Liver Masala: స్పైసీ మటన్ లివర్ మసాలా, ఒక్కసారి ఇలా చేసి చూడండి-mutton liver masala recipe in telugu know how to make this fry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Liver Masala: స్పైసీ మటన్ లివర్ మసాలా, ఒక్కసారి ఇలా చేసి చూడండి

Liver Masala: స్పైసీ మటన్ లివర్ మసాలా, ఒక్కసారి ఇలా చేసి చూడండి

Haritha Chappa HT Telugu
Apr 06, 2024 11:30 AM IST

Liver Masala: నాన్ వెజ్ ప్రియులకు లివర్ మసాలా పేరు చెబితేనే నోరూరిపోతుంది. దీన్ని స్పైసీగా, టేస్టీగా ఎలా చేయాలో ఇక్కడ చెప్పాము. దీని రెసిపీ చాలా సులువు.

లివర్ మసాలా రెసిపీ
లివర్ మసాలా రెసిపీ (Youtube)

Liver Masala: మటన్ లివర్‌ను ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. మటన్ లివర్ తో వేపుడు కూరలు వండుకునేవారు ఎంతోమంది. ఓసారి లివర్ మసాలా రెసిపీ ట్రై చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వండడానికి సుమారు 50 నిమిషాల సమయం పడుతుంది. మెత్తగా ఉడికితేనే ఇవి రుచిగా ఉంటాయి. వండడం పెద్ద కష్టమేమీ కాదు ఉడకడానికి కాస్త సమయం తీసుకుంటుంది. లివర్ మసాలా రెసిపీ ఎలాగో ఇక్కడ ఇచ్చాం. ఒకసారి ప్రయత్నించి చూడండి.

లివర్ మసాలా రెసిపీకి కావలసిన పదార్థాలు

మటన్ లివర్ - అరకిలో

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

నిమ్మరసం - అర స్పూను

నూనె - తగినంత

నీరు - సరిపడినన్ని

కొబ్బరిపొడి - ఒక స్పూను

పసుపు - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

కారం - ఒక స్పూను

యాలకులు - రెండు

లవంగాలు - నాలుగు

ధనియాల పొడి - అర స్పూను

కొబ్బరిపొడి - ఒక స్పూను

పాలు - అర కప్పు

లివర్ మసాలా రెసిపీ

1. మటన్ లివర్‌ను చిన్న ముక్కలుగా కోసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు పోసి ఆ పాలల్లో శుభ్రంగా కడిగిన లివర్ ముక్కలను వేసి అరగంట పాటు వదిలేయాలి.

3. ఆ తర్వాత ఆ లివర్ ముక్కలను తీసి శుభ్రంగా నీటితో కడిగి ఒక గిన్నెలో వేయాలి.

4. ఆ గిన్నెలో కారం, ఉప్పు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

6. నూనెలో లవంగాలు, యాలకులు వేసి చిటపటలాడించాలి.

7. అందులోనే మ్యారినేట్ చేసుకున్న లివర్ ముక్కలను కూడా వేసి ఐదు నిమిషాలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

8. అదే కళాయిలో మరికొంచెం నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి.

9. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కూడా వేసి కలుపుకోవాలి.

10. అవి వేగాక కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి.

11. ఒక ఐదు నిమిషాల తర్వాత చిన్న మంట మీద పెట్టి నీరు వేసి ఉడికించాలి. ఇది మసాలా గ్రేవీలా ఉడుకుతుంది.

12. ఆ గ్రేవీలో లివర్ ముక్కలను వేసి చిన్న మంట మీద పెట్టి మూత పెట్టి ఉడికించాలి.

13. తర్వాత మూత తీసి గరం మసాలా, కొత్తిమీర తరుగును చల్లుకొని మూత పెట్టేయాలి.

14. ఒక పది నిమిషాల పాటు చిన్నమంట మీద ఉడికించాలి.

15. ఫ్రైలాగా అయ్యాక స్టవ్ కట్టేయాలి. పైన నిమ్మరసం చల్లుకొని సర్వ్ చేయాలి.

16. ఈ లివర్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారు అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.

మటన్ లివర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ b12, ఐరన్ అధికంగా ఉంటాయి. ఎవరైతే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారో వారు తరచూ మటన్ లివర్‌ను తినడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మహిళలు, పిల్లలు రక్తహీనత సమస్యతో బాధపడతారు. అలాంటివారు మటన్ లివర్ తినడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు. వేసవిలో మటన్ తినడం వల్ల శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవచ్చు. దీనిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే అధిక నాణ్యత గల ప్రోటీన్ ను ఈ మటన్ లివర్ కలిగి ఉంటుంది. కాబట్టి మటన్ తినేటప్పుడు కచ్చితంగా లివర్ ను తినాలి. అవసరమైన అమైనో ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. నెలకు కనీసం రెండు మూడు సార్లు మటన్ లివర్‌ను తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలను పొందవచ్చు.

Whats_app_banner