Pesarapappu uthappam: పెసరపప్పు వెజిటేబుల్ ఊతప్పం.. సులువుగా చేసేయండిలా..-how to make pesarapappu or moongdal uthappam for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pesarapappu Uthappam: పెసరపప్పు వెజిటేబుల్ ఊతప్పం.. సులువుగా చేసేయండిలా..

Pesarapappu uthappam: పెసరపప్పు వెజిటేబుల్ ఊతప్పం.. సులువుగా చేసేయండిలా..

Pesarapappu uthappam:పెసరపప్పు, బోలెడు కూరగాయలు వాడి చేసే ఊతప్పం రుచి చాలా బాగుంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి.

పెసరపప్పు వెజిటేబుల్ ఊతప్పం

ఊతప్పం మామూలుగా రవ్వతోనే చేసుకుంటాం. కానీ పెసరపప్పుతో చేసుకుంటే రుచి మరింత బాగుంటుంది. మీకిష్టమైన కూరగాయలు కలిపి చేసుకునే ఈ పెసరపప్పు వెజిటేబుల్ ఊతప్పం తయారీ కూడా సులువే. దానికి కావాల్సిన పదార్థాలేంటో చూసేయండి.

పెసరపప్పు వెజిటేబుల్ ఊతప్పం తయారీకి కావాల్సిన పదార్థాలు:

3 కప్పుల పెసరపప్పు

1 కరివేపాకు రెమ్మ

1 చెంచా జీలకర్ర

అంగుళం అల్లం ముక్క

4 పచ్చిమిర్చి

3 చెంచాల బియ్యం పిండి

3 చెంచాల సన్నం రవ్వ

సగం టీస్పూన్ బేకింగ్ సోడా

తగినంత ఉప్పు

1 చెంచా మిరియాలు

3 చెంచాల పెరుగు

సగం టీస్పూన్ పంచదార

టాపింగ్ కోసం:

1 టమాటా, సన్నటి ముక్కలు

1 ఉల్లిపాయ, సన్నటి ముక్కలు

1 క్యాప్సికం, సన్నటి ముక్కలు

సగం టీస్పూన్ కారం

నూనె

పెసరపప్పు వెజిటేబుల్ ఊతప్పం తయారీ విధానం:

  1. పెసరపప్పును ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి. రాత్రంతా లేదా కనీసం ఆరేడు గంటల పాటూ పెసరపప్పును నానబెట్టుకోవాలి.
  2. ఉదయాన్నే నీటిని వంపేసి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. కాస్త బరకగా మిక్సీ పట్టిన తర్వాత అందులో ఒక్కోటి వేసుకోవాలి.
  3. సన్నగా తరిగిన కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, మిరియాలు,జీలకర్ర, పెరుగు వేసుకుని మరోసారి అన్నీ కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి.
  4. దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని అందులో బియ్యం పిండి, సన్నం రవ్వ, ఉప్పు, కొద్దిగా పంచదార వేసుకుని కలుపుకోవాలి.
  5. చివరగా బేకింగ్ సోడా కూడా వేసుకుని బాగా కలియబెట్టి అరగంట పాటూ పిండిని పక్కన పెట్టుకోవాలి.
  6. స్టవ్ మీద పెనం పెట్టుకుని నూనె రాసుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్దం చేసుకున్న పిండిని గరిటె నిండా తీసుకుని వేసుకోవాలి. కాస్త మందంగానే ఉండేలా చెంచాతో తిప్పాలి.
  7. చివరగా మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి. మీద కాస్త కారం పొడి చల్లుకోవాలి. అంచుల వెంబడి నూనె వేసుకోవాలి. అర నిమిషం పాటూ మూత పెట్టి మగ్గనివ్వాలి.
  8. కాస్త కాల్చుకున్న తర్వాత మరోవైపు కూడా వేసుకుని కాల్చుకుంటే సరిపోతుంది. పెసరపప్పు వెజిటేబుల్ ఊతప్పం రెడీ అయినట్లే. దీన్ని చట్నీ, సాంబార్‌తో సర్వ్ చేసుకుంటే సరి.