Leg swelling in diabetes: షుగర్ వల్ల పాదాల్లో వాపు ఎందుకొస్తుంది? సులభంగా తగ్గించే మార్గాలివే-reasons for leg and foot swelling in diabetes know remedies ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Leg Swelling In Diabetes: షుగర్ వల్ల పాదాల్లో వాపు ఎందుకొస్తుంది? సులభంగా తగ్గించే మార్గాలివే

Leg swelling in diabetes: షుగర్ వల్ల పాదాల్లో వాపు ఎందుకొస్తుంది? సులభంగా తగ్గించే మార్గాలివే

Koutik Pranaya Sree HT Telugu
Sep 27, 2024 12:30 PM IST

Leg swelling in diabetes: డయాబెటిస్ దీర్ఘకాలంగా ఉంటే, ఇది శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ ఎక్కువగా ఉండటం వల్ల పాదాల్లో వాపు వస్తుంది. వీటిలో ఈ చర్యల సహాయంతో ఉపశమనం పొందవచ్చు.

పాదాల వాపు
పాదాల వాపు (shutterstock)

డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. కొంచెం అజాగ్రత్త కూడా అన్ని అవయవాలను పూర్తిగా అనారోగ్యంగా మార్చేస్తుంది. అందుకే రక్తంలో చక్కెర స్థాయిలను నిరంతరం అదుపులో ఉంచాలని వైద్యులు సిఫార్సు చేస్తారు. డయాబెటిస్ తాలూకు ప్రభావం పాదాలపై కనిపించడం, పాదాల్లో వాపు లాంటివి మొదలయితే ఈ సమస్యను తేలిగ్గా తీసుకోకండి. దీర్ఘకాలంలో పాదాల వాపు వల్ల సమస్య పెరిగి నడవడం కూడా కష్టమవుతుంది. పాదాల వాపుకు కారణమేమిటో, పాదాల వాపు సమస్యను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి.

పాదాల్లో వాపు ఎందుకు వస్తుంది?

ఎక్కువ సేపు పాటూ శరీరంలో గ్లూకోజ్ స్థాయులు అలాగే ఎక్కువగా ఉండటం వల్ల పాదాలు, శరీరంలోని ఇతర భాగాల్లో సమస్యలు తలెత్తుతాయి. రక్తంలో అధిక చక్కెర స్థాయుల కారణంగా శరీరంలోని నరాలు దెబ్బతింటాయి. దీనివల్లే కాళ్ళలో నరాలు ప్రభావితం అవుతాయి. దాంతోపాటే పాదాల్లో తిమ్మిరి, నొప్పి వస్తాయి. కొందరిలో ఈ సమస్య తక్కువగా ఉంటే మరికొందరిలో తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. 

శరీరంలో వాపు కొన్నిసార్లు ఎడెమా వల్ల వస్తుంది. ఎడెమా అనేది ఒక రకమైన వాపు కలిగించే వ్యాధి. దీనివల్ల శరీర కణజాలాలలో ద్రవం ఏర్పడటం ప్రారంభమవుతుంది. దాంతో ఉబ్బు, వాపు కనిపిస్తుంది. డయాబెటిస్ వల్ల ఈ సమస్య వస్తే మాత్రం తక్షణ చికిత్స అవసరం.

పాదాల వాపు తగ్గించే మార్గాలు:

కంప్రెషన్ సాక్స్:

ఇవి మార్కెట్లో సులభంగా లభిస్తాయి. ఈ కంప్రెషన్ సాక్సులు నరాలను సున్నితంగా నొక్కి, వాటి కదలికను నియత్రిస్తాయి. దీనివల్ల సిరల్లో రక్త ప్రసరణ పెరుగుతుంది. అయితే కంప్రెషన్ సాక్స్ వేసుకునేటప్పుడు అవి మరీ బిగుతుగా ఉండొద్దని గుర్తుంచుకోండి. లేకపోతే రక్త ప్రసరణ ఆగిపోతుంది. లేదా సరిగ్గా జరగదు. దీంతో మరిన్ని ఇబ్బందులు రావచ్చు. మొదలు తేలికపాటి, లూజ్ కంప్రెషన్ సాక్స్ ధరించండి . వాటితో నరాలకు ఉపశమనం లభిస్తుంది.

కాళ్ల కదలిక:

మీరు రోజంతా కూర్చునే ఉండాల్సి వస్తే ఒకే స్థితిలో పాదాలను ఉంచకండి. కాస్త పైకి ఉంచడం, కదలించడం ద్వారా నీరు చేరదు. ఉబ్బు, వాపు రాదు. అలాగే వాల్ పోజ్ యోగా భంగిమ రోజూ కాసేపు చేయడం వల్ల కూడా ఈ సమస్య తగ్గుతుంది. 

ఉప్పు:

డయాబెటిస్ ఉన్నవాళ్లలో వాపు సమస్య కూడా మొదలైతే ఎక్కువ మోతాదులో ఉప్పు కూడా తీసుకోకూడదు. ఎందుకంటే శరీరంలో ద్రవాల పరిమాణం పెరగడానికి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కూడా కారణమే. కాబట్టి  ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం తగ్గించండి. 

బరువు తగ్గండి:

డయాబెటిస్ ఉన్నవాళ్లలో ఊబకాయం మరింత హాని కలిగిస్తుంది. ఊబకాయం వల్ల కూడా పాదాల వాపు వస్తుంది. డయాబెటిస్ ఉన్నప్పుడు ఎడెమాను తొలగించడానికి బరువు తగ్గడం అవసరం. కాబట్టి రోజూ వ్యాయామం చేయండి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించండి.

మెగ్నీషియం లోపం:

డయాబెటిస్‌లో పాదాల వాపుకు మెగ్నీషియం లోపం కారణం కావచ్చు. ఎందుకంటే మెగ్నీషియం నరాల పనితీరును నియంత్రించడానికి సాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికీ సహాయపడుతుంది. రోజూ మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల పాదాల వాపు సమస్య తగ్గిపోవచ్చు. కాబట్టి వైద్యుల్ని ఒకసారి సంప్రదించి వీటిని తీసుకోవచ్చు.

ఉప్పు నీళ్లలో:

పాదాల వాపు తగ్గడానికి ఒక ఇంటి చిట్కా పనిచేస్తుంది. ఎప్సమ్ లవణం కలిపిన చల్లని నీటిలో పాదాలను సుమారు 10 నుండి 20 నిమిషాల దాకా ఉంచండి. ఇది పాదాల వాపు తగ్గిస్తుంది. మంచి ఉపశమనం ఉంటుంది.

టాపిక్