మంగళగౌరీ వ్రతం చేసుకున్నప్పుడు పసుపు, కుంకుమలు వాయనం ఇవ్వరు.. ఎందుకో తెలుసా?-mangala gowri vratham puja rituals and significance ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మంగళగౌరీ వ్రతం చేసుకున్నప్పుడు పసుపు, కుంకుమలు వాయనం ఇవ్వరు.. ఎందుకో తెలుసా?

మంగళగౌరీ వ్రతం చేసుకున్నప్పుడు పసుపు, కుంకుమలు వాయనం ఇవ్వరు.. ఎందుకో తెలుసా?

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 02, 2022 10:11 AM IST

Mangala Gowri Vratham : శ్రావణమాసం మహిళలకు ఎంత ఇష్టమనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మాసంలో పూజలు, వ్రతాలు అంటూ బిజీబిజీగా ఉంటారు. శ్రావణమాసంలో మంగళవారాలకు కూడా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళగౌరీ వ్రతం చేసుకుంటారు. అయితే ఈ వ్రతం చేశాకా.. వాయినం ఇచ్చేటప్పుడు పసుపు, కుంకుమ ఇవ్వరంటా.. ఎందుకో ఇప్పుడు తెలుసకుందాం.

<p>మంగళ గౌరీ వ్రతం</p>
<p>మంగళ గౌరీ వ్రతం</p>

Mangala Gowri Vratham : శ్రావణమాసంలోని నాలుగు మంగళవారాలు.. మహిళలు మంగళగౌరీ వ్రతాలు చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల తమ ఐదవతనం కలకాలం నిలుస్తుందని భావిస్తారు. అందుకే శ్రావణమాసంలోని ప్రతి మంగళవారం.. కొత్తగా పెళ్లైయిన మహిళలు ఎక్కువగా మంగళగౌరీ వ్రతం చేస్తారు. భక్తి, శ్రద్ధలతో గౌరీదేవిని పూజిస్తారు.

వివాహమైన సంవత్సరం నుంచి.. ఐదు సంవత్సరాలా పాటు ఈ వ్రతాన్ని కచ్చితంగా చేసుకుంటారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింట్లోనూ.. తర్వాత నాలుగు సంవత్సరాలు అత్తవారింట్లోనూ ఈ వ్రతాన్ని చేసుకుంటారు. ఈ వ్రతం చేయడం వల్ల భోగభాగ్యాలే కాకుండా.. దీర్ఘ సుమంగళిగా ఉంటారని భావిస్తారు.

వ్రత వాయనం ఎవరికి ఇవ్వాలి..

పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి.. త్రిపురాసుర సంహారం చేశారని ప్రతితీ. అందుకే మంగళగౌరిని వ్రతం చేస్తే.. ఆ మాత ఆశిస్సులు దక్కుతాయని భక్తులు నమ్ముతారు. తొలిసారిగా నోము చేసేవారు వారి పక్కనే తల్లిని ఉంచుకుని పూజ చేస్తే మంచిది. అలాగే తొలి వాయనాన్ని తల్లికి ఇస్తే ఇంకా మంచిది. తల్లి లేని పక్షంలో అత్తకి గానీ.. ఇతర ముత్తైదువులకు వాయినం ఇస్తారు.

వ్రత నియమాలు

వ్రతాన్ని ఆచరించే ముందురోజు.. వ్రతం రోజు కూడా దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. అంతేకాకుండా వ్రతం రోజు ఉపవాసం ఉండాలి. వ్రతానికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి వాయనం ఇవ్వాలి. ఒకే మంగళగౌరీ దేవి విగ్రహాన్ని.. ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు.

పైగా వాయనం ఇచ్చేటప్పుడు పసుపు, కుంకుమలు ఇవ్వకూడదు అంటారు. ఎందుకంటే సౌభాగ్యంకోసం వ్రతం చేస్తున్నప్పుడు.. పసుపు, కుంకుమలు ఇవ్వడం మంచిది కాదని భావిస్తారు. పసుపు, కుంకుమలతో ముత్తైదువుకి బొట్టు పెట్టొచ్చుకానీ.. చేతికి ఇవ్వకూడదంటారు. అయితే ఇటీవల కాలంలో చాలా మంది.. వాయనంతో పాటు.. పసుపు, కుంకుమ ప్యాకెట్లను ఇస్తున్నారు.

వ్రతం పూర్తైన తర్వాత.. వినాయక చవితి తర్వాత.. వినాయక నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి. పూజకు గరిక, తంగెడు పూలు కచ్చితంగా ఉపయోగించాలి.

సంబంధిత కథనం