TSPSC Group 2 Exams : గ్రూప్-2 పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు, ఈసారి వేగవంతంగా ఫలితాలు- టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం
TSPSC Group 2 Exams : తెలంగాణ గ్రూప్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అభ్యర్థులు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా, మెరిట్ ను నమ్ముకుని పరీక్షలు రాయాలని సూచించారు.
TSPSC Group 2 Exams : తెలంగాణ గ్రూప్-2 పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటించారు. గత 10 రోజులుగా పరీక్షల నిర్వహణ ప్రతి అంశాన్ని సమీక్షిస్తున్నామన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై నమ్మకముంచి పరీక్షలు రాయాలని కోరారు. అభ్యర్థులు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని సూచించారు.
2022లో నోటిఫికేషన్ విడుదల, సుప్రీంకోర్టు, హైకోర్టు కేసుల్లో గెలిచి పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నామని బుర్రా వెంకటేశం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్షలు రాయాలని సూచించారు.
ఈసారి వేగంగా ఫలితాలు
రాష్ట్ర వ్యాప్తంగా 5.51 లక్షల మందికి పైగా అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షలు రాయనున్నారని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రశ్నా పత్రాలకు సంబంధించి 58 స్టోరేజ్ పాయింట్లు పెట్టామన్నారు. 2015లో గ్రూప్ 2 నోటిఫికేషన్ అమలుకు చాలా సమయం పట్టిందని, కానీ ఈసారి చాలా వేగంగా ఫలితాలు ఇస్తామని బుర్రా వెంకటేశం తెలిపారు.
"గ్రూప్-2 పరీక్షలను పూర్తిస్థాయి సన్నద్ధతతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. అభ్యర్థులు తమ మెరిట్ ను నమ్ముకుని పరీక్షలు రాయండి. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాము. ఇవాళ్టి నుంచే సీసీ కెమెరాలు వర్కింగ్ లో ఉన్నాయి. పరీక్ష పేపర్ ఓపెన్ దగ్గర నుంచి ప్రతి విషయాన్ని మోనిటర్ చేస్తాము. పరీక్ష పేపర్ లో ఏముందనేది అభ్యర్థికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు"-బుర్రా వెంకటేశం
783 పోస్టులకు 5.51 లక్షల మంది దరఖాస్తులు
"65 వేల మంది సిబ్బంది పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థుల పరీక్షలు రాసేందుకు ఉంటారు. పోలీసులు, ఇతర సిబ్బందితో కలిసి మొత్తం 75 వేల మంది సిబ్బంది గ్రూప్-2 విధుల్లో ఉంటారు. 783 పోస్టులకు 5,51,847 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకూ 70-80 శాతం హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. 4 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని భావిస్తున్నాం. ఎవరి ఓఎమ్ఆర్ షీట్ లో వాళ్లే పరీక్ష రాయాలి. బయోమెట్రిక్ వేయకుండా పరీక్ష రాసేందుకు వీలుండదు.
యూపీఎస్సీ తరహాలో పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ నెల 18, 19 తేదీల్లో పబ్లిక్ కమిషన్ సభ్యులు దిల్లీకి వెళ్తున్నాము. ఈ రెండు రోజులు యూపీఎస్సీ, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ...సభ్యులతో చర్చించి కాంపిటేటివ్ పరీక్షల నిర్వహణపై సమగ్ర నివేదిక రూపొందిస్తాం. జనవరి నెలాఖరుకు ప్రభుత్వానికి యాక్షన్ ప్లాన్ ఇస్తాం"- టీజీపీఎస్సీ ఛైర్మన్, బుర్రా వెంకటేశం
సంబంధిత కథనం