Photoshoot locations: హైదరాబాద్‌లో బెస్ట్ ఫొటోషూట్ లొకేషన్లు ఇవే.. ఏ ఫీజు లేనీ ప్రదేశాలూ ఉన్నాయ్-see the list of best photoshoot locations in hyderabad ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Photoshoot Locations: హైదరాబాద్‌లో బెస్ట్ ఫొటోషూట్ లొకేషన్లు ఇవే.. ఏ ఫీజు లేనీ ప్రదేశాలూ ఉన్నాయ్

Photoshoot locations: హైదరాబాద్‌లో బెస్ట్ ఫొటోషూట్ లొకేషన్లు ఇవే.. ఏ ఫీజు లేనీ ప్రదేశాలూ ఉన్నాయ్

Koutik Pranaya Sree HT Telugu
Aug 10, 2024 12:30 PM IST

Photoshoot locations: శుభ ముహూర్తాల సమయం వచ్చేసింది. ఫొటోషూట్ కోసం హైదరాబాద్‌లో కొన్ని ఉత్తమ లొకేషన్లున్నాయి. అవేంటో చూడండి.

ఫొటోషూట్ లొకేషన్లు
ఫొటోషూట్ లొకేషన్లు (pexels)

ఆషాడం పోయి శ్రావణం వచ్చేసింది. శ్రావణం అంటేనే శుభకార్యాలు, శుభ ముహూర్తాలు, పెళ్లిళ్లు, వేడుకలు. ప్రతి వేడుకకు ఈ మధ్య ఫొటోషూట్ చేయడం తప్పనిసరి అయ్యింది. హైదరాబాద్‌లో కొన్ని బెస్ట్ ఫోటోషూట్ లొకేషన్లున్నాయి. వాటికోసం ఎక్కువగా డబ్బు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. వాటిలో కొన్ని మీకు సుపరిచితమే. కానీ ఫొటోషూట్‌కు ఇవి బాగుంటాయని మరోసారి గుర్తుచేస్తున్నాం.

గోల్కొండ కోట:

రాజమౌళి మగధీర సినిమాలో ఏకంగా పంచదార కొమ్మా కొమ్మా.. అనే ఒక పూర్తి పాటను ఇక్కడే తెరకెక్కించారు. అంత సుందర దృశ్యాలు గోల్కొండ కోటలో ఉంటాయి. ఇక ప్రివెడ్డింగ్, కిడ్స్ షూట్, మెటర్నిటీ షూట్లకు కూడా ఇది బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. కెమెరాకు ప్రత్యేక ధర చెల్లిస్తే ఇక్కడ షూట్ చేసుకోవచ్చు.

అమ్మపల్లి టెంపుల్:

శంషాబాద్ బస్ స్టాప్ నుంచి అటూ ఇటూగా 5 కిమీ దూరంలో ఉంటుందీ ఆలయం. దీన్నే అమ్మపల్లి శ్రీ రామ చంద్ర స్వామి టెంపుల్ అనీ పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే కొలను దగ్గర ఎన్ని సినిమా షూటింగులు జరిగాయో లెక్కలేదు. టాలీవుడ్‌లో ఈ ఆలయం దగ్గర ఒక్క సీన్ షూట్ చేసినా హిట్టయిపోతుందనే నమ్మకమూ ఉందట. ఇక్కడ షూట్ కోసం బట్టలు మార్చుకోడానికి వసతులు కూడా ఉంటాయి. ఇక్కడ షూటింగ్ కోసం మూడు వేల దాకా చెల్లించాల్సి ఉంటుంది.

చార్మినార్:

చార్మినార్ వీధి అందాలు, చార్మినార్ అందాలు సరైన సమయంలో క్లిక్ మనిపిస్తే ఫొటోలు అద్భుతంగా వస్తాయి. రాత్రి పూట లాడ్ బజార్లో, ఉదయం సమయంలో చార్మినార్ ముందు షూటింగ్ చేయొచ్చు. ఏ ఖర్చూ లేకుండా అయిపోతుందిక్కడ.

శిల్పారామం:

మాదాపూర్‌లో ఉన్న శిల్పారామం దాదాపు 65 ఎకరాల్లో విస్తరించి ఉంది. పల్లెటూరి వాతావరణం థీమ్‌తో ఫోటొషూట్ చేయాలనుకుంటే ఈ చోటు పర్ఫెక్ట్. అలాగే ఇక్కడ షూటింగ్ కోసం రకరకాల చోట్లు అందుబాటులో ఉంటాయి. వీకెండ్స్‌లో రద్దీ వల్ల ఇక్కడ షూట్ కష్టం. వారం మధ్యలో వెళ్తే మంచి ఫొటోలు తీసుకోవచ్చు.

ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్:

సంజీవయ్య పార్కు రోడ్డు నుంచి ట్యాంక్ బండ్, అటు నుంచి ఎన్టీ‌ఆర్ గార్డెన్స్.. ఇలా అన్నీ కలిపి మంచి లొకేషన్లు ఉన్నాయి. ఉదయం పూట సూర్యోదయం సమయంలో వెళ్తే తక్కువ రద్దీ ఉంటుంది. మెటర్నిటీ, ప్రీవెడ్డింగ్.. ఏవైనా షూట్ చేసుకోవచ్చు.

వీటితో పాటే హైదరాబాద్‌లో, చుట్టు పక్కలా ఎన్నో ఫోటోషూట్ లొకేషన్లున్నాయి. కొన్ని ఫొటో లొకేషన్ స్టూడియోలు గంటల లెక్కన వేల రూపాయలు వసూలు చేస్తాయి. కానీ వాటికి బదులు ఫొటోలు సహజంగా రావాలంటే ఈ షూట్ లొకేషన్లు బాగుంటాయి. అనేక ప్రైవేట్ రిసార్టుల్లోనూ షూట్ చేయించుకోవచ్చు.

వీటితో పాటే..

దుర్గం చెరువు

దక్కన్ పార్క్

లుంబినీ పార్క్

లోటస్ పాండ్

చౌమహల్లా ప్యాలెస్

రామోజీ ఫిల్మ్ సిటీ

తారామతి బరాదారి

ది హిడెన్ క్యాసల్

అమీన్ పుర లేక్

ఫలక్‌నుమా ప్యాలెస్

దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ పార్క్

లుంబిని పార్క్

ఎన్‌టీఆర్ గార్డెన్స్

ఇలా చాలా చోట్ల బెస్ట్ ఫోటోలు తీసుకోవచ్చు. వీటన్నింటికీ కెమెరా కోసం ప్రత్యేకంగా రుసుము చెల్లించి షూట్ తీసుకోవాల్సి ఉంటుంది.

టాపిక్