Saggu biyyam khichdi: సగ్గుబియ్యం కిచిడి పిల్లలకూ లంచ్ బాక్స్ రెసిపీగా ఉపయోగపడుతుంది చేయడం చాలా సులువు
Saggubiyyam khichdi: సగ్గుబియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో కిచిడీ తయారు చేసుకుని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం. ముఖ్యంగా పిల్లలకు ఇది నచ్చుతుంది.
Saggu biyyam khichdi: సగ్గుబియ్యాన్ని సాబుదానా అని పిలుస్తారు. దీంతో అనేక రకాల వంటకాలను చేస్తారు. అందులో ముఖ్యమైనది సగ్గుబియ్యం కిచిడి. ఇది పిల్లలకు లంచ్ బాక్స్ లో పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా రాత్రిపూట తేలికపాటి ఆహారాన్ని తినాలనుకుంటే ఇలా సగ్గుబియ్యం కిచిడి చేసుకొని చూడండి. ఇది తినాలనిపించేలా ఉంటుంది. ఈ సగ్గుబియ్యం కిచిడి రెసిపీ కూడా చాలా సులువు.
సగ్గుబియ్యం కిచిడీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
సగ్గుబియ్యం - ఒక కప్పు
బంగాళదుంప - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
అల్లం - చిన్న ముక్క
ఉప్పు - రుచికి సరిపడా
కరివేపాకులు - గుప్పెడు
జీలకర్ర - అర స్పూను
వేరుశనగ పలుకులు - గుప్పెడు
నెయ్యి - ఒక స్పూన్
జీలకర్ర - అర స్పూను
సగ్గుబియ్యం కిచిడి రెసిపీ
1. సగ్గుబియ్యాన్ని నీటిలో వేసి రెండు మూడు గంటలు నానబెట్టాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి వేరుశెనగ పలుకులను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. అవి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
5. ఆ నెయ్యిలో జీలకర్ర వేసి వేయించుకోవాలి.
6. అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకులు వేసి వేయించుకోవాలి.
7. వాటిని రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఉడికించిన బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కోసి వేయించుకోవాలి.
8. బంగాళదుంపలు రంగు మారేవరకు వేగాక అప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేయాలి.
9. ఈ మొత్తం మిశ్రమాన్ని పది నిమిషాలు చిన్న మంట మీద వేయించుకోవాలి.
10. తర్వాత ముందుగా పొడి చేసుకున్న వేరుశనగ పొడిని వేసి కలుపుకోవాలి.
11. ఒక కప్పు సగ్గుబియ్యం కిచిడీకి అరకప్పు వేరుసెనగ పొడి అవసరం పడుతుంది.
12. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కిచిడిని కలుపుకోవాలి.
13. పైన కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ సగ్గుబియ్యం కిచిడీ రెడీ అయిపోతుంది.
సగ్గుబియ్యాన్ని ప్రతిరోజూ తిన్నా మంచిదే. దీనిలో ఫైబర్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉంటాయి. అధిక రక్తపోటు ఉన్నవారు సగ్గుబియ్యాన్ని తినడం వల్ల హైబీపీ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సగ్గుబియ్యం ఎంతో మేలు చేస్తుంది. పిల్లలకు సగ్గుబియ్యం పెట్టడం వల్ల వారి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇందులో ఫోలేట్ అధికంగా ఉంటుంది. కాబట్టి మెదడులో ఎలాంటి సమస్యలు రాకుండా ఇది అడ్డుకుంటుంది. కాబట్టి పిల్లలకి అప్పుడప్పుడు సగ్గుబియ్యం వంటకాలు తినిపిస్తూ ఉండండి.