Pesara Kattu: అమ్మమ్మల కాలంనాటి పెసర కట్టు రెసిపీ, ఉలవచారులాగే అదిరిపోతుంది, రెసిపీ చాలా సులువు
Pesara Kattu: ఉలవచారులాగే పెసర కట్టును చాలా టేస్టీగా వండుకోవచ్చు. ఉలవకట్టు, పెసర కట్టు రెండూ పూర్వకాలం నాటివే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీని రెసిపీ చాలా సులువు.
Pesara Kattu: ఎప్పుడూ టమోటో రసం, చింతపండు రసం తినే కన్నా కొన్నిసార్లు పెసర కట్టును కూడా ప్రయత్నించండి. ఉలవచారులాగే ఈ పెసర చారు చాలా రుచిగా ఉంటుంది. దీన్ని పెసర కట్టు అని కూడా పిలుస్తారు. దక్షిణ భారత దేశంలో ఒకప్పుడు కచ్చితంగా తినే ఆహారాల్లో పెసరట్టు కూడా ఒకటి. ప్రతి ఇంట్లోనూ అప్పట్లో ఉలవ కట్టు, పెసర కట్టు అని పిలిచే రసం రకాలు ఉండేవి. ఇక్కడ మేము పెసర కట్టు రెసిపీ ఇచ్చాము. దీని టేస్ట్ అదిరిపోతుంది. ఆరోగ్యానికి కూడా ఎంత మేలు చేస్తుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. రెసిపీ అలాగే తెలుసుకోండి.
పెసర కట్టు రెసిపీకి కావలసిన పదార్థాలు
పెసరపప్పు - అర కప్పు
ఉల్లిపాయలు - రెండు
పసుపు - అర స్పూను
నిమ్మరసం - రెండు స్పూన్లు
నీళ్లు - సరిపడినన్ని
పచ్చిమిర్చి - ఆరు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
ఇంగువ - చిటికెడు
కరివేపాకులు - గుప్పెడు
ఆవాలు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూన్
ఎండుమిర్చి - రెండు
నెయ్యి లేదా నూనె - రెండు స్పూన్లు
పెసర కట్టు రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి పెసరపప్పును చిన్న మంట మీద వేయించాలి.
2. అది మంచి వాసన వస్తున్నప్పుడు రెండు కప్పుల నీళ్లు వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నీళ్లు పోయాలి.
4. ఆ నీటిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి.
5. మూత పెడితే అది త్వరగా ఉడుకుతుంది.
6. ఉల్లిపాయలు మెత్తగా ఉడికాక ముందుగా ఉడికించుకున్న పెసరపప్పును ఆ మిశ్రమంలో పోయాలి.
7. ఈ పులుసుని ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి.
8. మరుగుతున్న పులుసులో నిమ్మరసం కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి.
9. ఇప్పుడు మరొక చిన్న కళాయిని స్టవ్ మీద పెట్టి నూనె లేదా నెయ్యిని వేయాలి.
10. అందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు వేసి వేయించాలి.
11. ఈ తాళింపుని పెసరపప్పులో వేయాలి.
12. కొత్తిమీరను పైన చల్లుకోవాలి. అంతే టేస్టీ పెసరట్టు రెడీ అయినట్టే.
13. సాంబార్‌కు బదులు అప్పుడప్పుడు పెసర కట్టును తిని చూడండి, ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
పెసరపప్పు మన ఆరోగ్యానికి మేలు చేసే పప్పులో ఒకటి. దీన్ని తినడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతిరోజు పెసర మొలకలను తినమని పోషకాహార నిపుణులు కూడా చెబుతారు. ఇది శరీర కండరాలకు శక్తిని ఇస్తుంది. పెసరపప్పును తరుచూ తినడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. దీంతో బరువు కూడా సులువుగా తగ్గవచ్చు. పెసరపప్పులో పొటాషియం, ఐరన్, ప్రోటీన్, నియాసిన్ ఫోలేట్, విటమిన్ b6 వంటి పోషకాలు ఉంటాయి.