ORS: ఓఆర్ఎస్ ఎప్పుడు, ఎలా తీసుకోవాలి? ఎవరు దీనికి దూరంగా ఉండాలి?
ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ లేదా ఓఆర్ఎస్ సొల్యూషన్ గురించి మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది . దీన్ని ఎప్పుడు? ఎలా తీసుకోవాలి? ఎలా తయారు చేయాలి? ఎవరు తీసుకోకూడదు వంటి మరిన్ని విషయాలు తెలుసుకోండి.
శరీరంలో తగినంత ద్రవాలు లేనిపక్షంలో తరచుగా డీహైడ్రేషన్‌కు గురికావాల్సి వస్తుంది. అయితే తేలికపాటి డీహైడ్రేషన్‌ను ఓరల్ రీహైడ్రేషన్ లవణాల (ఓఆర్ఎస్)తో కూడిన ద్రావణం అని పిలిచే ఎలక్ట్రోలైట్ ద్రావణాన్ని తీసుకోవడం ద్వారా సులభంగా చికిత్స చేయవచ్చు. ఓరల్ రీహైడ్రేషన్ అంటే మనం ఓఆర్ఎస్ నోటి ద్వారా తీసుకుంటే, ఈ అద్భుత పానీయం శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.
మరి ఓఆర్ఎస్ (ORS) ఎప్పుడు తీసుకోవాలి?
హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్, ఫిట్‌నెస్ కోచ్ నూపుర్ పాటిల్ సంబంధిత అంశాలను చర్చించారు. ‘ఈ సొల్యూషన్ కోల్పోయిన ద్రవాలు, ఎలక్ట్రోలైట్‌లను భర్తీ చేయాలనుకునే వారి కోసం మెరుగ్గా ఉపయోగపడుతుంది. విరేచనాలు, వాంతులు, తీవ్రమైన వ్యాయామాలు, జ్వరం, ఉబ్బరంగా ఉన్న వాతావరణం ఉన్నప్పుడు ఎలక్ట్రోలైట్స్, ద్రవాల గణనీయమైన నష్టం సంభవించవచ్చు. అటువంటి సందర్భాలలో ఓఆర్ఎస్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. దీనిని చక్కెర, లవణాలు, ప్రత్యేకంగా సోడియం, పొటాషియంతో కూడిన నీటిని తాగడం అని చెప్పొచ్చు..’ అని చెప్పారు.
‘ఓఆర్ఎస్ మోతాదు ఒకరి ఆరోగ్య పరిస్థితి, చికిత్సకు ప్రతిస్పందించే తీరుపై ఆధారపడి ఉంటుంది. ఈ ఉత్పత్తిని తీసుకునేటప్పుడు పండ్ల రసాలను త్రాగకూడదు. అలాగే డాక్టర్ నిర్దేశించని పక్షంలో ఉప్పు కలిపిన ఆహారాన్ని తినకూడదు. తేలికపాటి నుండి మితమైన డీహైడ్రేషన్‌కు నోటి రీహైడ్రేషన్ ప్రభావవంతమైన ప్రాథమిక చికిత్స. అయితే తీవ్రమైన డీహైడ్రేషన్‌కు తక్షణ వైద్య సహాయం అవసరం..’ అని పాటిల్ వివరించారు.
ఓఆర్ఎస్ ఎలా సిద్ధం చేయాలి?
“వాణిజ్యపరంగా లభించే ఓఆర్ఎస్ సొల్యూషన్‌లలో సరైన మొత్తంలో పదార్థాలు ఉన్నందున వాటిని తీసుకోవడం ఉత్తమం. వీటిని ఫార్మసీ, కిరాణా దుకాణం లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. అయితే, ఎవరైనా ఈ రెడీమేడ్ ప్రిపరేషన్ నచ్చకపోతే, ఇంట్లో తయారుచేసిన వాటిని ప్రయత్నించవచ్చు. ఇంట్లో ఓఆర్ఎస్ తయారు చేసేటప్పుడు, శుభ్రమైన, సురక్షితమైన త్రాగునీటిని ఉపయోగించడం చాలా ముఖ్యం. అపరిశుభ్రమైన నీటిని ఉపయోగించడం వల్ల పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారవచ్చు . ఎందుకంటే అందులో వ్యాధులకు కారణమయ్యే హానికరమైన సూక్ష్మక్రిములు ఉండవచ్చు..’ అని ఆమె హెచ్చరించారు.
‘నీరు కాచి చల్చార్చండి. ఒక లీటరు నీటికి 6 టీస్పూన్ల చక్కెర, సగం టీస్పూన్ టేబుల్ ఉప్పు కలపండి. ద్రావణాన్ని బాగా కలపండి. విరేచనాలు, వాంతులు అవుతున్నప్పుడు రోజంతా దీన్ని సిప్ చేయడం వల్ల శరీరంలో కోల్పోయిన ద్రవం, ఎలక్ట్రోలైట్‌లను భర్తీ చేయడంలో సహాయపడుతుంది..’ అని వివరించారు.
ఎవరు ఓఆర్ఎస్ తీసుకోకూడదు?
“కిడ్నీ రుగ్మతతో బాధపడుతున్న వారికి, ద్రవం-నియంత్రిత ఆహారంలో ఉన్నవారికి ఓఆర్ఎస్ మంచిది కాదు. వారు డీహైడ్రేషన్ ఎదుర్కొన్నప్పుడు వైద్యుడిని సంప్రదించాలి. అదనంగా, మధుమేహం, రక్తపోటు లేదా గుండె జబ్బులు ఉన్నవారు చక్కెర, ఉప్పు తీసుకోవడం పట్ల జాగ్రత్త వహించాలి.’ అని సూచించారు.
“శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి రోజంతా తగిన మొత్తంలో నీరు త్రాగాలి. అంతేకాకుండా వాంతులు, విరేచనాలు, అధిక జ్వరం, ఉబ్బరంగా ఉండే వాతావరణం కారణంగా ఏర్పడే తేలికపాటి నుండి మితమైన డీహైడ్రేషన్‌కు చికిత్సగా ఓఆర్ఎస్ తీసుకోవడం చాలా సులభమైన మార్గం. గుర్తుంచుకోండి. తీవ్రమైన డీహైడ్రేషన్ ప్రాణాంతక సమస్యలను కలిగిస్తుంది కాబట్టి కేవలం ఓఆర్ఎస్ తీసుకోవడం సరిపోదు. వైద్యుడిని సంప్రదించాలి..’ అని నూపుర్ పాటిల్ వివరించారు.