Friday Motivation: జీవితంలో సమస్యలు ఎప్పటికీ పోవు, వాటి గురించి మర్చిపోయి ఉన్న ఒక్క జిందగీ ఆస్వాదించండి
Friday Motivation: కొంతమంది జీవితంలో వస్తున్న సమస్యలను తలుచుకొని బాధపడుతూ ఉంటారు. ఆ సమస్యలు తొలగిపోయాక ఆనందంగా ఉండాలని అనుకుంటారు. జీవితంలో సమస్యలు పూర్తిగా పోవడం అనేది ఉండదు, ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి.
Friday Motivation: ఒక ఊరిలో జేమ్స్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఒక గ్రామంలో నివసిస్తూ వ్యాపారం చేసేవాడు. అతనికి ఒక అందమైన భార్య, కొడుకు ఉన్నారు. అతను ఎప్పుడు సంతోషంగా కనిపించేవాడు కాదు. జీవితంలో సమస్యలు వస్తూనే ఉన్నాయంటూ ఆలోచిస్తూ ఆందోళన చెందుతూ ఉండేవాడు. ఒకసారి వారి గ్రామానికి సాధువు వచ్చాడు. ఒకసారి తనతో పాటు కొంతమంది శిష్యులను, 100 ఒంటెలను తీసుకొని వచ్చాడు.
సాధువు దగ్గరికి ప్రజలు తమ సమస్యలు చెప్పడానికి వెళ్లడం ప్రారంభించారు. జేమ్స్‌కు ఆ సాధువు గురించి తెలిసి తాను కూడా వెళ్ళాడు. జేమ్స్ వెళ్లేసరికి వందల మంది జనం కనిపించారు. చాలా సేపు నిరీక్షించాక జేమ్స్‌కు సాధువును కలిసే అవకాశం వచ్చింది. ఆ సాధువుతో ‘స్వామి నా జీవితంలో ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. ఒక్కోసారి వ్యాపారంలోని టెన్షన్లు, ఒక్కోసారి కుటుంబ సమస్యలు, ఇంకోసారి ఆరోగ్య సమస్యలు... ఇలా ఆందోళన చెందుతూనే ఉన్నాను. దయచేసి నా జీవితంలో అన్ని సమస్యలకు ముగింపు పలికే దశ ఎప్పుడు మొదలవుతుందో చెప్పండి. నేను పూర్తి సంతోషంగా ఎప్పుడు ఉంటానో వివరించండి’ అని అడిగాడు.
దానికి సాధువు ఒక నవ్వు నవ్వి ‘ఈరోజు చాలా ఆలస్యమైంది. రేపు ఉదయం నీకు పరిష్కారాన్ని చెబుతాను. నాకోసం ఒక చిన్న పని చేస్తావా’ అని అడిగాడు. దానికి జేమ్స్ తప్పకుండా చేస్తానని చెప్పాడు. సాధువు తన దగ్గర ఒంటెలను చూసే వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడని, ఆ ఒక్కరోజు రాత్రి వాటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. అలాగే ఒంటెలన్నీ కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మాత్రమే నిద్రపోవాలని చెప్పాడు. జేమ్స్ సరేనని ఆ ఒంటెల కాపలాకు వెళ్ళాడు.
మరుసటి రోజు ఉదయం జేమ్స్ మళ్లీ సాధువును కలిసాడు. సాధువు ‘నిన్న రాత్రి నీకు బాగా నిద్ర పట్టిందని అనుకుంటున్నాను’ అని అన్నాడు. దానికి జేమ్స్ ‘లేదు స్వామి, ఒక్క క్షణం కూడా నిద్రలేకపోయాను. ఎంత ప్రయత్నించినా ఒంటెలన్నింటినీ ఒకేసారి కూర్చోబెట్టలేకపోయాను. దీనివల్ల రాత్రంతా నిద్ర లేకుండా గడిపాను’ అని చెప్పాడు.
దానికి సాధువు చిన్నగా నవ్వి ‘అలా ఉంటుందని నాకు తెలుసు. ఇంతవరకు ఈ ఒంటెలన్నీ ఒకేసారి కూర్చోవడం ఎప్పుడూ జరగలేదు’ అని అన్నాడు. దానికి జేమ్స్‘ మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు అలా చేయమన్నారు’ అని ప్రశ్నించాడు.
వెంటనే సాధువు ‘నిన్న రాత్రి నువ్వు ఎంత ప్రయత్నించినా ఒంటెలన్నీ కలిసి కూర్చోలేదు. ఒకవైపు ఒంటెలు కూర్చుంటే మరోవైపు ఒంటెలు నిలుచునేవి. సమస్యలు కూడా అంతే. ఒక సమస్యను పరిష్కరిస్తే, మరో సమస్య జీవితంలో ఎదురవుతూ ఉంటుంది. మనం జీవించి ఉన్నంతకాలం సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఆ సమస్యలు చిన్నగా ఉంటే... మరి కొన్నిసార్లు పెద్దవిగా ఉంటాయి. ఈ సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు జీవితాన్ని ఆస్వాదించలేరు. కాబట్టి ఎదురొచ్చే సమస్యల గురించి ఆలోచించకుండా జీవితాన్ని సంతోషంగా గడపడం నేర్చుకో’ అని అన్నాడు.
సమస్యలు కూడా ఒంటెల్లాంటివే. కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. కొన్ని ఒంటెలు చెప్పగానే కూర్చుంటాయి. మరికొన్ని ఒంటెలు మొండిగా నిలుచునే ఉంటాయి. సమస్యలు కూడా అంతే... ఎంత ప్రయత్నించినా కొన్ని పరిష్కారం కావు. కొన్ని మాత్రం కాలం గడుస్తున్న కొద్ది తీరిపోతాయి. కాబట్టి సమస్యల గురించి ఆలోచించకుండా జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో ఆలోచించండి.