Fighting Fish | కోడి పుంజుల కొట్లాటలు, జల్లికట్టులు కాదు.. చేపల పోరు ఎప్పుడైనా చూశారా?
Fighting Fish: కయ్యానికి కాలు దువ్వే కోడిపుంజులను మీరు చాలా సార్లు చూశారు, కానీ కయ్యానికి మొప్పలు దువ్వే చేపలను ఎప్పుడైనా చూశారా? అంటి చేపల పోరు గురించి ఇక్కడ తెలుసుకోండి..
సంక్రాంతి పండగ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు జరుగుతుంటాయి. కోడిపుంజులు కయ్యానికి కాలు దువ్వుతూ, కదనరంగంలో కత్తులు దూసే రసవత్తరమైన పోరును మీరు చాలా సార్లు చూసే ఉంటారు, మరికొన్ని ప్రాంతాలలో జల్లికట్టు పేరుతో జరిగే ఎద్దుల పోటీలను చూసే ఉంటారు, అస్సాం వంటి ప్రాంతంలో ఈ సంక్రాంతి సీజన్ లోనే నిర్వహించే గేదేల పోరు గురించి వినే వింటారు, కానీ ఎప్పుడైనా చేపల పోరాటం గురించి విన్నారా? ఈ చేపల పోరాటం మామూలుగా ఉండదు, సినిమాల్లో నీటిలో చేసే ఫైట్ సీన్ ఏ రేంజ్ ఉత్కంఠతను రేకెత్తిస్తుందో ఈ చేపల పోరు కూడా అదే స్థాయి ఉత్కంఠతను పంచుతుంది.
అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.. చేపల పోరాటం అంటూ ప్రత్యేకంగా ఎలాంటి పోటీని నిర్వహించడం అంటూ జరగదు, కానీ కోడిపుంజులా పౌరుషం చూపించే ఒక ఆసక్తికరమైన చేప రకం గురించి ఇక్కడ తెలుసుకోండి.
Siamese Fighting Fish Facts- సియామీస్ ఫైటింగ్ ఫిష్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు:
సియామీస్ ఫిష్ గురించి మీరెప్పుడైనా విన్నారా? దీనిని సాధారణంగా బెట్ట చేప అని పిలుస్తారు, దీనికి మరో పేరు కూడా ఉంది, దీనిని 'ఫైటింగ్ ఫిష్' అని కూడా పిలుస్తారు. ఇవి ఆగ్నేయాసియా ప్రాంతాలలో పెరిగే మంచినీటి చేపలు.
వీటిని ఫైటింగ్ ఫిష్ అని పిలవటానికి ప్రధాన కారణం వీటి దూకుడు స్వభావం. సాధారణంగా మగ సియామీస్ చేపలే, వాటి ప్రత్యర్థి చేపలతో తగాదాకు దిగుతాయి, వాటితో పోరాడతాయి. ఇవి భీకరమైన పోరాటం చేస్తాయి, ప్రత్యర్థి చేప చనిపోవాలి లేదా పారిపోవాలి అప్పటివరకు ఈ చేప తన పోరాటాన్ని ఆపదు.
అయితే ఈ సియామీస్ చేపలు క్రూరమైనవి కావు, వీటిని ఇండ్లలో అక్వేరియంలో పెంచుకుంటారు. 6 నుండి 7 సెం.మీ పొడవు ఉండే ఈ చేపలు, గోధుమ ఎరుపు రంగులో శరీరం అంతటా నీలం- ఆకుపచ్చ చారలతో ఆకర్షణీయంగా ఉంటాయి, వీటికి ఉన్న పొడవాటి మొప్పలు ప్రత్యేక ఆకర్షణ, ఇవి మీ ఇంటికి ప్రత్యేక అలంకరణను తీసుకొస్తాయి.
సాధారణంగా ఈ చేపలను మిగతా చేపలకు దూరంగా, విడిగా పెంచుతారు. ఇవి దూకుడుగా ఉంటాయి కాబట్టి మిగతా చేపలతో కలిపి పెంచితే వాటితో నిరంతరం భయంకరమైన తగాదాలు పెట్టుకుంటూనే ఉంటాయి. అక్వేరియంలో ఒంటరిగా పెంచుతారు, రెండు చేపలను కలిపి ఉంచితే రెండింటిలో ఏదో ఒకటి చావటం ఖాయం. అయితే ఆడ చేపలు కొంత సహనంతో వ్యవహరిస్తాయి.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నీటిలో ఆక్సిజన్ లేనపుడు మిగతా చేపలు గందరగోళానికి గురవుతాయి, శ్వాస ఆడక ఇబ్బంది పడతాయి, కానీ ఈ ఫైటింగ్ ఫిష్ మాత్రం అలాంటి సందర్భంలో ప్రశాంతంగా ఉంటుంది. ఇవి వాటి పొడవాటి మొప్పల సహాయంతో నేరుగా బయటి గాలిని పీల్చుకుంటాయి.
సియామీస్ చేపలు మాంసాహారం తింటాయి, వివిధ ఎరలను వీటికి ఆహారంగా అందించవచ్చు. కొంచెం కాంతి, నీటిలో ఆల్గేలు, నీటిని శుద్ధపరిచే వ్యవస్థలతో వీటిని పెంచవచ్చు.
టాపిక్