ఇంట్లో చికాకులు, గొడవలు ఎక్కువ అవుతున్నాయా.. ఈ నాలుగు పనులు చేసి చూడండి!
ఇంట్లో గొడవలు, చికాకులు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ కొన్ని సార్లు వీటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వాస్తు శాస్త్రం మీకు సహాయపడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలను చేయడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషాలను పెంపొందించవచ్చు.
ఇంట్లో జరుగుతున్న గొడవలకు, చికాకులకు అన్ని సార్లు ఇంట్లోని సభ్యులే కారణం అవకపోవచ్చు. కొన్ని సార్లు ఇంట్లో పెరుగుతున్న ప్రతికూల శక్తులు, వాస్తు లోపాలు కూడా కారణం అయి ఉండచ్చు. ఏదేమైనా చిన్న చిన్న గొడవలు, సర్దుబాట్లు అనేవి అందరి ఇళ్లల్లో ఉండేవే. కానీ కొన్ని సమయాల్లో ఇవి పరిధి దాటి ఇబ్బంది పెడుతుంటాయి. మొత్తం ఇంటి వాతావరణాన్నే మార్చేస్తాయి. ఆఫీసులకు, పనుల మీద బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంట్లో అడుగుపెట్టాలంటే భయపడాల్సిన సందర్భాలను కూడా తీసుకొస్తాయి. మీ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటే.. తరచూ చిన్న చిన్న విషయాలకే గొడవలు, చికాకులు జరుగుతుంటే వాస్తు శాస్త్రం మీకు సహాయపడుతుంది. దీని ప్రకారం కొన్ని పరిహారాలను చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గి శాంతి, పంతోషంతో కూడిన వాతావరణం వృద్ధి చెందుతుంది. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని తగ్గించి పాజిటివ్ ఎనర్జీని పెంచే కొన్ని ఆ పనులేంటో తెలుసుకుందాం..
శాంతి, సంతోషాల కోసం చేయాల్సిన పనులు ఏంటి..?
- ఈశాన్య మూల వాస్తు శాస్త్రం ప్రకారం, ఈశాన్య దిశను ఈశాన్య కోణం అంటారు. ఇంట్లోని చికాకులకు గొడవలకు ఈశాన్య మూలలో అపరిశుభ్రత కారణమవుతుంది. ఈశాన్య మూలను ఎల్లప్పుడూ శుభ్రంగా, ప్రకాశవంతంగా ఉంచాలి. ఇంటి ఈశాన్య మూల పరిశుభ్రంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం ఉండి ఇంట్లో ప్రశాంతత, సంతోషం నెలకొంటాయి. తరచూ ఈశాన్య మూలను శుభ్రం చేస్తూ ఉండండి.
- సూర్యుడికి ఆర్ఘ్యం: ప్రతిరోజూ సూర్యుడికి నీరు(ఆర్ఘ్యం) సమర్పించడం వల్ల జాతకంలో సూర్య గ్రహానికి బలం చేకూరుతుంది. సూర్య గ్రహం గౌరవం, ప్రతిష్టతో ముడిపడి ఉంది. ధార్మిక పరంగా, సూర్యుని పవిత్ర అంశం మీ వృత్తిలో విజయాన్ని సాధించడానికి మీకు సహాయపడుతుంది. శాంతినీ, శక్తినీ అందిస్తుంది. ఇంట్లో చికాకులను, సమస్యలను కూడా తొలగించేందుకు సహాయపడుతుంది.
- దీపం వెలిగించండి: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దీపం వెలిగించం అత్యంత శుభప్రదం. తద్వారా ఇంట్లోకి సానుకూల శక్తుల ప్రవాహం పెరుగుతుంది. శాంతి, ఐశ్యర్యం , సంతోషం వృద్ధి చెందుతాయి. ఇంట్లో పూజ సక్రమంగా చేస్తే ఇంట్లో సుఖశాంతులు నిండుతాయి.
- ఉప్పు: లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లు ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ కూడా మీ జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఇంటిని తుడిచే నీటిలో ఉప్పు కలిపి తుడుచుకోవడం వల్ల ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. దృష్టి వంటివి దూరమవుతాయి. దీంతో పాటుగా ఇంట్లో ధూపం, సామ్రానీ పొగ వేయడం, ఇంట్లోకి సూర్యకిరణాలు పడేలా చేయడం, పచ్చటి మొక్కలను పెంచడం అవసరం. ముఖ్యంగా ఇంట్లో కిటికీలు తలుపులు ఎప్పుడూ మూసి ఉంచకుండా గాలి సరఫరా అయ్యేలాగా కొన్ని గంటలపాటైనా వాటిని తెరిచి ఉంచుకోవాలి. ఇది ఆక్సిజన్ సరఫరాలను పెంచి ఇంట్లోని వ్యక్తులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్