foxtail millet rice: కొర్రలతో అన్నం వండే విధానమిదే..
foxtail millet rice: కొర్రలతో సులభంగా అన్నం ఎలా వండుకోవాలో , దాంట్లో ఉండే పోషకాలేంటో తెలుసుకోండి.
చిరుధాన్యాలు (millets) రోజూవారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి మేలు. అయితే వాటిని ఎలా వాడాలో తెలియక వాటి జోలికి పోరు. నిజానికి కొన్ని రకాల చిరుధన్యాలను మనం రోజూ తినే అన్నానికి బదులుగా తీసుకోవచ్చు. వాటితో అన్నం వండుకోవచ్చు. ఇప్పుడు కొర్రలతో అన్నం ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
కొర్రలు -ఒక కప్పు
నీళ్లు - రెండున్నర కప్పులు
తయారీ విధానం:
step 1: ఒక కప్పు కొర్రల్ని శుభ్రంగా కడిగి, రెండున్నర కప్పుల నీళ్లలో నానబెట్టుకోవాలి.
step 2: దాదాపు 6 నుంచి 7 గంటలు కొర్రల్ని నానబెట్టుకోవాలి.
step 3: నానిన కొర్రల్ని నీటితో సహా అన్నం వండుకునే గిన్నెలోకి తీసుకోండి. సన్నని సెగమీద కొర్రల్ని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోకుండా ఉడికించండి. నీళ్లు తగ్గాక మూత పెట్టుకోండి. ఒక పదినిమిషాల్లోల పొడిపొడిగా అన్నం సిద్ధమవుతుంది.
అన్నంతో తినే అన్ని రకాల కూరగాయలతో, పచ్చళ్లతో ఈ అన్నాన్ని తినొచ్చు. ఇంతకీ దీని వల్ల ఎన్ని లాభాలో తెలుసుకుందాం.
- కడుపు నొప్పి, ఉదర సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి కొర్రలు తినడం వల్ల మేలు జరుగుతుంది.
- మధుమేహం ఉన్నవాళ్లు కొర్రల్ని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయులు అదుపులోకి వస్తాయి.
- బరువు తగ్గడంలో సాయపడుతుంది.
- వీటిలో ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండటంలో తోడ్పడతాయి. అల్జీమర్స్ వ్యాధి రాకుండా కాపాడతాయి.
- వీటిలో విటమిన్ B1 పుష్కలంగా ఉంటుంది. నాడీవ్యవస్థ పనితీరులో ఇది ఉపయోగపడుతుంది.