Monday motivation: పక్షులు చెప్పే జీవిత పాఠాలు.. ఆశ్చర్యపరిచే వాస్తవాలు
Monday motivation: నేర్చుకోవాలే గానీ ప్రతి దాంట్లో మంచి ఉంటుంది. అలా పక్షి కూడా మనకు గొప్ప నీతి పాఠాలు చెబుతోంది. అవేంటో చూడండి.
పిట్ట కొంచెం కూత ఘనం అని ఊరికే అనలేదు. మనం ఈ సామెతను ఎలా వాడుతున్నా సరే.. పిట్ట లేదా పక్షి ఘనత మాత్రం గొప్పే. గుప్పెడంత కూడా లేని పక్షులు మనకు చెప్పే జీవిత పాఠాలు గంపెడు. ఈ పాఠాల్ని మనం గౌరవించాల్సిందే. పాటించాల్సిందే.
1. అలుపు లేని పోరాటం:
పక్షులు గూడు కట్టుకునే విధానం చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కో కొమ్మ, పుల్ల తెచ్చి గూడును అల్లేస్తాయి. అంత కష్టపడి కట్టుకున్న ఇల్లు వానకో, వరదకో, గాలికో, మనుషుల వల్లో నాశనం అయిపోతుంది. అలాగని అవి ఓడిపోయామని, అలిసి పోయామని ఊరుకుంటాయా? లేదు.. మళ్లీ మరో చోటు వెతుక్కుని కొత్త గూడు కట్టుకుంటాయి. మనం కూడా ఇలా ఓటమి ఒప్పుకోకుండా ప్రయత్నిస్తూ ఉంటే విజయమే మన వెంట వస్తుంది.
2. పిల్లల సంరక్షణ:
పక్షులే కదా వాటికేం ప్రేముంటుంది అనుకోలేము. గుడ్డు పెట్టింది మొదలు పొదిగి పిల్లలయ్యే దాకా వాటిని సంరక్షిస్తుంది పక్షి. అవి రెక్కలు విప్పుకుని ఎగరడం నేర్చుకునే దాకా రోజూ గూటికే ఆహారం తెచ్చిస్తుంది. అవకాశం ఉంటే గమనించండి. తప్పకుండా ఒక సమయానికి వాటికి ఆహారం తేవడం మాత్రం ఏ పక్షీ మర్చిపోదు. నోటితో ప్రేమగా తినిపిస్తుంది వాటికి. ఆ బాధ్యతను చాలా ఓర్పుగా నెరవేరుస్తుంది. మనమైతే మనుషులం. భావోద్వేగాలున్నవాళ్లం. మనం తల్లిదండ్రులుగా నిర్వర్తించాల్సిన బాధ్యతలుంటాయని పక్షి మనకు నేర్పుతోంది.
3. మిత భోజనం:
గంపెడు ధాన్యం బయట ఆరబోసినా కూడా పక్షి దానికి కావాల్సిన నాలుగైదు గింజలు తీసుకుని ఎగిరిపోతుంది. ఉన్నాయి కదాని తింటూ కూర్చోదు. మితంగా తినడం ఎంత అవసరమో పక్షి నుంచి తెల్సుకోవచ్చు. రాత్రి పూట పక్షి భోజనం చేయదు. అలాగే తన ఆహారపు అలవాట్లను ఎప్పటికీ మార్చుకోదు. అలాగే ఎప్పుడూ ఒక చోట కూర్చుని ఉండదు. ఎగురుతూనే ఉంటుంది. మన జీవన శైలి ఎలా ఉండాలో, మనం ఆరోగ్యం కోసం ఏం నేర్చుకోవాలో చూడండి.
4. గూటికి చేరడం:
దినమంతా ఆహారం కోసం, షికారు కోసం బయటికి వెళ్లి ప్రకృతిలో గడుపుతాయి. చీకటి పడకముందే గూటికి చేరుకుంటాయి. పిల్లలతో కలిసి జీవిస్తాయి. ఆ సమయంలో ఎంతో ఆనందంగా కూస్తాయవి. చూశారా మనం కూడా చెడు తిరుగుళ్లు తిరగకుండా ఇంటికి చేరుకుంటే ఎంత బాగుంటుందో పక్షి మనకు గుర్తు చేస్తోంది.
5. సొంత ఇల్లు:
మనమైనా ఒక ఇంట్లో అద్దెకుంటున్నాం కానీ.. పక్షులు పొరపాటున కూడా పక్క పక్షి పెట్టిన గూటిలో తలదాచుకోవు. వాటికోసం దొరికిన స్థలంలో మాత్రమే ఒక గూడు కట్టుకుంటాయి. ఆ గూడుకు ఏమైనా అయితే మళ్లీ ఇంకోటి కట్టుకుంటాయి. కొన్ని రకాల గూళ్లు పెద్ద తుఫానులు వచ్చినా కూడా లోపలున్న పక్షులకు మాత్రం ఏమీ కాకుండా నిర్మించుకుంటాయి. చిన్నదో పెద్దదో ఒక సొంతిల్లు ఉండాలని పక్షిని చూసి నేర్చుకోవాల్సిందే.
6. నిద్రపోదు:
మనకు వంద పనులుంటాయి. అయినా రోజూ ఉదయాన్నే నిద్ర లేవంటే బద్ధకం. కానీ పక్షిని చూడండి. ఏ పరిస్థితి అయినా, ఏ కాలం అయినా సూర్యోదయం కన్నా ముందే ప్రకృతిలోకి చేరుకుంటుంది. హాయిగా విహరిస్తుంది. తన బాధ్యతలను, పనులను పూర్తి చేసుకుంటుంది.