్లు వస్తాయి. సాధారణ జీర్ణ సంబంధిత ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, కడుపు నొప్పి, వికారం వంటి సమస్యలు ఎదురవుతాయి. 

ఇక టైఫాయిడ్ అనేది తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది అధిక జ్వరం, కడుపు నొప్పి, వికారం, వాంతులు కలిగిస్తుంది. హెపటైటిస్ ఎ, కామెర్లు వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.  హెపటైటిస్ ఎ అంటే కాలేయం యొక్క వాపు. పారిశుధ్యం పాటించకపోవడం, నీరు, ఆహారం కలుషితమవడం ఈ సమస్యలకు కారణమవుతాయి. 

జినోవా షాల్బీ హాస్పిటల్‌లోని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ వికాస్ పాండే ఈవిషయాన్ని హైలైట్ చేస్తూ, “ఎ, ఇ వైరస్‌ల కారణంగా వర్షాకాలంలో కాలేయ ఇన్‌ఫెక్షన్లు లేదా హెపటైటిస్ కేసులు పెరుగుతున్నాయి. కలుషితమైన ఆహారం లేదా నీరు లేదా ఇది సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్ల ఒక వ్యక్తికి హెపటైటిస్ ఎ లేదా ఇ వస్తుంది. వీధుల్లో లభించే ఆహారాన్ని తినడం లేదా కలుషితమైన నీటితో కడిగిన పండ్లను ఎంచుకోవడం, జ్యూస్‌లు తాగడం, పానీ పూరీలు, గోలా, కలుషిత నీరు లేదా ఐస్‌తో చేసిన షర్బత్‌లు, అపరిశుభ్రమైన పచ్చి ఆహారం, పచ్చి కూరగాయలను తీసుకోవడం వంటివి హాని కలిగించవచ్చు. హెపటైటిస్ కాలేయం, జీర్ణ సంబంధిత రుగ్మతలను పెంచుతుంది. కాబట్టి సీజన్‌తో సంబంధం లేకుండా తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యం..’ అని వివరించారు.

సకాలంలో చికిత్స అవసరం

నవీ ముంబైలోని మెడికోవర్ హాస్పిటల్స్‌లో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, హెచ్‌పిబి సర్జరీ డైరెక్టర్ డాక్టర్ విక్రమ్ రౌత్ ఇలా వివరించారు. ‘హెపటైటిస్ ఎ హెపటైటిస్ ఇ చికిత్స చేయకుండా వదిలేస్తే, అవి కాలేయాన్ని దెబ్బతీస్తాయి చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారినప్పుడు హెపటైటిస్ ఎ, ఇ కామెర్లుగా కనిపిస్తాయి. సకాలంలో చికిత్స తీసుకోనప్పుడు తీవ్రమైన కాలేయ వైఫల్యానికి, చివరికి కాలేయ మార్పిడికి దారితీస్తుంది..’ అని వివరించారు.

చికిత్స, నివారణ చర్యల గురించి డాక్టర్ హర్షద్ జోషి మాట్లాడుతూ ‘చికిత్స లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. ఒకరి నుండి మరొకరికి భిన్నంగా ఉంటుంది. డాక్టర్ సూచించిన మందులను మాత్రమే తీసుకోండి. పచ్చి ఆహారం, కూరగాయలు లేదా వీధి ఆహారాన్ని తినడం మానుకోండి. త్రాగే ముందు నీటిని మరిగించండి. జ్యూస్‌లు, ఇతర పానీయాలు కలుషితమైన ఐస్ కలిగి ఉండవచ్చు, రోడ్‌సైడ్ స్టాల్స్‌లో లభించే ప్రీ-కట్ ఫ్రూట్‌లను తినవద్దు..’ అని వివరించారు. 

WhatsApp channel