Sabudana: ముత్యాల్లాంటి సగ్గుబియ్యాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా? ఇవి తింటే ఎంతో ఆరోగ్యం-sabudana do you know how to make saggubiyyam eating these is very healthy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sabudana: ముత్యాల్లాంటి సగ్గుబియ్యాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా? ఇవి తింటే ఎంతో ఆరోగ్యం

Sabudana: ముత్యాల్లాంటి సగ్గుబియ్యాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా? ఇవి తింటే ఎంతో ఆరోగ్యం

Haritha Chappa HT Telugu
Mar 17, 2024 09:30 AM IST

Sabudana: తెలుగు రాష్ట్రాల్లో సగ్గుబియ్యం అని పిలుస్తారు. అదే ఉత్తరాదికి వెళితే వీటిని సాబుదానా అంటారు. వేసవిలో సగ్గుబియ్యాన్ని జావ కాచుకుంటే చలువ చేస్తుంది. వీటిని ఎలా తయారు చేస్తారో తెలుసా?

సగ్గుబియ్యం ఎలా తయారుచేస్తారు
సగ్గుబియ్యం ఎలా తయారుచేస్తారు (Amazon)

Sabudana: సగ్గుబియ్యాన్ని చూస్తే ఎవరో ఒక్కొక్క గింజను చేత్తో గుండ్రంగా చుట్టి చేసినట్టు ఏ మాత్రం వంకలు లేకుండా ఉంటాయి. వీటిని చూస్తే ప్రతి ఒక్కరికీ తెల్లని ముత్యాలే గుర్తొస్తాయి. వేసవి వచ్చిందంటే చలువ చేసే ఆహారాల కోసం ప్రజలు వెతుకుతూ ఉంటారు. అలాంటి వాటిల్లో సగ్గుబియ్యం ఒకటి. సగ్గుబియ్యం జావను తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. సగ్గుబియ్యంతో అనేక రకాల వంటలు వండవచ్చు. వీటిని తినడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఈ ముత్యాల్లాంటి సగ్గుబియ్యాన్ని ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా తెలుసుకున్నారా?

సగ్గబియ్యం తయారీ

సగ్గుబియ్యాన్ని కర్ర పెండలంతో తయారు చేస్తారు. ఇది భూమిలో పెరిగే పెద్ద దుంప. కర్ర పెండలాన్ని సేకరించి అవి తాజాగా ఉన్నప్పుడే సగ్గుబియ్యాన్ని తయారుచేస్తారు. భూమిలో నుంచి వాటిని తీసాక కేవలం 24 గంటల్లోపే తయారీ కేంద్రానికి పంపించి సగ్గుబియ్యం తయారీ మొదలు పెడతారు. కొన్ని యంత్రాల్లో ఈ కర్ర పెండలాన్ని వేస్తే అవి పైనున్న తొక్కను తీసేస్తాయి. తర్వాత క్రషర్ లో వేస్తారు. వాటి నుంచి పాలను విడదీస్తారు. ఈ పాలను ఫిల్టరింగ్ మిషన్లలో వేస్తారు. అక్కడ అవి ఫిల్టర్ అయ్యి చివరికి తెల్లని పదార్థం బయటికి వస్తుంది. ఆ తెల్లని పదార్థాన్ని జల్లెడలో వేసి ఇటూ అటూ తిప్పుతారు. అలా తిప్పినప్పుడు జల్లెడలోని రంధ్రాల నుంచి ఆ ముద్ద గుండ్రని గింజల్లాగా కింద పడతాయి. అప్పుడవి చాలా మెత్తగా ఉంటాయి. వాటిని ఎ ఎండల్లో పెట్టి బాగా గట్టిపడేలా చేస్తారు. అంతే తెల్లని సగ్గుబియ్యం రెడీ అయినట్టే.

మనకు కిలో సగ్గుబియ్యం కావాలంటే ఐదు కిలోల దుంపలు అవసరం పడతాయి. కర్ర పెండలం నుంచి మనం సగ్గుబియ్యాన్ని తయారు చేస్తాము. అదే ఆఫ్రికాలోని ఎన్నో దేశాల్లో దీన్ని ప్రధాన ఆహారంగా తింటారు. మనం ఇక్కడ ప్రతిరోజు అన్నం ఎలా తింటామో... అలా వారు కర్ర పెండలంతోనే ఆహారం చేసుకొని తింటారు. దాన్ని మెత్తని జావలాగా వండుకుంటారు. ఈ కర్రపెండలాన్ని అక్కడ భూముల్లో ఎక్కువగా పెంచుతారు. ఆప్రికాలో కర్రపెండలం అనేది పేదవాడి భోజనం.

మనదేశంలో కర్ర పెండలం అనేక రాష్ట్రాల్లో పెంచుతారు. ఎన్నో చోట్ల సగ్గుబియ్యం తయారీ కేంద్రాలు కూడా ఉన్నాయి. అనేక పరిశ్రమల్లో వీటిని వినియోగిస్తారు. ఐస్ క్రీమ్ కోన్ తయారీదారులు ఈ కర్ర పెండలాన్ని వినియోగిస్తారు. చేపలకు ఆహారంగా వీటిని వాడతారు. రబ్బరు పరిశ్రమల్లో, వస్త్ర పరిశ్రమల్లో, మసాలా పౌడర్, కాస్మోటిక్స్, సబ్బులు, ఫార్మాస్యుటికల్స్, కాగితం తయారీదారులు ఇలా ఎన్నో పరిశ్రమల్లో కర్రపెండలాన్ని వినియోగిస్తారు.

సగ్గుబియ్యం తినడం వల్ల మన శరీరానికి ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్ లభిస్తాయి. అధికరక్తపోటుతో బాధపడేవారు తరచూ సగ్గుబియ్యాన్ని తింటే రక్తపోటు పెరగకుండా ఉంటుంది. మెదడు ఆరోగ్యానికి సగ్గుబియ్యం ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఫోలేట్ ఉంటుంది. ఈ ఫోలేట్ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సగ్గుబియ్యాన్ని కొందరు వండకుండా నములుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు.

Whats_app_banner