Signs of Anxiety | మీరు అతిగా ఆందోళన చెందుతున్నారనడానికి కొన్ని సంకేతాలు ఇవే!-signs of anxiety that you should not ignore ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Signs Of Anxiety | మీరు అతిగా ఆందోళన చెందుతున్నారనడానికి కొన్ని సంకేతాలు ఇవే!

Signs of Anxiety | మీరు అతిగా ఆందోళన చెందుతున్నారనడానికి కొన్ని సంకేతాలు ఇవే!

HT Telugu Desk HT Telugu
Jul 21, 2023 10:23 AM IST

Signs of Anxiety: మీ ఆందోళనకు సంబంధించిన ఏవైనా సంకేతాలు ఉంటే వాటిని పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. అతిగా ఆందోళన చెందుతున్నప్పుడు ఎలాంటి సంకేతాలు ఉంటాయో ఇక్కడ పరిశీలించండి.

Signs of Anxiety
Signs of Anxiety (istock)

Signs of Anxiety: జీవితం అన్నాక అప్పుడప్పుడు కొన్ని అలజడులు రేగుతుంటాయి, ఆందోళనలు ఇబ్బంది పెడుతుంటాయి. కొందరికి ఎక్కువ ఆందోళనలు ఉండొచ్చు, మరికొందరికి తక్కువ ఉండొచ్చు. అయినప్పటికీ వాటికి మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం అనే దానిపై మన జీవితం ఆధారపడి ఉంటుంది. కొందరు తమకు ఉన్న సమస్య చిన్నదైనా, పెద్దదైనా అతిగా ఆందోళన చెందుతారు. పైకి గంభీరంగా కనిపించినా లోలోపల తీవ్రంగా కలత చెందుతారు. దీనివల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మీరు ఫీలవుతున్న ఆందోళనకు సంబంధించిన ఏవైనా సంకేతాలు ఉంటే వాటిపై శ్రద్ధ చూపడం, వాటిని పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. అతిగా ఆందోళన చెందుతున్నప్పుడు ఎలాంటి సంకేతాలు ఉంటాయో ఇక్కడ పరిశీలించండి.

ఏకాగ్రత లోపించడం

మీరు తీవ్ర ఆందోళనలో ఉంటే మీ పనులలో ఏకాగ్రత లోపిస్తుంది. మీరు చేసే పనులపై గానీ, ఇతరులు చెప్పే ఎలాంటి విషయాలపైనా దృష్టి పెట్టలేకపోతారు. మనసు అల్లకల్లోలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మతిమరుపు సమస్యలకు కూడా దారి తీస్తుంది, ఏ విషయాలనైనా గుర్తుంచుకోవడం కష్టంగా ఉన్నట్లయితే, ఇది కూడా అధిక ఆందోళన స్థాయిలకు సూచిక కావచ్చు. ఇలాంటీ సంకేతాలు గమనిస్తే, కాసేపు అటూ ఇటూ తిరగండి, ఒత్తిడి తగ్గించుకోడానికి మీకు నచ్చిన పని చేయండి.

పనిభారం పెరిగినట్లు అనిపించడం

మీరు ఎక్కువగా ఆందోళనగా ఉంటే ఏకాగ్రతతో పనిచేయలేరు. మీకు పనిభారం పెరిగినట్లు అనిపిస్తుంది, బాధ్యతలు కూడా ఎక్కువయ్యాయి అనిపిస్తుంది. మీ సామర్థ్యానికి మించి మీరు పనిచేస్తున్నట్లుగా ఒక భావోద్వేగపూరితమైన అనుభూతికి లోనవుతారు. ఇది మీ ఆందోళన స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయని సంకేతం. ఈ రకమైన అనుభూతి చెందడం వల్ల పనులు పూర్తిగా మానేయడం లేదా చాలా కష్టంగా పూర్తిచేయడానికి ప్రయత్నం చేస్తారు.ఇలాంటపుడు ఇతరుల సహాయం పొందడం ద్వారా కొంత తేలికైన అనుభూతిని పొందవచ్చు.

కాళ్లు, చేతులు వణకడం

వణకడం అనేది ఆందోళనకు సంబంధించిన అత్యంత సాధారణ సంకేతాలలో ఒకటి. మీరు మీ శరీరంలో వణుకును అనుభవిస్తున్నట్లయితే, మీరు తీవ్రంగా ఆందోళన చెందుదూ ఆత్రుతగా ఉన్నారని సంకేతం. కాళ్లు, చేతులు వణకడం లేదా మీ మొత్తం శరీరం కూడా వణుకుతున్నట్లు వివిధ మార్గాల్లో వ్యక్తమవుతుంది. ఈ సంకేతం మీలో గమనిస్తే మీరు వెంటనే మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం.

జలదరింపు

మీరు మీ శరీరంలో జలదరింపును అనుభవించడం లేదా స్పర్శ లోపించినట్లు అనిపిస్తే, అది మీరు అతిగా ఆందోళన చెందుతున్నారనడానికి సంకేతం. మీ భావోద్వేగాలను అదుపు చేసుకోడానికి మీరు చేసే ప్రయత్నం చేస్తున్నపుడు, ఒక రకమైన స్పర్శ లేని అనుభూతి మీకు కలుగుతుంది. మీ అవయవాలలో జలదరింపుగా అనిపించడం, కదలలేనట్లు అనిపించడం లేదా ఆ సమయంలో మీరు నిజంగా అక్కడ లేనట్లు అనిపించడం వంటి సంకేతాలు వ్యక్తమవుతాయి. ఈ రకమైన తిమ్మిరిని ఆందోళనకు చిహ్నంగా గుర్తించాలి, మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడానికి చర్యలు తీసుకోవాలి.

నిద్రలేమి

మీకు నిద్ర పట్టడం కష్టంగా ఉన్నట్లయితే, అందుకుమీ ఆందోళనలు ఒక కారణం. మీ ఆందోళన మిమ్మల్ని రాత్రిపూట మేల్కొని ఉండేలా చేస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల పగటిపూట ఒత్తిడిని నిర్వహించడం మరింత కష్టతరం అవుతుంది. మీరు దీర్ఘకాలికంగా ఈ నిద్రలేమిని అనుభవిస్తుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

సంబంధిత కథనం