Ramadan Recipes: షీర్ కుర్మా, హలీమ్ కె కబాబ్.. రంజాన్ కోసం స్పెషల్ రెసిపీలు, టేస్ట్ అదిరిపోతాయి
Ramzan Recipes: రంజాన్ వచ్చిందంటే ముస్లిం సోదరుల ఇంట్లో ఘుమఘుమలు అదిరిపోతాయి. ముఖ్యంగా కబాబ్ లు, షీర్ కుర్మా వంటి రెసిపీలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
Ramzan Recipes: ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకునే రంజాన్ మాసం రేపటితో ముగిసిపోనుంది. రంజాన్ మాసం పూర్తయిన చివరిరోజు ముఖ్యమైన పండుగ ఈద్-ఉల్-ఫితర్ నిర్వహించుకోవడానికి ముస్లిం సోదరులు సిద్ధంగా ఉన్నారు. ఈ పండుగ రోజు ఎన్నో రకాల రెసిపీలు సిద్ధమవుతాయి. ముఖ్యంగా కబాబ్‌లు, పాయసాలు, షీర్ కుర్మా వంటివి ఎక్కువమంది ముస్లిం సోదరుల ఇంట్లో కనిపిస్తాయి. వీటిని చేయడం చాలా సులువు.
హలీం కే కబాబ్ రెసిపీ
కావలసిన పదార్థాలు
బర్గుల్ - అరకప్పు
మినప్పప్పు - అర కప్పు
మటర్ దాల్ - అరకప్పు
పెసరపప్పు - అరకప్పు
మటన్ చాప్స్ - అరకిలో
కారం - ఒక స్పూను
పసుపు - అర స్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
పుదీనా తరుగు - ఒక స్పూను
పచ్చిమిర్చి - రెండు
శెనగపిండి - అరకప్పు
చాట్ మసాలా - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
వెల్లుల్లి తరుగు - రెండు స్పూన్లు
అల్లం తరుగు - రెండు స్పూన్లు
నెయ్యి - రెండే స్పూన్లు
కుంకుమ పువ్వు - నాలుగు రేకులు
ధనియాల పొడి - ఒక స్పూను
జీలకర్ర పొడి - ఒక స్పూను
చాట్ మసాలా - ఒక స్పూను
హలీం కే కబాబ్ రెసిపీ
1. మటన్ చాప్స్ ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టును ఈ మటన్ చాప్స్‌కు బాగా పట్టించాలి.
3. ప్రెషర్ కుక్కర్ లో అన్ని రకాల పప్పులను వేసి ఈ మ్యారినేట్ చేసిన మటన్ చాప్స్‌ను కూడా వేసి ఉడికించాలి.
4. అయిదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాక స్టవ్ కట్టేయాలి.
5. ఆవిరి మొత్తం పోయాక కుక్కర్ మూతను తీసి అందులోని మటన్ చాప్స్ ముక్కలను తీసి వేరే ప్లేట్లో పెట్టాలి.
6. మిగతా మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి.
7. ఇప్పుడు మటన్ చాప్స్ నుండి ఎముకలను, మెత్తటి మాంసాన్ని వేరు చేయాలి.
8. ఆ మాంసాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలో వేయాలి.
9. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
10. నెయ్యి వేడెక్కాక ఉప్పు, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, పచ్చిమిర్చి, కుంకుమపువ్వు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేయించుకోవాలి.
11. ఇప్పుడు చాట్ మసాలాను కూడా వేసి కలపాలి.
12. ఆ మిశ్రమంలోనే ముందుగా ఉడికించుకున్న పప్పు మిశ్రమాన్ని, మటన్ పేస్టును వేసి బాగా కలపాలి.
13. మంటను తగ్గించి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
14. ఈ మొత్తం మిశ్రమం మెత్తని పేస్టులా అవుతుంది.
15. ఇప్పుడు ఇది చల్లారాక శనగపిండిని అందులో కలపాలి.
16. ఒక అరగంట పాటు పక్కన పెట్టాలి.
18. ఇప్పుడు చేతికి నూనె రాసుకుని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న టిక్కిల్లాగా చేత్తోనే ఒత్తుకోవాలి.
19. స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేసి ఈ కబాబ్‌లను కాల్చుకోవాలి.
20. అంతే హలీం కే కబాబ్ రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటాయి. తినే కొద్ది మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
ముస్లిం సోదరుల ఇంట్లో ఈ కబాబులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని చేయడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. కానీ రుచి మాత్రం అదిరిపోతుంది. ఒక్కసారి మీరు చేసుకుని తినండి మీకు నచ్చడం ఖాయం.
............................
షీర్ కుర్మా రెసిపీ
కావలసిన పదార్థాలు
పాలు - ఒక లీటరు
వేయించిన సేమియా - అరకప్పు
చక్కెర పొడి - పావు కప్పు
జీడిపప్పు - పావు కప్పు
బాదం - పావు కప్పు
పిస్తా - పావు కప్పు
కిస్మిస్లు - పావు కప్పు
ఖర్జూరాలు - ఆరు
నెయ్యి - రెండు స్పూన్లు
రోజ్ వాటర్ - ఒక స్పూను
కోవా - నాలుగు స్పూన్లు
షీర్ కుర్మా రెసిపీ
1. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయండి.
2. ఆ నెయ్యిలో జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్లను వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
3. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టి పాలు వేడి చేయండి.
4. పాలు మరిగాక ముందుగా వేయించిన సేమ్యాను వేసి బాగా కలపండి.
5. సన్నని మంట మీద ఎక్కువ సేపు మరిగిస్తే పాలు సగానికి తగ్గుతాయి.
6. అప్పుడు పాలు చిక్కగా అవుతాయి. అలా పాలు చిక్కగా అయినప్పుడు చక్కెర పొడిని, కోవాను వేసి బాగా కలపండి.
7. మంటను మీడియం మీద ఉంచండి. అందులో ముందుగా వేయించిన బాదం, పిస్తా, కిస్మిస్, జీడిపప్పులను వేసి కలపండి.
8. అలాగే ఖర్జూరాలను సన్నగా తరిగి వేయండి. అలాగే రోజ్ వాటర్ ని కూడా వేసి కలపండి.
9. ఇవన్నీ వేశాక ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించండి.
10. ఇది కాస్త చిక్కగా అవుతుంది. అలా చిక్కగా అయ్యాక స్టవ్ కట్టేయండి. అంతే షీర్ కుర్మా రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా నచ్చుతుంది.
షీర్ కుర్మాలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలనే వాడాము. చక్కెరను తక్కువగానే వాడాము, కాబట్టి ఆరోగ్యానికి హాని చెయ్యదు. డయాబెటిస్ రోగులు ఈ షీర్ కుర్మాను తక్కువగా తింటే మంచిది. మిగతావారు మాత్రం కుమ్మేయొచ్చు.