Mansa Moosa: ప్రపంచంలో ఇప్పటివరకు బతికిన వాళ్లలో అత్యంత ధనవంతుడు ఈయనే, అంబానీలు కూడా ఇతను ముందు దిగదుడుపే-mansa musa he is the richest man who has ever lived in the world ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Mansa Musa, He Is The Richest Man Who Has Ever Lived In The World

Mansa Moosa: ప్రపంచంలో ఇప్పటివరకు బతికిన వాళ్లలో అత్యంత ధనవంతుడు ఈయనే, అంబానీలు కూడా ఇతను ముందు దిగదుడుపే

Haritha Chappa HT Telugu
Mar 20, 2024 02:00 PM IST

Mansa Musa: ప్రపంచంలో ఎంతోమంది ధనవంతులు ఈ భూమ్మీద జీవించారు. ఇప్పటికీ ఎంతోమంది జీవిస్తున్నారు. వారందరిలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా? మాన్సా మూసా.

మాన్సా మూసా
మాన్సా మూసా

Mansa Musa: ధనవంతుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది అంబానీలు, అదానీలే. కానీ వీరిని మించిన అత్యంత ధనవంతుడు ఈ భూమి మీద జీవించాడు. అప్పట్లోనే ఆయన ధనాన్ని మోసేందుకు వందల మంది సిబ్బంది పనిచేసేవారు. ఇప్పుడు అంబానీల దగ్గర ఉన్న ఆస్తి అతనికి లెక్కలోకి కూడా రాదు. అతని పేరు మాన్సా మూసా. అతను ఒక ఆఫ్రికన్ రాజు. ఇప్పటివరకు భూమి పై జీవించిన మనుషుల్లో అత్యంత ధనవంతుడు ఈయనే. ఇంతవరకు ఇతని ఆస్తిని దాటి సంపాదించిన వారు లేరు. ఆఫ్రికాలో ప్రస్తుతం పేద దేశంగా ఉన్న మాలి... ఒకప్పుడు మాన్సా మూసా రాజ్యం. దాన్ని టింభక్తు అని పిలిచేవారు. 2000 మైళ్ల పరిధిలో ఈ టింభక్తు రాజ్యం ఉండేది. వందల ఏళ్ల క్రితం ఈ రాజ్యాన్ని మాన్సా మూసా పాలించాడు.

పేదవారే లేరు

మాన్సా మూసా పుట్టుకతోనే ధనవంతుడు. అయితే ఆయన తన తెలివితేటలతో ఆస్తులను కొన్ని వేలరెట్లు పెంచుకున్నాడు. ఆయన దగ్గర ఉన్న బంగారు కడియాలు మోయడానికే వందల మంది పనివారిని పెట్టుకునేవారు. మాన్సా మూసా ఎక్కడకు వెళ్లిన ఆయన వెంట వందల మంది సైనికులు, వంట వాళ్లు, గుర్రాలు, కళాకారులు, పనివాళ్ళు, కూరగాయలు, గొర్రెలు, ఇలా పెద్ద తతంగమే వెంట వెళ్లేది. మాన్సా మూసానే కాదు ఆయన దగ్గర పని చేసే పనివాళ్లు కూడా బంగారంతో నేసిన వస్త్రాలను వేసుకునేవారు. ఆయన రాజ్యంలో జీవించిన వ్యక్తులంతా ధనవంతులుగానే ఉన్నారు. పేదవారు... మాన్సా మూసా రాజ్యంలో లేరని చెబుతారు.

ఎంత ఆస్తిపరుడు?

మాన్సా మూసా రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు అతని దేశంలో బంగారు గనులు అధికంగా ఉండేవి. అలాగే ఉప్పునిక్షేపాలు ఉండేవి. వాటిని ఆయన తన తెలివితో ఎగుమతి చేసి వేలరెట్లు ఆస్తులను సంపాదించాడు. అలాగే ఏనుగు దంతాల వ్యాపారాన్ని కూడా చేసేవాడు. ఇవన్నీ కూడా అధిక సంపదను తెచ్చిపెట్టాయి. అతని ఆస్తి దాదాపు 31 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇంత ఆస్తిని ఇప్పటివరకు ఎవరూ సంపాదించలేదు. ప్రపంచంలో ఉన్న బంగారంలో సగం మాన్సా మూసా దగ్గరే ఉండేదని అంటారు.

ఇప్పుడేమైంది?

కాలం గడుస్తున్న కొద్ది మాన్సా మూసా పద్దతులు మారాయి. ఆయన మరణించాక పరిస్థితులు కూడా మారిపోయాయి. టింబక్తు దేశం తరువాత మాలిగా మారిపోయింది. ఆ బంగారు నేల ఇప్పుడు తినడానికి తిండి లేక కరువు ప్రాంతంగా మారిపోయింది. మాన్సా మూసా కనుమరుగయ్యాక పరాయి దేశాలు వారు వచ్చి బంగారాన్ని, ఇక్కడ ఆస్తిని మొత్తం దోచుకుపోయారని చెబుతారు. ముఖ్యంగా బ్రిటన్ దేశానికే ఎక్కువ బంగారం చేరినట్టు చరిత్రకారులు వివరిస్తున్నారు.

మాన్సా మూసా బతికున్నప్పుడు కూడా ఆయన చేసిన కొన్ని పనులు పేదరికం తెచ్చిపెట్టాయని అంటారు. ఎంతో బంగారాన్ని చలామణీలో లేకుండా చేశాడు. విపరీతంగా ఖర్చులు చేశాడు. దేశ ఆర్థిక వ్యవస్థలో లేనిపోని మార్పులను చేశాడు. వీటి వల్ల కూడా తీవ్రంగా నష్టపోయారు. ఇక మాన్సా మూసా మరణించాక పరాయి దేశాల వారి కన్ను టింబక్తు పై పడింది. చివరకు టింభక్తు పేద మాలీ దేశంగా మారిపోయింది.

మాన్సా మూసా ఓసారి మక్కా ప్రయాణానికి వెళ్ళాడు. అది ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయిన ప్రయాణం. టింభక్తు నుంచి మక్కా వెళ్లాలంటే దాదాపు 2700 మైళ్ళు ప్రయాణించాలి. రాజ్యాన్ని తన కొడుక్కి అప్పగించి మక్కాకు బయలుదేరాడు మాన్సా మూసా. తనతో పాటు 60 వేల మంది మగపని వారిని తీసుకెళ్లాడు. అలాగే 12,000 మంది బానిసలు కూడా వెళ్లారు. వీరంతా తమతో పాటు కిలోన్నర బంగారు కడ్డీలను మోసుకెళ్లారు. గుర్రాలు, ఒంటెలు, ఆహారం, వంట వాళ్లు ఇలా అధిక సంపదతో మక్కాకు ప్రయాణమై వెళ్ళాడు మాన్సా మూసా. అందుకే ఆ ప్రయాణం చరిత్రలో నిలిచిపోయింది. ఇంత ధనవంతుడి గురించి ఇప్పటికీ మాలీ దేశంలో కథకథలుగా చెప్పుకుంటారు.

WhatsApp channel

టాపిక్