Oats chilla: బరువు తగ్గించే ఓట్స్ చిల్లా.. కమ్మని అల్పాహారం..
Oats chilla: ఓట్స్ ఒకే రకంగా తినడం బోర్ కొట్టేస్తే ఒకసారి ఓట్స్ చిల్లా ప్రయత్నించి చూడండి. దోశలాగా ఉండి, ఓట్స్ తింటున్నామనే అనిపించదు. ఎలా తయారు చేయాలో చూసి, చేసేయండి.
బరువు తగ్గడానికి అల్పాహారంలో ఓట్స్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఓట్స్ లో పాలుకలిపే తినే కన్నా వాటితో కాస్త భిన్నంగా ఏదైనా ప్రయత్నిస్తే నోటికి కాస్త రుచిగా అనిపిస్తుంది. అలాంటిదే ఈ ఓట్స్ చిల్లా. దాన్నెలా తయారు చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
1 కప్పు ఓట్స్
2 చెంచాల శనగపిండి
2 చెంచాల రవ్వ
1 కప్పు ఉల్లిపాయ ముక్కలు
2 చెంచాల క్యాప్సికం ముక్కలు
సగం కప్పు టమాటా ముక్కలు
2 పచ్చిమిర్చి, ముక్కలుగా కోసుకోవాలి
కొద్దిగా కొత్తిమీర తరుగు
సగం చెంచా అల్లం తురుము
సగం చెంచా జీలకర్ర పొడి
సగం చెంచా కారం
2 చెంచాల నూనె లేదా నెయ్యి
తగినంత ఉప్పు
తయారీ విధానం:
- ఇక ప్యాన్ లో నూనె లేకుండా ఓట్స్ ను 2 నుంచి 3 నిమిషాల పాటూ వేయించుకోవాలి. కాస్త వాసన రాగానే పెద్ద గిన్నెలో వేసుకోవాలి.
2. ఇప్పుడు ఓట్స్ లో రవ్వ, శనగపిండి, కూరగాయ ముక్కలు, మసాలాలు, జీలకర్ర పొడి వేసుకోవాలి.
3. కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఉండలు కట్టకుండా పిండిని పలుచగా కలుపుకోవాలి. మరీ పలుచగా ఉండకుండా చూసుకొని నీళ్లు పోసుకోవాలి.
4. అలా కలుపుకున్న పిండిని ఒక పావుగంట అలా పక్కన పెట్టుకొని నాననివ్వాలి. ఆ తర్వాత పిండి చిక్క బడితే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. చివరగా కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి.
5. పెనం పెట్టుకుని వేడెక్కాక వీటిని మరీ దోశెల్లాగా కాకుండా కాస్త మందంగా పోసుకోవాలి. అంచుల వెంబడి అవసరమైతే నూనె పోసుకోవాలి.
6. ఒక్కో వైపు రెండు నిమిషాలు కాల్చుకుంటే ఓట్స్ చిల్లా రెడీ అవుతుంది. దీన్ని ఏదైనా చట్నీతో లేదా టమాటో కెచప్ తో కూడా తినేయొచ్చు.