Karapusa Recipe: సన్న కారప్పూస రెసిపీ చాలా సులువు, దీన్ని దుకాణాల్లో కొనే కన్నా ఇంట్లోనే ఇలా చేసేయండి-sanna karapusa recipe is very easy know how to make this sev recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Karapusa Recipe: సన్న కారప్పూస రెసిపీ చాలా సులువు, దీన్ని దుకాణాల్లో కొనే కన్నా ఇంట్లోనే ఇలా చేసేయండి

Karapusa Recipe: సన్న కారప్పూస రెసిపీ చాలా సులువు, దీన్ని దుకాణాల్లో కొనే కన్నా ఇంట్లోనే ఇలా చేసేయండి

Haritha Chappa HT Telugu
Sep 25, 2024 11:45 AM IST

Karappusa Recipe: చాలామంది బయట స్వీట్ షాపుల్లోనే మిక్చర్లు, కారప్పూసలు, చేగోడీలు వంటివి కొనేందుకు ఇష్టపడుతున్నారు. నిజానికి వీటిని చేయడం చాలా సులువు. ఇక్కడ మేము సన్నకారప్పూస రెసిపీని ఇచ్చాము.

సన్న కారప్పూస రెసిపీ
సన్న కారప్పూస రెసిపీ

సాయంత్రమైతే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలా తినేందుకు సన్న కారప్పూస బెస్ట్ ఎంపిక. పిల్లల కోసం స్నాక్స్‌గా కూడా స్కూల్ కి ఏమైనా పెట్టాల్సి వస్తుంది. ఇలా పెట్టాల్సి వచ్చినప్పుడు ప్రతిసారీ స్వీట్ షాపుల్లో చేగోడీలు, జంతికలు, కారప్పూసలు, పకోడీలు కొనే బదులు ఇంట్లోనే వాటిని తయారు చేసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటాయి. బయట ఎలాంటి నూనెలో వాటిని వేయిస్తున్నారో కూడా తెలియదు. ఇక్కడ మేము సన్నకారపూస రెసిపీని ఇచ్చాము. నిజానికి దీన్ని చేయడం చాలా సులువు. ఇది చేయడం కష్టమేమో అనుకునే ఎంతోమంది కొనేందుకే ఇష్టపడతారు. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. ఎంత సింపుల్‌గా అయిపోతుందో రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

సన్న కారప్పూస రెసిపీకి కావలసిన పదార్థాలు

శెనగపిండి - నాలుగు కప్పులు

బియ్యప్పిండి - అరకప్పు

కారం - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

వాము - ఒక స్పూను

నూనె - తగినంత

ఉప్పు - రుచికి సరిపడా

సన్న కారప్పూస రెసిపీ

1. సన్నకారపూస చేసేందుకు శెనగపిండిని ముందుగా బాగా చల్లించుకోవాలి. ఎలాంటి ఉండల్లేకుండా చూసుకోవాలి.

2. దాన్ని ఒక గిన్నెలో వేయాలి. ఆ గిన్నెలోనే బియ్యప్పిండిని కూడా వేసి బాగా కలపాలి.

3. రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకోవాలి.

4. జీలకర్రను, వామును మిక్సీలో వేసి పొడి చేయాలి.

5. ఆ పొడిని కూడా శెనగపిండి మిశ్రమంలో వేసి బాగా కలపాలి.

6. ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఆ నూనెను కూడా ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి.

7. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ మెత్తగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.

8. ఈ పిండి మరీ గట్టిగా కాకుండా అని మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి.

9. ఇప్పుడు సన్నకారపూస వేసేందుకు సన్నని రంధ్రాలు ఉన్న జంతికల గొట్టాన్ని తీసుకోవాలి.

10. అందులో ఈ పిండిని వేయాలి.

11. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి నూనెను వేయాలి.

12. నూనె వేడెక్కాక జంతికల గొట్టంతో పెద్ద జంతికలాగా దీన్ని వేసుకోవాలి. లోపల పెట్టిన అచ్చు సన్నని రంధ్రాలతో ఉంటుంది కాబట్టి సన్నగా జంతికలు వస్తాయి.

13. ఆ జంతికలను రెండు వైపులా వేయించి తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.

14. చల్లారాక చేత్తోనే వాటిని నొక్కేయాలి. అంతే సన్నకారపూస రెడీ అయిపోతుంది.

15. ఇది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. గాలి చొరబడని డబ్బాలో వేసి దీన్ని ఉంచుకుంటే ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయి.

16. ఒక్కరోజు చేసుకుంటే 15 నుంచి 20 రోజులు తాజాగా ఉంటాయి.

నోరు చప్పగా అనిపించినప్పుడల్లా ఈ సన్నకారపూసను తినండి. అలాగే పిల్లలకు కూడా ఇది ఇస్తే బోర్ కొట్టకుండా ఉంటుంది. స్కూల్లో వారికి స్నాక్స్ పెట్టాల్సి వస్తే రోజూ వారికి పండ్లే పెడితే వారికి బోరింగ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా ఇంట్లో తయారు చేసిన సన్నకారపూసను పెట్టి చూడండి. వారికి కచ్చితంగా నచ్చుతుంది.

టాపిక్