Miss You Collections: మిస్ యూ కలెక్షన్స్ - రీ రిలీజ్ సినిమాల కంటే సిద్ధార్థ్ కొత్త మూవీ వసూళ్లు తక్కువ!
Miss You Collections: సిద్ధార్థ్ మిస్ యూ మూవీ తెలుగు వెర్షన్ తొలిరోజు పదిహేను లక్షల లోపు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. శుక్రవారం రోజు అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఈ లవ్ డ్రామా మూవీని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది.
Miss You Collections: సిద్ధార్థ్ మిస్ యూ మూవీ శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. కోలీవుడ్‌లో ఈ లవ్ డ్రామా మూవీపై మోస్తారు బజ్ ఏర్పడగా టాలీవుడ్‌లో మాత్రం జీరో హైప్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు సిద్ధార్థ్ మూవీ రిలీజ్ రోజే అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఈ సినిమాను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.
తెలుగులో మిస్ యూను సరిగ్గా ప్రమోట్ చేయలేకపోవడం కూడా సినిమాకు మైనస్‌గా మారింది. తొలిరోజు మిస్ యూ మూవీ తెలుగు వెర్షన్ పదిహేను లక్షల లోపే కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ చెబుతోన్నారు. శుక్రవారం రోజు సిద్ధార్థ్ మిస్ యూ మూవీ థియేటర్లు చాలా వరకు ఖాళీగా దర్శనమిచ్చాయి.శనివారం రోజు కలెక్షన్స్ మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో కలిసి ఈ మూవీ కోటి వరకు గ్రాస్, 45 లక్షల వరకు షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు చెబుతోన్నారు.
బొమ్మరిల్లు...
ఇటీవల రీ రిలీజైన సిద్ధార్థ్ మూవీస్ బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దాంటానాలో సగం కూడా మిస్ యూ మూవీ కలెక్షన్స్ రాబట్టలేకపోవడం ఆసక్తికరంగా మారింది. సిద్ధార్థ్ సినిమాలు ఒకప్పుడు తెలుగులో ఫస్ట్ డే కోట్లలో కలెక్షన్స్ రాబట్టాయి. బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. కానీ వరుస పరాజయాల కారణంగా సిద్ధార్థ్ క్రేజ్ తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు అతడి సినిమాల కలెక్షన్స్ కోట్ల నుంచి లక్షల్లోకి పడిపోయాయి.
లవ్ రొమాన్స్ అంశాలతో...
మిస్ యూ మూవీకి రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. లవ్, రొమాన్స్ అంశాలకు మిస్టరీని జోడించి ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. వాసు (సిద్ధార్థ్) సినిమా డైరెక్టర్ కావాలని కలలు కంటాడు. కానీ ఓ యాక్సిడెంట్ కారణంగా గత మర్చిపోవడంతో అతడి జీవితం మొత్తం తలక్రిందులవుతుంది.
దాంతో కేఫ్‌లో ఉద్యోగంలో చేరుతాడు. అక్కడే సుబ్బలక్ష్మిని (ఆషికా రంగనాథ్) చూసి ఇష్టపడతాడు. ఆమెను పెళ్లిచేసుకోవాలని అనుకుంటాడు. సుబ్బలక్ష్మి తల్లిదండ్రలు మాత్రం వాసు ప్రపోజల్‌ను రిజెక్ట్ చేస్తారు? అందుకు కారణమేమిటి? సుబ్బలక్ష్మితో వాసుకు ఉన్న గతం ఏమిటి అన్నదే ఈ మూవీ కథ. మిస్ యూ మూవీకి జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.
ఇండియన్ 2లో...
ఈ ఏడాది శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ 2లో కమల్‌హాసన్‌తో పాటు మరో హీరోగా సిద్ధార్థ్ నటించాడు. అతడి రోల్‌పై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ ఏడాదే హీరోయిన్ అదితీరావ్ హైదరీతో ఏడడుగులు వేశాడు సిద్ధార్థ్. మహా సముద్రం టైమ్‌లో సిద్ధార్థ్, అదితి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కారు.