Saturday Motivation: జిందగీ నా మిలేగి దోబారా.. ప్రతిరోజూ ఎంత ఆనందంగా జీవించాలంటే ఇదే చివరి రోజు అన్నట్టుగా
Saturday Motivation: జీవితం దేవుడిచ్చిన వరం. కానీ ఆ జీవితం విలువను తెలుసుకోలేక... ఎంతో మంది చిన్నచిన్న కష్టాలకి తిట్టుకుంటూ ఉంటారు. నాది ఒక జీవితమేనా అని విమర్శించుకుంటారు. జీవితం విలువను తెలుసుకుంటే ఎవరూ అలా మాట్లాడారు.
Saturday Motivation: మీ జీవితాన్ని మీరే ప్రేమించాలి... వేరేవారు వచ్చి ప్రేమించరు. జీవితాన్ని ప్రేమించే వ్యక్తి చాలా ఆనందంగా ఉంటాడని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఎవరైతే తమ జీవితాన్ని నిత్యం తిట్టుకుంటూ ఉంటారో... వారికి ప్రతీ విషయంలోనూ అసంతృప్తి ఎదురవుతుంది. అందుకే ముందుగా జీవితాన్ని ప్రేమించడం నేర్చుకోండి. మీకున్న కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు అన్నీ వాటంతట అవే మబ్బు తెరల్లా వీడిపోతాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో గొప్పవారు... మనిషి జీవితాన్ని ఆనందమయం చేయడానికి ఎన్నో మార్గాలను కనిపెట్టారు. ఆహారపరంగా, విహారాల్లో, విజ్ఞానాల్లో మీకు నచ్చిన విధంగా మీ జీవితాన్ని మీరు ఆనందంగా గడపవచ్చు. కొంతమందికి నచ్చిన ఆహారాన్ని తింటే ఆనందం, మరికొందరికి కొత్త ప్రదేశాలకు వెళ్లడం సంతోషం, ఇంకొందరికి కుటుంబంతో గడపడం ఇష్టం... మీకు ఏది ఇష్టమైతే అదే మీ జీవితంలో చేయండి. మీకు ఇష్టం లేని పనిని ఆ క్షణమే వదిలేయండి. అంతే తప్ప జీవితాన్ని తిట్టుకుంటూ కూర్చోకండి.
జీవితం ఒక అద్భుతమైన వరం. మనిషి పుట్టుకను మీకు ఇచ్చినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోండి. చీమలాగో, పురుగులాగో పుడితే మీ పరిస్థితి ఇంకెలా ఉండేదో అర్థం చేసుకోండి. మన జీవితంలో గడుస్తున్న ప్రతిరోజూ మన జీవితం నుంచి కొంత సమయాన్ని తగ్గిస్తూ ఉంటుంది. నిన్న మనతోపాటు నిద్రించిన ఎంతోమంది ఈరోజు సజీవంగా లేకపోవచ్చు. అంటే మనకి ఈరోజు బోనస్‌గా దొరికిందని చెప్పుకోవాలి.
ఒక్కసారి ఏదైనా ఆసుపత్రిని సందర్శించండి. అక్కడ ఆరోగ్యం చెడిపోయి ఎంతో మంది రోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారో అర్థం అవుతుంది. ఒక్కరోజైనా బతికించమని వైద్యులను కోరే వారు ఉంటారు. వారితో పోలిస్తే మీరు ఎంత అదృష్టవంతులో ఒకసారి తలచుకోండి. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టండి. మీరు ఎంత ఆనందంగా ఉండాలంటే... అదే మీ చివరి రోజు అన్నంతగా.
ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తర్వాత ఆనందంగా జీవించడం అదే అలవాటవుతుంది. ఎలాంటి అరమరికలు లేని చంటి పిల్లలను చూసి ప్రతిరోజూ ఆనందంగా జీవించడం నేర్చుకోండి. వారికి రేపటి గురించి బెంగ ఉండదు. ప్రతిక్షణాన్ని ఆస్వాదించడమే వారికి తెలుసు. మిమ్మల్ని మీరు చంటి పిల్లలతో పోల్చుకోండి. జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించండి.