Kanuma Recipes: కనుమ రోజుకు నాటుకోడి కూర ఇలా వండితే అంటే ఒక్క ముక్క మిగలదు
Kanuma Recipes: కనుమ రోజు మాంసాహార వంటలే స్పెషల్. ఆరోజు నాటుకోడి కూరను ఇలా వండండి.
Kanuma Recipes: బ్రాయిలర్ కోడితో పోలిస్తే నాటుకోడి చాలా రుచిగా ఉంటుంది. దీన్ని పెంచే విధానం కూడా సేంద్రియ పద్ధతిలో ఉంటుంది. ఎలాంటి మందులు ఇవ్వకుండా వీటిని పెంచుతారు. కాబట్టి దీని మాంసం చాలా రుచిగా ఉంటుంది. పైగా దీనిలో ఉండే పోషకాలు అధికంగా ఉంటాయి. దీన్ని వండే పద్ధతిలో వండితే రుచి మాములుగా ఉండదు. గ్రేవీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఈ గ్రేవీని గారెలతో, బిర్యానీతో తింటే ఆహా అనిపించేలా ఉంటుంది. రుచి నాటుకోడి కూరను ఎలా ఉండాలో చూద్దాం.
నాటుకోడి కూర రెసిపీకి కావలసిన పదార్థాలు
నాటుకోడి కూర - కిలో
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను
జీలకర్ర - అర స్పూను
బిర్యానీ ఆకులు - మూడు
షాజీరా - అర స్పూను
ఉల్లిపాయలు - రెండు
కారం - రెండు స్పూన్లు
కొత్తిమీర - ఒక కట్ట
నూనె - తగినంత
గసగసాలు - ఒక స్పూను
జీడిపప్పు - గుప్పెడు
దాల్చిన చెక్క - రెండు ముక్కలు
లవంగాలు - ఐదు
యాలకులు - నాలుగు
ఉప్పు - రుచికి సరిపడా
నాటుకోడి కూర రెసిపీ
1. నాటుకోడి కూరను బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు మిక్సీ జార్లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, గసగసాలు, జీడిపప్పు, కొత్తిమీర, జీలకర్ర వేసి పేస్టులా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
3. అవసరమైతే నీళ్లను పోసుకోవచ్చు.
4. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేయాలి.
5. అందులో బిర్యానీ ఆకులు, షాజీరా వేసి వేయించాలి.
6. ఉల్లిపాయలను సన్నగా తరిగి అందులో వేసి వేయించాలి. వాటి రంగు మారేవరకు ఉంచాలి.
7. ఆ తర్వాత నిలువుగా కోసిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి వేయించాలి.
8. ఇప్పుడు నాటుకోడి కూరను వేసి కలిపి మూత పెట్టి పది నిమిషాలు మగ్గించాలి.
9. అందులో పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పును వేసి కలపాలి.
10. రెండు మూడు నిమిషాలు ఉడికాక మిక్సీలో చేసుకున్న పేస్టును వేసి బాగా కలపాలి.
11. ఒక కప్పు నీరు వేసి ఒకసారి కలిపి మూత పెట్టాలి. నాటుకోడి కూర ముక్కలు గట్టిగా ఉంటాయి.
12. కాబట్టి కనీసం 6 నుంచి 8 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి.
13. ఆ తర్వాత కుక్కర్ మూత తీస్తే చిక్కటి గ్రేవీ రెడీ అయిపోతుంది.
14. పైన కొత్తిమీర తరుగును చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరి. దీన్ని బిర్యానితో తింటే నోరూరిపోతుంది.