Left-handers struggles: రెండు చేతులూ ముఖ్యమంటూ.. కుడి చేతే శుభమనే నమ్మకం ఎందుకు?-on international left handers day know their real life struggles ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Left-handers Struggles: రెండు చేతులూ ముఖ్యమంటూ.. కుడి చేతే శుభమనే నమ్మకం ఎందుకు?

Left-handers struggles: రెండు చేతులూ ముఖ్యమంటూ.. కుడి చేతే శుభమనే నమ్మకం ఎందుకు?

Koutik Pranaya Sree HT Telugu
Aug 13, 2024 06:30 PM IST

Left-handers struggles: ఎడమచేతి వాటం వ్యక్తులు అనేక రోజువారీ సవాళ్లను ఎదుర్కొంటారు. వారు తరచుగా తమంతట తాముగా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే
ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే (Pexels)

ప్రపంచమంతా కుడిచేతి వాళ్లకోసమే డిజైన్ చేశారు. బాత్రూమ్‌లో కుళాయి నుంచి చాపింగ్ బోర్డు దాకా ప్రతిదీ వాళ్లకు సౌకర్యంగా ఉండేలాగానే డిజైన్ చేస్తారు. పెద్ద పెద్ద భవనాల ప్లానింగ్ కూడా కుడిచేతి వాళ్ల సౌకర్యం గురించి ఆలోచించే గీస్తారు. ప్రపంచ జనాభాలో కేవలం 10 శాతం మంది మాత్రమే ఎడమ చేతి వాటం ఉన్న వ్యక్తులు ఉండటంతో వాళ్ల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వరు. ప్రపంచమంతా మీమీద ఎదురు దాడి చేస్తుంది అనిపించడంలో తప్పేలేదు.

ఈరోజు అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డే. ఈ సందర్భంగా ఎడమ చేతి వాటం మనుషులు ఎదుర్కొంటున్న సవాళ్లేంటో చూడండి.

సామాజిక అపోహలు:

ఎడమ చేతి వాటం ఉన్న వాళ్లేమో ముందు ఏ వస్తువు ముట్టుకోవాలన్నా, తీసుకోవాలన్నా.. ఎడమ చేయిని ముందుకు చాచుతారు. దాంతోనే ఏ పనైనా మొదలు పెట్టాలనే ఆలోచన వాళ్లలో ఉంటుంది. కానీ వాళ్లను రోజూ అనేక ప్రశ్నలు చుట్టుముడతాయి. ప్రతిరోజూ చేతులు ఎలా కడుక్కుంటారు, ఏ చేతితో తింటారు వంటి అనుచిత ప్రశ్నలను లెఫ్టీలు ఎదుర్కోవాల్సిందే. చెప్పాలంటే వీళ్ల పనులు వాళ్ల స్నేహితులు జోక్ వేసుకోడానికి ఒక అంశంగా పనికొస్తాయి. ఆ ప్రభావం వాళ్ల మీద ఎలా పడుతుందో పట్టించుకోరు. అంతెందుకు పురాతన ఆచారాల్లో కూడా పూజల సమయంలో ఎడమ చేతి వాడకాన్ని అశుభంగా పరిగణిస్తారు. కుడిచేత్తో మొదలు పెడితేనే శుభకరం అంటారు.

రాసేటప్పుడు కష్టాలు:

రాయడం వంటి ప్రాథమిక పని కూడా ఎడమ చేతి వాటం ఉన్నవాళ్లకు ఇబ్బందికరంగా ఉంటుంది. కుడి చేత్లో రాసేవాళ్లు అక్షరాలు రాసుకుంటూ చేతిని ముందుకు కదిలిస్తారు. పెన్నుకు కుడి వైపున చేయి ఉంటుంది. దాంతో రాసిన అక్షరాల తాలూకు సిరా వాళ్ల చేతికి అంటుకోదు. అదే ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ల చేతులు చూడండి. తప్పకుండా చేయికి ఇంకు అంటుకుని ఉంటుంది. రాసిన రాత కూడా అక్కడక్కడా చెదిరి ఉంటుంది. ఎందుకంటే చేయి పెన్నుకు ఎడమవైపు ఉండటం వల్ల సిరా చెదిరిపోతుంది.

నెమ్మదిగా సిరా ఎండిపోయే జెల్ పెన్నులు, ఫౌంటెన్ పెన్నులతో రాయడం వీళ్లకు చాలా కష్టం. ఈ సమస్యను ఎదుర్కోడానికి వాళ్లు పెన్నును కాస్త వెరైటీ కోణంలో పెట్టడం, మణికట్టును ఒత్తిడి పెట్టి ఇబ్బందికరంగా ఉంచి రాయడం అలవాటు చేసుకుంటారు. ఈ చిన్న పనిలో కూడా ఎంత కష్టం ఉందో చూడండి.

బైండింగ్ బుక్స్:

బైండింగ్ బుక్స్ ఎడమ వైపున స్పైరల్ రింగ్ లను కలిగి ఉంటాయి. ఇది పేజీని సులభంగా తిప్పడానికి కుడి చేతి వాళ్లకు సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ లెఫ్టీలకు, బైండర్లు సహనానికి నిజమైన పరీక్ష పెడతాయి. లెఫ్టీ రాసినప్పుడు, వారి చేయి స్పైరల్ కొనలపై నొక్కబడుతుంది. గోక్కోలేని దురద పెడుతుంది. వీటివల్ల చేతిపై ఎర్రటి ముద్రలు కూడా పడతాయి. దానికోసం పదేపదే బుక్ కదిలిస్తూ ఉంటారు.

పరికరాలు:

పీలర్లు వంటి కిచెన్ టూల్స్ చాలావరకు కుడిచేతివాటం ఉన్నవారి కోసం డిజైన్ చేయబడ్డాయి. కొలిచే కప్పులు కుడి వైపున గుర్తులను కలిగి ఉంటాయి. ఆ కొలతలను చదవడం సవాలుగా మారుతుంది. అదేవిధంగా కత్తెర పట్టుకోవడం కూడా కష్టమే. కానీ ఎడమ చేతి వాటం ఉన్నవాళ్లు వీటికి అలవాటు పడటానికి ఎంతో కష్టపడతారు.

డెస్క్ పొజిషన్:

ఆర్మ్ రెస్ట్ లేదా బుక్ రెస్ట్ ఉన్న కుర్చీలతో లెఫ్టీలకు తలనొప్పే. ఈ రకమైన కుర్చీకి అంతర్నిర్మిత టేబుల్ ఒకటి ముందువైపు జతచేయబడి ఉంటుంది. కానీ చాలాసార్లు ఇది కుడి వైపు ఉంటుంది. కుడిచేతి వాటం ఉన్న వ్యక్తులు సహజంగా ఆ టేబుల్ పై తమ చేతిని ఉంచి రాయవచ్చు. అయితే ఎడమ చేతి వారు కుడి వైపు టేబుల్ పై తమ రాత చేతిని పొందడానికి వారి శరీరాన్ని తిప్పాల్సి ఉంటుంది. లేకపోతే, వారి ఎడమ చేయి ఎటువంటి మద్దతు లేకుండా గాల్లో తేలుతూ ఉంటుంది. ఆ ఇబ్బందికరమైన స్థితిలో రాయడం అసౌకర్యంగా ఉంటుంది.

టాపిక్