Magadheera 4k version in ott: మగధీర 4కే వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడ చూడొచ్చంటే?
Magadheera 4k version in ott: రామ్ చరణ్, కాజల్ నటించిన మగధీర మూవీ ఇప్పుడు 4కే వెర్షన్ లోనూ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఈ మధ్యే రీరిలీజ్ అయిన విషయం తెలిసిందే.
Magadheera 4k version in ott: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయిన సినిమా మగధీర. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ 15 ఏళ్ల కిందటే రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లతో టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. అయితే ఈ మధ్యే చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ 4కే వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడదే క్వాలిటీతో ఓటీటీలోకి కూడా వచ్చేసింది.
మగధీర 4కే వెర్షన్
రామ్ చరణ్, కాజల్ కలిసి నటించిన మగధీర మూవీ 4కే వెర్షన్ యూట్యూబ్ లో చూడొచ్చు. వీడియో 4కే క్వాలిటీతోపాటు డాల్బీ ఆడియో కూడా ఉండటంతో ఈ సూపర్ హిట్ మూవీ ఓ కొత్త అనుభూతిని కలిగించనుంది. 15 ఏళ్ల కిందటే భారీ బడ్జెట్ తో రాజమౌళి ఈ మూవీని తెరకెక్కించిన తీరు ఎంతో మందికి నచ్చింది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించాడు.
ఈ మూవీ 4కే వెర్షన్ యూట్యూబ్ లో అందుబాటులోకి వచ్చిన విషయాన్ని కూడా గీత ఆర్ట్స్ తమ అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో రాజమౌళి క్రేజ్ మరో స్థాయికి చేరింది. ఆ తర్వాత అతడు తీసిన ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు టాలీవుడ్ నుంచి అతన్ని గ్లోబల్ లెవల్ కు తీసుకెళ్లాయి.
మగధీర రీరిలీజ్ డిజాస్టర్
మగధీర తొలిసారి రిలీజైనప్పుడు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రీరిలీజ్ చేస్తే మరోసారి అలాంటి రికార్డులే క్రియేట్ చేస్తుందని భావించారు. కానీ ఊహించని విధంగా ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. రీరిలీజ్ లో అసలు ఈ మూవీ చూసేవారే కరవయ్యారు. అక్కడక్కడా కొన్ని ఫ్యాన్స్ షోలు తప్ప మిగతా అన్ని చోట్లా థియేటర్లు ఖాళీగా దర్శనమిచ్చాయి.
అదే సమయంలో రామ్ చరణ్ కెరీర్లోనే పెద్ద డిజాస్టర్ అయిన ఆరెంజ్ మూవీ మాత్రం గతేడాది అతని బర్త్ డే సందర్భంగా రిలీజై సూపర్ హిట్ అయింది. ఈ మూవీ రీరిలీజ్ లోఏకంగా రూ.3.2 కోట్లు వసూలు చేసింది. ఈమధ్య కాలంలో రీరిలీజ్ సినిమాలకు ఇలాంటి వింత అనుభవమే ఎదురవుతోంది. అప్పట్లో హిట్ అయిన మూవీ ఫట్ అవుతుండగా.. డిజాస్టర్ మూవీ హిట్ అవుతోంది.
ఇక రామ్ చరణ్ నెక్ట్స్ సినిమాల విషయానికి వస్తే అతడు నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. ఈ మధ్యే బర్త్ డే సందర్భంగా జరగండి అనే పాటను రిలీజ్ చేశారు. ఇంకా రెండు నెలల షూటింగ్ మిగిలే ఉందని నిర్మాత దిల్ రాజు చెప్పాడు. దీని తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ16, సుకుమార్ తో ఆర్సీ17 మూవీస్ ను చరణ్ చేయనున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత రెండేళ్లుగా చరణ్ నటించిన పూర్తి స్థాయి సినిమా మరొకటి రాలేదు.