హైదరాబాద్‌లో కోటిలోపు ఇల్లు దొరకాలంటే కష్టమే.. మిడిల్ క్లాస్ వాళ్లు కొనడం ఇక కలే!-real estate it is difficult to buy house under 1 crore in hyderabad middle class people cant buy home in pearl city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  హైదరాబాద్‌లో కోటిలోపు ఇల్లు దొరకాలంటే కష్టమే.. మిడిల్ క్లాస్ వాళ్లు కొనడం ఇక కలే!

హైదరాబాద్‌లో కోటిలోపు ఇల్లు దొరకాలంటే కష్టమే.. మిడిల్ క్లాస్ వాళ్లు కొనడం ఇక కలే!

Anand Sai HT Telugu
Jul 02, 2024 03:30 PM IST

Real Estate In Hyderabad : హైదరాబాద్‌లాంటి నగరంలో ఇల్లు కొనుక్కోవాలని మధ్య తరగతివారి కల. కానీ ధరలు చూస్తే మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యుడు ఇల్లు కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే కోటి రూపాయలలోపు ఇల్లు దొరకడం కష్టంగా ఉంది.

హైదరాబాద్
హైదరాబాద్

భాగ్యనగరం రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటికే నగర శివార్లుదాటి.. బోలేడు వెంచర్లు వెలుస్తున్నాయి. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీనితో ఇక్కడ ఇల్లు కొనాలంటే సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి.

మధ్యతరగతి ప్రజలకు హైదరాబాద్‌లో ఇళ్లు అందుబాటులో లేకుండా పోతున్నాయా? అంటే అవుననే అనిపిస్తుంది మార్కెట్ పరిస్థితి చూస్తే. డెవలపర్స్ కూడా ధరలు దారుణంగా చెబుతున్నారు. దీంతో సొంత ఇంటి కల సామాన్యుడికి అందని ద్రాక్షగానే కనిపిస్తుంది. తమ కలల ఇంటిని పొందడానికి రూ.1 కోటి బడ్జెట్ కూడా సరిపోదని చాలామంది మధ్యతరగతి వారు ఆవేదన చెందుతున్నారు.

హైదరాబాద్ వంటి నగరంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ధరలు తగ్గవని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పల్లెల నుంచి పట్టణాలకు వచ్చిన చాలామంది అద్దె ఇళ్లలోనే గడుపుతున్నారు. సొంత ఇంటిని కొనేందుకు కోటి రూపాయలు పెట్టలేక సతమతమవుతున్నారు. భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడుతుందని అనుకున్నా.. చదువుల దృష్ట్యా అంత అంత డబ్బులు పెట్టలేకపోతున్నారు.

'నేను హైదరాబాద్ వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. మెుదట్లో ఇక్కడ ఉండలేమని ఇంటిని కొనాలనే ఆసక్తి లేదు. తర్వాత ఇల్లు కొందామంటే.. 85 లక్షల నుంచి కోటిపైనే చెబుతున్నారు. ఇప్పుడు కొనే పరిస్థితి లేదు. భూమి భవిష్యత్తుకు మంచి పెట్టుబడి. కానీ కోటిపైనే పెట్టుబడి పెట్టడం అంటే చాలా కష్టమైన పని.' అని మంథనికి చెందిన రాజు అనే వ్యక్తి HT Teluguతో చెప్పారు.

ప్రైవేట్ ఉద్యోగులు 50 నుంచి 70 లక్షల బడ్జెట్‌లో ఇల్లు కొనుక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. దొరకడం లేదు. లోన్లు అంతకుమించి ఇవ్వాలంటే బ్యాంకులు తిప్పలు పెడుతున్నాయి. నగరం శివారు ప్రాంతాల్లోనూ ఇళ్ల ధరలు మండిపోతున్నాయి. డెవలపర్లు కూడా ఒక్క రూపాయి తగ్గించడం లేదు. దీంతో చాలా మంది ఇంటిని కొనలేక అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు.

నగర శివారు అయిన నారపల్లి, కొర్రెములలాంటి ప్రాంతాలు.. ఉప్పల్ నుంచి తొమ్మిది కిలో మీటర్ల దూరంలో ఉంటాయి. అయితే ఇక్కడ వెలసిన వెంచర్లలోనూ 90 లక్షలకు తక్కువగా ఎవరూ ధరలు చెప్పడం లేదు. దీంతో చాలామంది సామాన్యులు సొంత ఇంటి కలను నెరవేర్చుకోలేకపోతున్నారు. భాగ్యనగరం చుట్టుపక్కల ఉన్న చాలా శివారు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

హెచ్ఎండీఏ పరిధిలో ఇల్లు కొనాలి అంటే మధ్యతరగతివారికి ఒక్క జీవితం సరిపోదు అన్నట్టుగా ఉంది. సిటీ రోజురోజుకు అభివృద్ధి కావడం, కోర్ సిటీకి మెట్రో కనెక్టివిటీని మెరుగుపరచడం వంటివి రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై పెద్ద ప్రభావాన్ని చూపించాయి.

కొనుగోలుదారులు చౌక, సరసమైన ధరలో ఇళ్ల కోసం వెతుకుతూనే ఉన్నారు. అంతేకాదు రెండు మూడు ఏళ్ల కింద ఓ బడ్జెట్ అనుకుని.. ఇప్పుడు ఇంటిని కొనేందుకు చూస్తున్నా.. పరిస్థితులు మారిపోయాయి. ఒకవేళ అనుకున్న విధంగా ఇల్లు కావాలంటే శివారు ప్రాంతాల్లో ఏదో ఒక మూలన చూపిస్తున్నారు డెవలపర్లు. పూర్తిస్థాయిలో ఆ ప్రాంతాలకు అభివృద్ధి చేరుకోవాలంటే మరో ఐదు, పదేళ్లు పట్టే అవకాశం ఉంది. మెుత్తానికి హైదరాబాద్ నగరంలో ఇంటిని కొనడమంటే.. సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి.

WhatsApp channel