Paakam Purilu: స్వీట్ తినాలనిపిస్తోందా? పాకం పూరీలు ఇలా పది నిమిషాల్లో చేయండి, రెండు వారాలు నిల్వ ఉంటాయి-paakam purilu recipe in telugu know how to make this sweet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Paakam Purilu: స్వీట్ తినాలనిపిస్తోందా? పాకం పూరీలు ఇలా పది నిమిషాల్లో చేయండి, రెండు వారాలు నిల్వ ఉంటాయి

Paakam Purilu: స్వీట్ తినాలనిపిస్తోందా? పాకం పూరీలు ఇలా పది నిమిషాల్లో చేయండి, రెండు వారాలు నిల్వ ఉంటాయి

Haritha Chappa HT Telugu
Aug 13, 2024 05:30 PM IST

Paakam Purilu: పది నిమిషాల్లో తయారయ్యే పాకం పూరీల రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఇది ఒక్కసారి చేసుకుంటే రెండు వారాలు పాటు నిల్వ ఉంటాయి. వీటి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

పాకం పూరీలు రెసిపీ
పాకం పూరీలు రెసిపీ

Paakam Purilu: పాకం పూరీలు ఈనాటివి కాదు, పూర్వకాలం నుంచి ఆంధ్రా ఇళ్లల్లో తింటున్నవే. కానీ ఇప్పుడు ఆధునిక యువత ఈ పాకంపూరీల సంగతే మర్చిపోయింది. మీకు హఠాత్తుగా స్వీట్ తినాలనిపిస్తే కేవలం 10 నిమిషాల్లో చేసుకుని ఈ పాకం పూరీలను ప్రయత్నించండి. ఇవి రెండు వారాలు పాటు నిల్వ ఉంటాయి. అయితే దీనిలో మైదాకు బదులుగా గోధుమ పిండిని వాడితే మంచిది. మైదా వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. పూరీలను వండి తర్వాత ఆ పూరీలకు పాకం పడతాము. కాబట్టే వీటికి పాకం పూరీలు అని పేరు వచ్చింది. ఈ పాకాన్ని కూడా బెల్లంతో వండితే ఎంతో మంచిది. కానీ ఎక్కువమంది పంచదారతో చేసేందుకే ఇష్టపడతారు. మీ ఇష్ట ప్రకారం మీరు పంచదారతో చేయాలా లేక బెల్లంతో చేయాలో నిర్ణయించుకోవచ్చు.

పాకం పూరీల రెసిపీకి కావలసిన పదార్థాలు

గోధుమపిండి - పావుకిలో

నెయ్యి - మూడు స్పూన్లు

ఉప్పు - చిటికెడు

నీళ్లు - సరిపడినన్ని

యాలకుల పొడి - ఒక స్పూను

పంచదార - అరకిలో

పాకం పూరీలు రెసిపీ

1. ఒక గిన్నెలో గోధుమ పిండిని వేసి చిటికెడు ఉప్పును వేసి నెయ్యి కూడా వేసి బాగా కలపాలి.

2. ఇప్పుడు గోరువెచ్చటి నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి.

3. దీన్ని చపాతి పిండిలాగా లేదా పూరి పిండిలాగా ఒత్తుకోవాలి.

4. ఒక అరగంట పాటు తడిగుడ్డ కప్పి పక్కన పెట్టాలి.

5. మరో పక్కన స్టవ్ మీద గిన్నె పెట్టి పంచదార, నీళ్లు పోసి పాకం కోసం మరిగిస్తూ ఉండాలి.

6. అందులోనే యాలకుల పొడిని కూడా వేయాలి.

7. తీగ పాకం వచ్చేదాకా మరిగించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ పాకాన్ని అలా ఉంచాలి.

8. ఇప్పుడు గోధుమ పిండిని చిన్నచిన్న సైజులో బాల్స్ గా తయారు చేసుకోవాలి.

9. ఆ బాల్స్‌ను చిన్న చిన్న పూరీల్లా వత్తుకొని మధ్యలో మడతలు వేసి మళ్లీ పూరీల్లా ఒత్తుకుంటూ ఉండాలి.

10. ఇలా మడతలు వేయడం వల్ల పూరి పొంగే అవకాశం ఉంటుంది. అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి.

11. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి, ఆ నూనె వేడెక్కాక ఒత్తుకున్న పూరీలను అందులో వేసి రెండు వైపులా వేయించుకోవాలి. ఇవి చాలా త్వరగా వేగిపోతాయి.

12. ఆ వేయించుకున్న పూరీలను ముందుగా తయారుచేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేసి ఉంచాలి.

13. పంచదార పాకం ఎండిపోయాక వీటిని గిన్నెలో వేసి నిల్వ చేసుకోవాలి.

14. ఇవి వారం నుంచి రెండు వారాల వరకు తాజాగా ఉంటాయి.

15. ఒక్కసారి చేసుకుని చూడండి. మీ ఇంటిల్లిపాదికి నచ్చడం ఖాయం.

16. పంచదార ఇష్టం లేనివారు బెల్లంతో చేసుకోవచ్చు.

17. కాకపోతే పంచదారతో చేసినంత రుచి బెల్లంతో ఉండకపోవచ్చు, పైగా రంగు కూడా మారుతాయి.

పిల్లలు ఏదైనా స్వీట్ తినడానికి అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసే పాకం పూరీలను చేసేయొచ్చు. పాకం, చపాతీ ముద్ద రెడీగా ఉంటే కేవలం 10 నిమిషాల్లో ఈ స్వీట్ రెడీ అయిపోతుంది. దీన్ని ఒక్కసారి మీరు చేసి చూడండి, మీ అందరికీ నచ్చడం ఖాయం.