STDs | తస్మాత్ జాగ్రత్త.. లైంగికంగా సంక్రమించే కొన్ని వ్యాధులు లక్షణాలు చూపవు..!-sexually transmitted diseases that show few or no symptoms ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Stds | తస్మాత్ జాగ్రత్త.. లైంగికంగా సంక్రమించే కొన్ని వ్యాధులు లక్షణాలు చూపవు..!

STDs | తస్మాత్ జాగ్రత్త.. లైంగికంగా సంక్రమించే కొన్ని వ్యాధులు లక్షణాలు చూపవు..!

HT Telugu Desk HT Telugu
Aug 01, 2022 01:08 PM IST

లైంగికంగా సంక్రమించే కొన్ని సుఖవ్యాధులు (STDs/STIs) సోకితే అసలు లక్షణాలు కనిపించవు. వాటిని చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు. అటువంటి కొన్ని సుఖవ్యాధుల గురించి ఇక్కడ చదవండి.

<p>STI that show few or no symptoms</p>
STI that show few or no symptoms (unsplash)

లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు (STI) లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STD)లు చాలానే ఉన్నాయి. అందులో కొన్నింటికి లక్షణాలు తక్కువగా కనిపిస్తాయి. ఇంకా కొన్ని సుఖవ్యాధులు సోకితే చాలా మందికి అవి సోకినట్లు కూడా తెలియదు. ఎందుకంటే అసలు లక్షణాలు ఏమీ కనిపించవు. అందువల్ల ఇలాంటి సుఖవ్యాధులను గుర్తించటం కష్టమవుతుంది. కానీ వాటికి చికిత్స తీసుకోకుండా అలాగే వదిలేస్తే మాత్రం, ఆ వ్యాధులు మరింత తీవ్రతరం కావచ్చు. దీంతో అవి మీ లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. సంతానోత్పత్తికి కూడా ఆటంకం కలిగిస్తాయి. అలాంటి సుఖవ్యాధుల గురించి ఇక్కడ తెలుసుకోండి.

ఎలాంటి STI రకాలు లక్షణాలు లేకుండా ఉంటాయి

మదర్‌హుడ్ హాస్పిటల్స్‌లో సీనియర్ కన్సల్టెంట్ అబ్‌స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ షాలిని విజయ్ చెప్పిన ప్రకారం.. లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల్లో అనేక రకాలు ఉన్నాయి. అవి లక్షణాలను చూపించవచ్చు లేదా చూపించకపోవచ్చు. లక్షణాలు కనిపిస్తే సులభంగా గుర్తించి వాటిని నయం చేయవచ్చు. కానీ లక్షణాలు లేని STIలను నిర్ధారించడం కూడా కష్టంగా ఉంటుంది. అటువంటి కొన్ని రకాలైన STIల గురించి డాక్టర్ షాలిని వివరించారు. అవేంటో ఇక్కడ చూడండి.

గోనేరియా

గోనేరియా అనేది అత్యంత సాధారణమైన STIలలో ఒకటి. ఇది నీసేరియా గోనోరియా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. గోనేరియా సోకిన స్త్రీలలో చాలామందికి ఎటువంటి స్పష్టమైన సంకేతాలు కనిపించవు. కానీ ఇది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. గనేరియాకు చికిత్స తీసుకోకపోతే అది పెల్విక్ ఇన్ల్ఫమేటరీ డిసీజ్, ఫెలోపియన్ ట్యూబ్‌లను అడ్డుకునే మచ్చ కణజాలం, గర్భధారణలో ఇబ్బందులు, దీర్ఘకాలిక కడుపు నొప్పికి మొదలైన సమస్యలకు దారితీయవచ్చు.

ఈ ఇన్ఫెక్షన్ సెక్స్ చేయడం ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఓరల్ సెక్స్, మలమార్గం ద్వారా చేసే సెక్స్ చేసినా కలుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్ సోకినపుడు యోని ఈస్ట్, గొంతు నొప్పి, వెజీనల్ డిశ్చార్జ్, తరచుగా మూత్రవిసర్జన, పొత్తికడుపు నొప్పి, జ్వరం, పీరియడ్స్ లో రక్తం ఎక్కువగా పోవడం జరుగుతుంది.

క్లామిడియా

క్లామిడియా అనేది చాలా మంది వ్యక్తులలో కనిపించే సాధారణ లైంగిక సంక్రమణం. ఇది నోటి ద్వారా, మల మార్గం అలాగే యోని సెక్స్ ద్వారా వ్యాపిస్తుంది. ఇది క్లామిడియా ట్రాకోమాటిస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఎక్కువగా 15-24 సంవత్సరాల వయస్సులో ఉన్నవారికి ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. దీని వలన ఫెలోపియన్ ట్యూబ్‌లు, అండాశయాలు, ఎండోమెట్రియల్ లైనింగ్‌లలో మచ్చలకు దారితీయవచ్చు. ఇది సోకితే వంధ్యత్వానికి దారితీయవచ్చు. లేదా గర్భినీ స్త్రీలకు ప్రసవ సమయంలో వారి పుట్టబోయే పిల్లలకు కూడా ఈ వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉంది.

హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV)

ఇది లైంగికంగా అలాగే రక్తం ద్వారా సంక్రమించే వ్యాధి. HIV సోకినా కూడా చాలా కాలం పాటు లక్షణాలు బయటపడవు. హెచ్‌ఐవీ ఉన్న వ్యక్తులు సాధారణ ఫ్లూ వంటి లక్షణాలను కలిగి ఉండవచ్చు. హెచ్‌ఐవి సోకిన వ్యక్తి వీలైనంత త్వరగా చికిత్స తీసుకోకపోతే ఆ వ్యక్తి ఎయిడ్స్‌ బారిన పడతారు. ఇది ప్రాణాంతకమైన వ్యాధి.

జననేంద్రియ హెర్పెస్

జెనెటల్ హెర్పెస్ అని పిలిచే ఈ STI నోటి, అంగ అలాగే యోని సెక్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. హెర్పెస్ సోకిన వ్యక్తికి ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు లేదా తక్కువగా ఉండవచ్చు. ఈ కారణంగా, చాలా మంది వ్యక్తులు తమ పరిస్థితిని గుర్తించలేరు. ఈ వ్యాధి సోకితే జననాయవాల వద్ద పుండ్లు, పూతలు ఏర్పడతాయి. ఇవి నొప్పిని కలిగిస్తాయి. అలాగే మూత్రవిసర్జన చేసేటపుడు మంటగా అనిపిస్తుంది. యోని నుంచి ఒక రకమైన స్రావాలు విడుదల అవుతాయి.

5. ట్రైకోమోనియాసిస్

మహిళల్లో సాధారణంగా కనిపించే ప్రోటోజోవాన్ పరాన్నజీవి వల్ల ట్రైకోమోనియాసిస్ వస్తుంది. కొన్నిసార్లు, కొంతమంది స్త్రీలు మూత్రవిసర్జన లేదా సంభోగం సమయంలో మంట, దురద లేదా దుర్వాసనతో కూడిన యోని ఉత్సర్గతో నొప్పిని అనుభవించవచ్చు.

చివరగా..

అసాధారణమైన యోని స్రావాలు, మూత్రవిసర్జన పెరగడం, దుర్వాసనతో కూడిన మూత్రం, పొత్తికడుపులో నొప్పి, లైంగిక సంపర్కం సమయంలో నొప్పి, బాధాకరమైన మూత్రవిసర్జన, పీరియడ్స్ మధ్య రక్తస్రావం, యోని ప్రాంతంలో దురద, గాఢమైన యోని వాసన, జననేంద్రియాలలో గడ్డలు లేదా పుండ్లు వంటి ఏవైనా లక్షణాలను మీరు అనుభవిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Whats_app_banner

సంబంధిత కథనం