Ceiling Fan Cleaning Tips। మీ సీలింగ్ ఫ్యాన్‌లను శుభ్రం చేస్తున్నారా? కొన్ని టిప్స్ తెలుసుకోండి!
Ceiling Fan Cleaning tips: మీ సీలింగ్ ఫ్యాన్‌లను క్లీన్ చేయడానికి ఇక్కడ కొన్ని సులభమైన పద్ధతులు, చిట్కాలు ఉన్నాయి, మీరూ తెలుసుకోండి.
Ceiling Fan Cleaning Tips: వర్షాకాలంలో పరిశుభ్రత అనేది ప్రతీ ఒక్కరు కచ్చితంగా పాటించాల్సిన నియమం. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు మన ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటిని, చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం కీలకం. మన ఇళ్లను శుభ్రపరచడం విషయానికి వస్తే, తరచుగా ఫర్నిచర్ దుమ్ము దులపడం, వస్తువులు తుడవడం, ఫ్లోర్ తుడుచుకోవడం చేస్తాము, గదులను చక్కగా ఉంచడంపై దృష్టి పెడతాము. అయినప్పటికీ, చాలాకాలంగా శుభ్రపరచకుండా విస్మరించే ఏదైనా ఉందా? అంటే అది సీలింగ్ ఫ్యాన్ అని చెప్పాలి.
సీలింగ్ ఫ్యాన్‌ను శుభ్రపరుచుకోకపోతే కాలక్రమేణా, దానిపై దుమ్ము, ధూళితో ఇతర హానికర కణాలు పేరుకుపోతాయి. దీనివల్ల ఫ్యాన్ మురికిగా మారడమే కాకుండా అవి గాలిలో అలెర్జీ కారకాలను వ్యాప్తి చేస్తాయి. మురికిగా ఉన్న ఫ్యాన్ బ్లేడ్లు తిరిగేకొద్దీ ఇంట్లో గాలి కూడా చెడిపోతుంది. కాబట్టి మీ ఇంట్లో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి మీ సీలింగ్ ఫ్యాన్‌లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం చాలా అవసరం. ఎలా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకున్నప్పుడే సీలింగ్ ఫ్యాన్ సజావుగా నడుస్తుంది.
మీ సీలింగ్ ఫ్యాన్‌లను క్లీన్ చేయడానికి ఇక్కడ కొన్ని సులభమైన పద్ధతులు, చిట్కాలు ఉన్నాయి, మీరూ తెలుసుకోండి.
పిల్లో కవర్‌తో శుభ్రం చేయడం
మీరు సీలింగ్ ఫ్యాన్ బ్లేడ్‌లను శుభ్రం చేయడానికి పిల్లో కవర్‌ని ఉపయోగించడం గొప్ప టెక్నిక్ అనిపించుటుంది. సీలింగ్ ఫ్యాన్ ప్రతి రెక్క లేదా బ్లేడ్‌కు పిల్లో కవర్‌ను తొడగండి బ్లేడ్‌లను సున్నితంగా స్వైప్ చేయండి. పిల్లో కవర్ తో తుడవడం ద్వారా ఫ్యాన్ రెక్కలు అన్ని వైపులా శుభ్రపడటమే కాకుండా వాటిపై ఉండే దుమ్ము, ధూళి మీపైన లేదా కింద నేలపై పడదు, కవర్ లోపల బంధించబడి, ఉంటుంది. కాబట్టి మీకు శ్రమ కూడా తగ్గుతుంది.
సాక్సులతో శుభ్రం చేయడం
మీ పాతవి, ఉపయోగించని సాక్స్‌లను నీటితో తడిపి, వాటితో ఫ్యాన్ బ్లేడ్‌లను శుభ్రం చేయండి. సాక్సులు సాగే గుణాన్ని కలిగి ఉంటాయి, సాక్స్ రెండు కొనలను పట్టుకొని స్వైపింగ్ మోషన్ లో శుభ్రం చేయడం ద్వారా మురికి సులభంగా పోతుంది. సాక్స్ లోని తేమ దుమ్ము, ధూళిని సంగ్రహించడంలో సహాయపడుతుంది, ఈ చిట్కా మీ ఫ్యాన్ ను మెరిసేలా చేస్తుంది.
డస్టర్ ఉపయోగించడం
మీ ఫ్యాన్ బ్లేడ్‌లను శుభ్రం చేయడానికి కోబ్‌వెబ్ డస్టర్ కూడా ఒక ప్రభావవంతమైన సాధనం. బ్లేడ్‌ల వెంబడి డస్టర్‌ను స్వైప్ చేయండి, అది పేరుకుపోయిన దుమ్ము, ధూళిని సమర్ధవంతంగా సేకరిస్తుంది. డస్టర్ ను తడిపి కూడా ఫ్యాన్ తుడవవచ్చు. ఈ పద్ధతి మీ సీలింగ్ ఫ్యాన్‌ను త్వరగా, చాలా సులభంగా శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది.
వాక్యూమ్ క్లీనర్ వాడకం
మీ వద్ద పొడవైన వాక్యూమ్ క్లీనర్ ఉంటే, మీరు మీ ఫ్యాన్ బ్లేడ్‌లను సమర్థవంతంగా శుభ్రం చేయడానికి దాన్ని ఉపయోగించవచ్చు. నిచ్చెన లేదా కుర్చీపై నిలబడి, బ్లేడ్‌ల నుండి ధూళి, ధూళిని తొలగించడానికి వాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించండి. ఈ పద్ధతి మీకు సునాయాసంగా, పూర్తిగా శుభ్రపరచడానికి సహాయపడుతుంది.
సీలింగ్ ఫ్యాన్ శుభ్రం చేసేటపుడు పాటించాల్సిన జాగ్రత్తలు
- ముందుగా, విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం లేకుండా ఫ్యాన్ స్విచ్ ఆఫ్/ పవర్ ఆఫ్ చేయండి. అలాగే ప్లాస్టిక్, రబ్బరు లేదా కర్ర చెప్పులు ధరించడం ద్వారా కూడా విద్యుదాఘాతాన్ని నివారించవచ్చు.
- ఫ్యాన్‌లపై దుమ్ము దులపడం వల్ల దుమ్ము కణాలు గాలిలో కలిసి, అలెర్జీలు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు దారితీస్తుంది. మీ శ్వాసకోశ వ్యవస్థలోకి దుమ్ము చేరకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి.
- దుమ్ము, ధూళితో మీ ముఖం, వెంట్రుకలు జిడ్డుగా మారతాయి. చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు రాకుండా దుపట్టాతో కప్పి ఉంచండి.
- మీరు శుభ్రం చేసేటపుడు మీ కాళ్ల కింద ఉండే టేబుల్ కదలకుండా నిశ్చలంగా ఉందని నిర్ధారించుకోండి. కాబట్టి మీరు పడిపోకుండా ఉంటారు.
మీ సీలింగ్ ఫ్యాన్‌ను శుభ్రపరచడం ప్రారంభించే ముందు పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తుంచుకోండి.
సంబంధిత కథనం