Motichoor ladoo Recipe: మోతీచూర్ లడ్డూ కొనడం ఎందుకు? ఇంట్లోనే ఇలా చేసేయండి
Motichoor ladoo Recipe: మోతీచూర్ లడ్డూ అంటే ఎంతో మందికి ప్రాణం. దీన్ని ఇంట్లోనే ఈజీగా చేయొచ్చు.
Motichoor ladoo Recipe: సాంప్రదాయ స్వీట్లలో మోతీచూర్ లడ్డూది ప్రథమ స్థానం. దీపావళి వచ్చినా, పుట్టినరోజు వేడుకలైన అందరికీ ఎక్కువగా పంచేది మోతీచూర్ లడ్డూని. దీన్ని తయారు చేయడం చాలా సులువు. ప్రతిసారీ కొనుక్కునే కన్నా ఇంట్లోనే ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటే తాజాగా, టేస్టీగా ఉంటుంది. మోతీచూర్ లడ్డూను సింపుల్ గా ఎలా చేయాలో చూద్దాం.
మోతీచూర్ లడ్డూ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
శెనగపిండి - రెండున్నర కప్పులు
యాలకుల పొడి - స్పూను
ఆలివ్ నూనె - రెండు కప్పులు
బేకింగ్ సోడా - చిటికెడు
చక్కెర - మూడు కప్పులు
నీళ్లు - రెండు కప్పులు
ఆరెంజ్ ఫుడ్ కలర్ - అర స్పూను
మోతీచూర్ లడ్డూ రెసిపీ
1. ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులో శెనగపిండిని వేయండి. అందులోనే నారింజరంగు ఫుడ్ కలర్‌ని కూడా కలపండి.
2. నీరు, బేకింగ్ సోడా వేసి ముద్దలు లేకుండా బాగా కలపండి. ఇది అట్లు పిండిలా జారేలా ఉండాలి.
3. ఇప్పుడు పెద్ద కళాయిని స్టవ్ మీద పెట్టి ఆలివ్ నూనె వేసి వేడి చేయండి.
4. ఆలివ్ నూనె లేనివారు సాధారణ నూనెను కూడా వాడుకోవచ్చు.
5. ఇప్పుడు చిల్లుల గరిట పై శనగపిండి మిశ్రమాన్ని వేసి బూందీ లాగా చేయండి.
6. ఆ బూందీని టిష్యూ పేపర్ పై వేసి అదనపు నూనెను తొలగించండి.
7. ఇప్పుడు స్టవ్ మీద మరో కళాయి పెట్టి పంచదార నీరు వేసి కాస్త తీగపాకం వచ్చేలా చేయండి.
8. అందులోనే యాలకుల పొడి చేసి వేయండి.
9. ఈ పంచదార పాకంలో బూందీని వేసి కలపండి.
10. స్టవ్ కట్టేసి దాన్ని అది చల్లారే వరకు ఉంచండి.
11. కాస్త గోరువెచ్చగా మారాక చేతులకి నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టుకొండి.
12. ఒక జీడిపలుకును లడ్డూపై పెట్టండి. అంతే టేస్టీ మోతీచూర్ లడ్డూ రెడీ అయిపోయినట్టే.
13. మీకు కావాలంటే పిస్తా పప్పులు, బాదం పప్పులను సన్నగా తరిగి ఇందులో కలుపుకోవచ్చు. నూనెకి బదులు నెయ్యిలో కూడా వీటిని వేయించుకోవచ్చు.
టాపిక్