Bakrid Breakfast । కీమా నాన్‌తో బ్రేక్‌ఫాస్ట్.. బక్రీద్ విందుకు సరైన ఆరంభం!
Bakrid Breakfast: బక్రీద్ స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ కీమా నాన్ రెసిపీని అందిస్తున్నాం. అల్పాహారంతోనే విందును ప్రారంభించండి.
Keema Naan (istock)
Bakrid Breakfast: రోజుకి సరైన ఆనందకరమైన ఆరంభం ఇవ్వాలంటే, ఉదయం రుచికరమైన అల్పాహారం తినాలి. ఈరోజు ముస్లింలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ ఈద్-ఉల్-అధా. దీనినే బక్రా ఈద్ లేదా బక్రీద్ అని కూడా అంటారు. ఇది త్యాగాలను స్మరించుకుంటూ ఆనందంగా విందు చేసుకునే రోజు. మరి, ఈరోజు కూడా బ్రేక్‌ఫాస్ట్ మామూలుగా ఎందుకు ఉండాలి? ఇక్కడ బక్రీద్ స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ వంటకం గురించి తెలుసుకోండి.
ఇక్కడ మీకు కీమా నాన్ రెసిపీని అందిస్తున్నాం. కీమా నాన్ పేరు చెబితేనే నోరు ఊరుతుంది, తింటుంటే నోట్లోనే కరిగిపోతుంది. సులభంగా, రుచికరంగా కీమా నాన్ ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదవండి.
Keema Naan Recipe కోసం కావలసినవి
- 300 గ్రాముల కీమా మాంసం
- 1/4 కప్పు టొమాటో ప్యూరీ
- 1 కప్పు గోధుమ పిండి
- 2 కప్పుల మైదా పిండి
- 2 టీస్పూన్ల డ్రై ఈస్ట్
- 1/2 కప్పు పాలు
- 1/2 టీస్పూన్ చక్కెర
- 3 టేబుల్ స్పూన్లు వెన్న
- 3 టేబుల్ స్పూన్లు నూనె
- 1 టీస్పూన్ కారం
- 5 వెల్లుల్లి రెబ్బలు
- 1 ఉల్లిపాయ
- 2 టేబుల్ స్పూన్లు కూరగాయల నూనె
- 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి
- 1 టీస్పూన్ గరం మసాలా పొడి
- రుచికి తగినంత ఉప్పు, నల్ల మిరియాల పొడి.
కీమా నాన్ ఎలా తయారు చేయాలి
- ముందుగా నాన్ కోసం మృదువైన పిండిని సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి, మైదాపిండి, ఈస్ట్, పాలు, చక్కెర, కూరగాయల నూనె, గోరువెచ్చని నీరు, కొద్దిగా ఉప్పు వేసి, అన్నింటిని బాగా కలిపి మెత్తని పిండిలా పిసుక్కోవాలి. ఆ తర్వాత దీనిని తడిగా ఉన్న కిచెన్ టవల్ తో కప్పి పక్కన పెట్టండి.
- ఇప్పుడు కీమాను వండుకోవాలి. మొదటగా కీమాను బాగా నీటితో శుభ్రం చేసుకోవాలి, కూరగాయలను కట్ చేసుకోవాలి.
- అనంతరం, ఒక పాన్ లో నూనె వేసి, అది వేడయ్యాక అందులో వెల్లుల్లి, తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.
- ఆ తర్వాత అందులో కీమా మాంసం వేసి బాగా కలుపుతూ వేయించండి. ఇందులో ఉప్పు, ఎండుమిర్చి, కారం, జీలకర్ర, గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి.
- మాంసం సుగంధ ద్రవ్యాలతో బాగా కలిసిన తర్వాత, టొమాటో ప్యూరీ వేసి మళ్లీ కలుపుతూ వేయించండి. మాంసం ఉడికేంత వరకు మూతపెట్టి ఉడికించాలి.
- ఈలోపు పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని ఈ భాగాలను డిస్క్ ఆకారంలో మందంగా రోల్ చేయండి.
- రోల్ చేసిన రొట్టెలో కీమా మాంసంను నింపి స్టఫ్డ్ బాల్‌ను తయారు చేయండి. ఆపై స్టఫ్డ్ బాల్స్‌ను మళ్లీ 2 అంగుళాల మందం వరకు రోల్ చేయండి.
- అనంతరం మీడియం మంట మీద నాన్-స్టిక్ పాన్ ఉంచండి. వేడి అయ్యాక, రోల్ చేసిన నాన్‌ను తవాపైకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు రెండువైపులా కాల్చుకోవాలి.
అంతే, కీమా నాన్ రెడీ. వేడివేడిగా సర్వ్ చేసి ఆనందించండి!
సంబంధిత కథనం