Palak Khichdi Recipe: రుచితో పాటు ఎంతో ఆరోగ్యకరమైన ‘పాలకూర కిచిడీ’.. పిల్లలకు కూడా నచ్చేస్తుంది!-palak khichdi recipe make this spinach dish with tasty and healthy this way ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Palak Khichdi Recipe: రుచితో పాటు ఎంతో ఆరోగ్యకరమైన ‘పాలకూర కిచిడీ’.. పిల్లలకు కూడా నచ్చేస్తుంది!

Palak Khichdi Recipe: రుచితో పాటు ఎంతో ఆరోగ్యకరమైన ‘పాలకూర కిచిడీ’.. పిల్లలకు కూడా నచ్చేస్తుంది!

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 14, 2024 03:30 PM IST

Palak Khichdi Recipe: పాలకూర కిచిడీ రుచికరంగా ఉండడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది తయారు చేసుకోవడం కూడా సులభమే. త్వరగా రెడీ అవుతుంది.

Palak Khichdi Recipe: రుచితో పాటు ఎంతో ఆరోగ్యకరమైన ‘పాలకూర కిచిడీ’.. పిల్లలకు కూడా నచ్చేస్తుంది!
Palak Khichdi Recipe: రుచితో పాటు ఎంతో ఆరోగ్యకరమైన ‘పాలకూర కిచిడీ’.. పిల్లలకు కూడా నచ్చేస్తుంది!

పాలకూరలో కీలకమైన విటమిన్లు, మినరల్స్ సహా పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి నుంచి కళ్ల వరకు ఆరోగ్యానికి చాలా రకాలుగా పాలకూర మేలు చేస్తుంది. అలాంటి పాలకూరతో చేసే కిచిడీ రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పాలకూర కిచిడీ మెత్తగా ఉండటంతో పిల్లలు కూడా తినేందుకు ఇష్టపడతారు. వారికి పోషకాహారాం అందించినట్టు అవుతుంది. పాలకూర కిచిడీ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

పాలకూర కిచిడీకి కావాల్సిన పదార్థాలు

  • ఓ కప్పు బియ్యం (అరగంట నానపెట్టాలి)
  • అర కప్పు పెసర పప్పు (అరగంట నానపెట్టాలి)
  • మూడు మీడియం సైజు పాలకూర కట్టల ఆకులు (మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి)
  • రెండు టేబుల్ స్పూన్‍ల నెయ్యి
  • ఓ టీ స్పూన్ పసుపు
  • ఓ టేబుల్ స్పూన్ నూనె
  • మూడు వెల్లిల్లు రెబ్బల సన్నని తరుగు
  • రెండు ఎండుమిర్చి
  1. మూడు పచ్చిమిర్చి (సన్నగా తరగాలి)
  • ఓ టీస్పూన్ జీలకర్ర
  • టేబుల్ స్పూన్ ఉల్లిపాయ తరుగు
  • ఓ రెబ్బ కరివేపాకు
  • తగినంత ఉప్పు
  • మూడు కప్పుల నీరు

 

పాలకూర కిచిడీ తయారీ విధానం

  • బియ్యం, పెసర పప్పును వేర్వేరుగా అరగంట పాటు కచ్చితంగా నానబెట్టుకోవాలి. పాలకూర ఆకులను కడిగి.. మిక్సీలో మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి.
  • ముందుగా ప్రెజర్ కుక్కర్‌లో బియ్యం, పెసర పప్పు వేయాలి. అందులో రెండున్నర కప్పుల నీరు పోయాలి. అందులోనే పసుపు వేయాలి. రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
  • స్టవ్‍పై మరో ప్యాన్ పెట్టి అందులో నెయ్యి, నూనె వేసుకోవాలి. అవి వేడెక్కాక ఎండుమిర్చి, సన్నగా తరిగిన వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు వేయాలి.
  • వెల్లుల్లి గోల్డెన్ కలర్‌లోకి వచ్చాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు మెత్తబడ్డాక కరివేపాకు వేయాలి.
  • ఆ తర్వాత అందులో పాలకూర ఆకుల పేస్ట్ వేసి, పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
  • ఆ తర్వాత ఆ పాలకూర మిశ్రమంలో.. ఉడికించుకున్న అన్నం, పెసపప్పు ముద్దను వేసి బాగా కలుపుకోవాలి.
  • అందులో అరకప్పు వేడినీరు పోసి కలపాలి. మీడియం ఫ్లేమ్‍ మీద కాసేపు ఉడికించుకోవాలి. చివర్లో పైన ఓ టీస్పూన్ నెయ్యి వేయాలి. ఆ తర్వాత ప్యాన్ దించేయాలి. అంతే పాలకూర కిచిడీ రెడీ అవుతుంది.

 

పాలకూరలో పోషకాలు ఇలా..

పాలకూరలో విటమిన్ ఏ, బీ, సీ, కే, ఐరన్, కాల్షియం, ఫైబర్, మెగ్నిషియం, ఫోలెట్ సహా మరిన్ని పోషకాలు మెండుగా ఉంటాయి. అందుకే పాలకూరను రెగ్యులర్‌గా తింటే రోగ నిరోధక శక్తి, ఎముకల దృఢత్వం, కళ్లు, గుండె ఆరోగ్యం మెరుగవుతాయి. జీర్ణం కూడా బాగా అవుతుంది. అందుకే పాలకూర కిచిడీ రుచితో పాటు ఆరోగ్యాన్ని ఎక్కువగా అందిస్తుంది. పాలకూర తినేందుకు మారాం చేసే పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తినే అవకాశం ఉంటుంది. మెత్తగా నోట్లో వేసుకుంటే జారిపోయేలా ఉండటంతో వారికి నచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. లంచ్ బాక్సుకు కూడా పెట్టవచ్చు. చల్లారినా ఈ కిచిడీ టేస్ట్ బాగానే ఉంటుంది. అలాగే, ఈ వంటకం తయారీ కూడా సులభమే.

Whats_app_banner

సంబంధిత కథనం