Karam Podi: నల్ల కారం పొడి ఇలా చేసుకుంటే ఇడ్లీ, దోశెల్లోకి రుచిగా ఉంటుంది
Karam Podi: ఇడ్లీ, దోశెల్లోకి ఎన్ని చట్నీలున్నా పైన నల్ల కారం పొడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నల్లకారం పొడి చేసి పెట్టుకుంటే నెలల పాటూ నిల్వ ఉంటుంది.
Karam Podi: తెలుగిళ్లల్లో ఇడ్లీ తినేటప్పుడు చట్నీతో పాటూ ఏదో ఒక కారం పొడి ఉండాల్సిందే. ఇక్కడ మేము నల్లకారం పొడి రెసిపీ ఇచ్చాము. ఇది చూడటానికి కాస్త నల్లగా ఉంటుంది.అందుకే దీన్ని నల్లకారం పొడి పిలుస్తారు. ఇది మంచి నెయ్యి వాసన వస్తుంది కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి దీన్ని తిని చూడండి మీకు కచ్చితంగా నచ్చుతుంది.
నల్ల కారం పొడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
ధనియాలు - అరకప్పు
పొట్టు తీయని మినుములు - రెండున్నర స్పూన్లు
జీలకర్ర - ఒక స్పూను
శెనగపప్పు - ఒక స్పూను
కరివేపాకులు - ఒక కప్పు
ఎండు మిర్చి - తొమ్మిది
వెల్లుల్లి రెబ్బలు - అయిదు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - మూడు స్పూన్లు
నెయ్యి - ఒక స్పూను
చింత పండు - చిన్న నిమ్మకాయ సైజులో
నల్లకారం పొడి రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి అర స్పూను నూనె వేయాలి. అందులో జీలకర్ర వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
2. అదే కళాయిలో అరస్పూను నూనె వేయాలి. అందులో శెనగపప్పు, నల్ల మినుములు వేసి వేయించాలి. అలాగే ఎండు మిర్చి కూడా వేసి వేయించాలి.
3. అందులోనే ధనియాలు వేసి వేయించుకోవాలి.
4. చివరలో కరివేపాకులు వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి.
5. అన్నీ చల్లారాక వాటిని మిక్సీలో వేయాలి. చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పును వేసి పొడిలా చేసుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. మంట చిన్నగా పెట్టాలి.
7. ఆ నెయ్యిలో మిక్సీలో రుబ్బుకున్న పొడిని వేసి ఒక నిమిషం పాటూ వేయించాలి. స్టవ్ ఆఫ్ చేయాలి
8. తరువాత ఒక ప్లేటులో ఆ పొడిని వేసి చల్లార్చాలి.
9. ఈ పొడిని ఒక డబ్బాలో వేసి మూత పెట్టి దాచుకోవాలి. ఇది కొన్ని నెలల పాటూ నిల్వ ఉంటుంది.
ఈ పొడి నుంచి నెయ్యి వాసన వస్తుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి ఇడ్లీ పై నల్లపొడి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. దోసెలపై కూడా ఈ పొడిని వేసుకుని తింటే బావుంటుంది. నల్లకారం పొడితో చట్నీ లేకుండా ఇడ్లీని తినేయచ్చు.